అసమానతలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 సంవత్సరాల తరబడి బట్టీ పట్టిన పుస్తకాల ప్రస్థానం కాస్తా ముగిసాక...
వాస్తవికతలో భయానక దృశ్యాలు అనుభవంలోకి రావడం మొదలయ్యాయి...
పట్టాల డిగ్రీలు చేతికంది
పాతికేళ్ల ప్రస్థానం పూర్తయ్యాక...
ఉపాధి అన్వేషణ మార్గాల లోనే ఏళ్లకు ఏళ్లు
గడిచిపోతున్నాయి...
పోటీ ప్రపంచంలో పార్టీల, ప్రభావాల దౌర్జన్యాలు ఒకొక్కటిగా
బయటపడుతుంటే...
ప్రైవేటు సంస్థలు అందించిన పవిత్రత లేని చదువుల పరోపకారాన్ని పొందలేక...
నిరుద్యోగ సంఘాలు పుట్టగొడుగుల్లా వీధికొక్కటి పుట్టుకొచ్చాయి...
రాచరికపు రాయబారాల అజమాయిషీల ఆనవాయితీలు అర్హత లేనివారికే ఉద్యోగావకాశాలను
కల్పిస్తుంటే...
పేదరికాన పుట్టిన ప్రతిభావంతులకి వర్తమాన కాలంలో గడ్డురోజులు ఎదురయ్యాయి...
రిజర్వేషన్ ల పేరుతో ఓ వైపు
కుంభకోణాల కుట్రల జరుగుతుంటే,
మరో వైపు చాటుమాటుగా లంచాల లవాదేవీలు ఎప్పటిలానే హామీలను ఇచ్చేస్తున్నాయి...
అంతంత మాత్రపు
సదుపాయాలతో విద్యార్జితులైన యువ కెరటాల
అస్తవ్యస్తమైన జీవితాల
కన్నీటి కథనాలను
విశ్లేషిస్తూ పోతే,
వెనకబడిన
ముందుతరాల చరిత్రలను వెలికితీస్తూ పోతే,
అసంపూర్ణ మార్గాలలో
అసంతృప్తికి కారణమైన పరిస్థితులను అన్వేషిస్తూ పోతే,
ప్రజా పాలనలో ప్రభుత్వ వ్యవస్థలలోని అసమానతలు, అన్యాయాలు వెలుగులోకి రాక మానవు...


కామెంట్‌లు