రోగ నివారణ!అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత కి బాగా లేదు. దగ్గు ఆయాసం! ఇంజక్షన్ మందు అంటే మహాభయం!మంత్ర తంత్రాలపై మహానమ్మకం! ఆఊరికి మంత్రాలబాబా వచ్చాడు అని తెలిసింది. అతను నీటితో దీపాలు వెల్గిస్తాడు.బాబా ని దర్శించి  ఇచ్చిన విభూది నోటిలో వేసుకొన్నాక జ్వరం తగ్గింది. ఆయాసం రావటంలేదు.విభూది తిని దైవప్రార్థన చేస్తూ మంచంపై పడుకోమన్నాడు బాబా!హాయిగా నిద్ర పోయాడు. కాస్త నెమ్మదిగా ఉన్నప్పుడు బాబా దగ్గరకు వెళ్లాడు. అల్యూమినియం నాణాన్ని తాత చేతిలో ఉంచి మంత్రాలు జోరుగా చదివాడు.చెయ్యి వేడెక్కుతోంది. భరించలేక తాత గుప్పిట విప్పాడు.ఆశ్చర్యం!విభూది!"ఈవేళ మంచి రోజు "అంటూ బాబా తనజోలె లోంచి కొబ్బరికాయను తీసి తాత చేతుల్లో ఉంచి మంత్రాలు చదివాడు.కాసేపటికి  ఆకాయను తీసుకుని ఠాప్ అని దాన్ని పగలకొట్టాడు.ఆశ్చర్యం!బడబడా రక్తం నేలపై కారటంతో అక్కడ ఉన్న అంతా అవాక్కు ఐనారు."తాతా! నిన్ను ప్రేతాత్మ సతాయిస్తున్నది.కొబ్బరికాయలో రక్తం  చూశావా?" అని మళ్ళీ  ఓచిన్న సీసాడు విభూది ఇచ్చి  అన్నంతినగానే వేసుకో!హనుమ స్మరణతో పిశాచి పీడ వదిలి కమ్మని నిద్రపడుతుంది" అని ఓవెయ్యి రూపాయలు పూజ పేరుతో గుంజాడు.ఆరాత్రికి రాత్రే బాబా పరారైనాడు. నాల్గు రోజుల తర్వాత తాత కి దగ్గు ఆయాసం మొదలైంది. సైన్స్ మాష్టారు  అసలు గుట్టు గ్రహించి అందరి ముందు  ప్రయోగాలు చేశాడు. వారి మూఢనమ్మకాలు పటాపంచలు చేశాడు. ఒక టిన్ను లాంప్ తెచ్చి నీరు పోశాడు. వెలిగించ గానే  మంట వచ్చింది. అది ఆగాక లాంప్ మూతతెరిచాడు.అందులో కొన్ని రాళ్ల ముక్కలున్నాయి."ఇవి కాల్షియం కార్బైడ్ ముక్కలు. దీని పై నీరు పడగానే  ఎసిటలీన్ గ్యాస్ ఉత్పత్తి అయి మంట వస్తుంది. అది ఆగగానే  మళ్ళీ నీరు పోస్తే చాలు. వెలుగుతుంది. తాతా!నీకిచ్చిన విభూది లో మత్తు మందు కలిపాడు.అందుకే  బాగా నిద్రపోయావు."ఇప్పుడు మాష్టారు అల్యూమినియం  స్టీల్  నాణాలు తాత  చెరో అరచేతిలో పెట్టి  ఎంచక్కా కూనిరాగం తీశాడు.బాబా హాంహూం అంటూ దేవుని పేరు చెప్పి మంత్రాలు చదివాడు. మాష్టారు మాత్రం సినిమా సరదా పాట పాడుతుంటే "బాబూ!నాచెయ్యి వేడిగా సురసుర అంటోంది "అన్నాడు తాత. ఎడంచేతిలోని స్టీల్ నాణెం  చెక్కుచెదరలేదు.అల్యూమినియం నాణెం బూడిద ఐంది.
సబ్బు నీటితో తాత చేతిని కడిగి మాష్టారు ఇలా చెప్పసాగారు" అల్యూమినియం నాణెంపై  మెర్కురిక్ క్లోరైడ్ ద్రవం చల్లి చేతి గుప్పిట మూస్తే అది వేడెక్కుతుంది.స్టీల్ నాణెం పై దాని ప్రభావం ఉండదు.కానీ అది విషపూరితం! విభూది అనే భ్రమతో నోటిలో వేసుకోరాదు.ఈసారి మాష్టారు  కొబ్బరికాయను  తన కొడుకు చేతిలో పెట్టి కూనిరాగం తీశాడు. ఆపై దాన్ని కొడుకు చేత కొట్టించాడు.అంతే భళ్ళున పగిలిన కాయలోంచి రక్తపు ధారలు!! "ఇది రక్తం కాదు.ఎర్రసిరా!కొబ్బరికాయకున్న రంధ్రాల లో ఒకదానిలోకి  సిరెంజ్ సాయంతో ఎర్రసిరా లోపలకి పంపాలి.లోపల నీటితో కల్సి ఎర్రగా మారి రక్తం అనే భ్రమ కలిగిస్తుంది.ఏపండు కూరగాయల లోకి మన ఇష్టం వచ్చిన  రంగు సిరెంజ్ ద్వారా నింపవచ్చు.ఇక కాగితం పై గ్లిసరిన్ వేశాను.ఆపై పొటాషియం పెర్మాంగనేట్ చల్లాను.ఈరెండూ కలిస్తే  మంట వస్తుంది. కర్ర కాగితం  మండుతాయి.ఇది మంత్రం తంత్రం కాదు.పక్కా సైన్స్!"తాత తో పాటు  అందరికీ జ్ఞానోదయం ఐంది. దొంగబాబా గుట్టు రట్టు ఐంది. కానీ అతను ఎప్పుడో పరారీ అయ్యాడు కదా?🌷
కామెంట్‌లు