"ఒక్కబిందె మంచినీళ్లు తెచ్చివ్వవే రాజీ, చాలా పనిలో ఉన్నా !నాన్నగారికి ఆఫీస్ టైం దాటుతోంది. "అన్న అమ్మ మాటకు పొద్దున్నే చదువుతున్న కొత్త చందమామ పుస్తకం పక్కన పెట్టి,ఇత్తడి బిందె తీసుకొని దొడ్లో బావి దగ్గరికి వెళ్ళింది రాజీ. చింతపండుపెట్టి తోమిన ఇత్తడి బిందె బంగారంలా మెరుస్తూ ఉంది. దీంతో బోలెడు గొలుసులు చేయించుకోవచ్చుగా.. చెల్లికీ తనకీ ఒక్క గొలుసయినా లేదు మెళ్లోకి. అనుకుంది రాజీ. అమ్మేమో మనకు డబ్బులు వస్తే అప్పుడే అన్నీ అంటుంది. తన దోస్తులంతా పండగల్లో పట్టు పావడ, మెళ్ళో గోపి గొలుసో, ముత్యాల గొలుసో తప్పకుండా వేసుకుంటారు. అనుకుంటూ గిలక మీదకి తాడు ఎక్కించి బక్కెట్టుతో నీళ్లుతోడి బిందెలో పోస్తుంది.
మూడు బకెట్లు పోసాక బిందె నిండినది. తీసినడుము మీద పెట్టుకోవాలని బిందె పట్టుకొనేలోగా.. చెయ్యిజారీ బిందె బావిలోపడి పెద్ద చప్పుడయింది.
రాజీ గుండెగుభేలుమంది. అంతలో అమ్మమ్మ పెరట్లోకి వచ్చింది. రోలు తుడిచి గుత్తివంకాయ కూరపొడి దంచుతూ "ఏమే, అలా నిలబడ్డావ్. మీ అమ్మ పిలుస్తుంది.వెళ్ళు!"అంది అమ్మమ్మ.
"మరే, బిందె బావిలో పడిందే అమ్మమ్మా.. ఎలా ఇప్పుడు? "
కంగారుగా అంటున్న రాజీని చూసి, అమ్మమ్మ లేచి వచ్చింది.
బావిలోకి తొంగి చూస్తూ "కనిపిస్తుంది లేవే పచ్చగా బిందె.అరవ్వాళ్ల ఇంటికి పోయి గ్యాలం తీసుకొనిరా పో !మీ నాయన వచ్చి తీస్తాడూ.. !"అంది అమ్మమ్మ
రాజీ బావిలోకి చూసింది. వేసవి కావడంతో సగానికే ఉన్నాయి నీళ్లు. అడుగున బిందె ఒక మూలగా పడిఉంది.
అంతలో అమ్మ రానే వచ్చింది "నీకేమి పని చెప్పినా ఇంతే కదే!అవతల ఆయనకి వంట కాలేదు.ఆ కుంపటి సరిగా అంటుకొని చావదు.పప్పు సగం ఉడికే.. ఇంతలో ఈ ఘనకార్యం చేస్తివి!ముచ్చు ముఖం నువ్వూ.. "తిట్ల వర్షం కురిపిస్తున్న అమ్మ వైపు భయంగా బిక్కమొహం తో చూస్తున్న రాజీకి, అమ్మ వెనగ్గా నిల్చున్న బామ్మ సైగలు కనిపించడంతో.. అరవ్వాళ్ళ ఇంటికి పరిగెత్తింది.
వాళ్ళు లోపల ఉన్నారు. కటకటాల్లోనుండి రాజీని చూసి ఏం అమ్మాయి ఇలా వచ్చావ్ అంటున్న పెద్దాయనతో "మా బావిలో బిందె పడిందండీ. గ్యాలం తెమ్మని పంపారు మా వాళ్ళు.!" అంటున్న రాజీతో
" ఇత్తడి చెంబు తీసుకోని రాపో, అది లేకుండా గ్యాలం ఇవ్వం "అన్నారు వాళ్ళు.
మళ్ళీ ఇంటికి వచ్చి, ఇత్తడి చెంబు తీసుకొని వెళ్లి కటకటాల తలుపు దగ్గర పెట్టి, గ్యాలం తీసుకొని వెళ్లేసరికి పక్క వాటా వాళ్ళతో సహా అంతా బావి దగ్గరనే గుమికూడారు. నాన్నగారు గట్టి చేంతాడుకు గ్యాలం బిగించి ముడివేసి బావిలో దించి తిప్పుతూ ఉంటే గొప్ప సస్పెన్స్ సినిమా చూసినట్టే అందరికి.
"బంగారం లాంటి బిందె.కాపురానికి వచ్చినప్పుడు మీ అమ్మమ్మ సారెలో ఇచ్చింది. ఎన్ని సొట్టలు పోయిందో..? "అంటూ కేకలేస్తుంది అమ్మ.
ఒకటి రెండుసార్లు గ్యాలానికి చిక్కినట్టే చిక్కి జారిపడింది మళ్ళీ బిందె. చివరికి నెమ్మదిగా ఏకాగ్రతగా పైకి తీశారు నాన్నగారు.
"పెద్దగా సొట్టలు ఏమిలేవుగాని మూతి దగ్గర కాస్త వంకరపోయింది.సాయంత్రం వచ్చాక నేను సరిచేస్తాను. రాజీని ఏమి అనకు!"అంటూ
హడావిడిగా అన్నం తిని ఆఫీస్ కెళ్లారు సైకిలెక్కీ నాన్న.
వాళ్ళ గ్యాలం వాళ్ళ కిచ్చేసిo ది రాజీ. "ఏం వచ్చేసిందా అప్పుడే.. అదృష్టం !'"అంటూ చెంబు తిరిగిచ్చింది ఇంటామె.
ఆరోజుకి ఇక బడికి డుమ్మా!సాయంత్రం ఇడ్లికి పప్పు రుబ్బుతున్న అమ్మమ్మ దగ్గర చేరి సందేహం బయటపెట్టింది రాజీ. "చెంబు ఎందుకు అడిగారు అమ్మమ్మా వాళ్ళు..? "అంటూ.
"ఎవరి వస్తువులు వాళ్ళకి బంగారం కదే. ఇంట్లో పాత్రలు నూతిలో పడితే చాలా దిగులేస్తుంది.అవి తీసేదే గ్యాలం కదా.. మరి అదికూడా తాడు సరిగా బిగించకుంటే ఊడిపడిపోతుంది. అందుకే వాళ్ళ వస్తువు బదులుగా ఇంకోటి తీసుకొని ఇస్తారు. నమ్మకం అంతే !"అంది అమ్మమ్మ.
*********
గాలం (మినీ కథ);- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి