పేదవాడి కష్టం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 మాటలకు మరిగే రక్తం 
తలదించి ఉండనివ్వదు...
వెక్కిరించే చేతగానితనం 
తెగించి సాగనివ్వదు...
కలత కలిగించే కటిక పేదరికం 
బతకనివ్వదు...
పెట్టిపుట్టిన పేదవాడి 
పౌరుషం కఠినంగా
చావనివ్వదు...
నీడలా వెంటాడే బాధ్యత 
అరక్షణమైనా
ఆనందంగా నవ్వనివ్వదు...
హక్కునిచ్చే
హుందాతనం
ఎదభారం తీరేలా ఏడ్వనివ్వదు...
చాలీచాలని జీతం
బిడ్డల ఆకలిని తీర్చనివ్వదు...
మరిచావా అంటూ 
గుర్తుచేస్తున్న ఆత్మాభిమానం
చేయిచాచి అర్ధించనివ్వదు...
నమ్మిన నీతి దొడ్డిదారి దిశగా 
పొరపాటును చెయ్యనివ్వదు...
చిరిగిన చొక్కా, అరిగిన చెప్పు 
అప్పును పుట్టనివ్వదు…
ఏళ్ళ తరబడి సంపాదించుకున్న 
పరువు ఇంటి గుట్టు విప్పనివ్వదు...
ఎన్ని బాధలున్నానవ్వుతూ
పలకరించడం పేదవాడికి అలవాటు...
పదే పదే పేదవాడివంటూ  ఎత్తి చూపుతూ చెయ్యకండీ పొరపాటు...


కామెంట్‌లు