డిటెక్టివ్ కథల పితామహుడు సర్ ఆర్థర్!;-- యామిజాల జగదీశ్
 డిటెక్టివ్ సాహిత్యం చదివిన వారికి షెర్లాక్ హోమ్స్ పాత్రంటే తెలియని వారుండరు. 
ఈ పాత్రను సృష్టించింది ఎవరో తెలుసా? ప్రముఖ ఇంగ్లీష్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డాయల్. 
ఆయన తండ్రి చార్లెస్ డాయల్ తాగుడుకు అలవాటుపడి పిల్లలు దాచుకునే డబ్బుని తస్కరించి మద్యానికి ఖర్చు పెట్టేవాడు. చార్లెస్ దంపతులకు ఏడుగురు పిల్లలు. వారిలో రెండవ సంతానమే ఆర్థర్ కోనన్ డాయల్. 1859 మే 22వ తేదీన స్కాట్లాండులో జన్మించారు ఆర్థర్. ఆయన పేదరికంలోనే పెరిగారు. 
పదిహేడో ఏట ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ మెడికల్ స్కూల్లో చదివారు డాయల్. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సర్జరీ డిగ్రీలు పాందారు. మరో నాలుగేళ్ళకు నరాలకు సంబంధించిన జబ్బులపై పరిశోధనలు చేశారు. 
అనంతరం నేత్రవైద్యుడిగా స్థిరపడాలనుకుని అందుకు సంబంధించిన చదువులు చదివారు. ఇందు కోసం వియన్నా వెళ్ళారు. పోర్ట్స్ మౌత్ అనే నగరంలో మెడికల్ ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలోనే ఆయన రెండు షెర్లాక్ హోమ్స్ నవలలు రాశారు. షెర్లాక్ హోమ్స్ పాత్ర సృష్టించడం వెనుక ఓ కథ ఉంది. మెడికల్ స్కూల్లో ఆయనకు చదువు చెప్పిన డాక్టర్ జోసెఫ్ బెల్ తన దగ్గరకొచ్చే రోగులను నిశితంగా పరిశీలించి వ్యాధి మూలాలను రాసేవారు. ఆయన శక్తిసామర్థ్యాలు ఆర్థర్ కోనన్ ని అబ్బురపరిచేవి. వ్యాధి మూలాలను కనుగొనడంలో ప్రోఫెసర్ అధ్యయన తీరును గమనిస్తూ వచ్చిన డాయల్ అటువంటి ఓ కథాపాత్రను సృష్టించాలనుకుని షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ పాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడే ఓ రెండు కథలు రాశారు.
1891లో లండన్ లో నేత్రవైద్యుడిగా ఓ క్లినిక్ ప్రారంభించిన ఆర్థర్ తన జీవితచరిత్రలో ఇలా రాసుకున్నారు..."ఒక్కరంటే ఒక్కరు కూడా నా దగ్గరకు రాలేదు" అని.
కొంతకాలంపాటు ఓ నౌకలో శస్త్ర చికిత్స చేసే నిపుణుడిగా కొనసాగారు. అప్పుడు సముద్ర ప్రయాణం పడకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆ పని మానేశారు.
పెళ్ళయిన తర్వాత భార్య లూయిసా హాకిన్స్, డాయల్ ని నవల రాయమన్నారు.
భార్య సూచన మేరకు ఆర్థర్ ఓ నవల రాశారు. కానీ ఆ నవలను ప్రచురించడానికి ప్రచురణకర్తలు అంతగా ఆసక్తి చూపలేదు. 
1887లో షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించి మొదటిసారిగా ఓ డిటెక్టివ్ నవల రాశారు.
దీనిని కూడా ప్రచురణ సంస్థలు నిరాకరించాయి.
అనంతరం ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ అనే నవలకు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభించింది.
బోయర్ యుద్ధంలో బ్రిటన్ పాల్గొనడాన్ని సమర్థిస్తూ ఓ ప్రకటన చేశారు. అది ఏడవ ఎడ్వర్డ్ రాజుకు ఎంతో నచ్చింది. దాంతో  ఆర్థర్ ని సర్ టైటిల్ తో గౌరవించారు. అంతేకాదు ఆయనను డిప్యూటీ లెఫ్టినంటుగా నియమించారు.
ఆర్థరుకి క్రీడలంటే మహా ఇష్టం. క్రికెట్ ఆడుతుండే వారు.
ద్విచక్ర వాహనం నడపడంలో గట్టివాడైన ఆర్థర్ ఒక్కమారుకూడా కారు నడపకపోయినా ఓ కారు కొన్నారు. అంతేకాకుండా 1911లో ప్రిన్స్ హెన్రీ (ప్రష్యా) నిర్వహించిన అంతర్జాతీయ రోడ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు ఆర్థర్ డాయల్. 
ఆయన పార్లమెంటుకు రెండుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఓ దశలో షెర్లాక్ హోమ్స్ పాత్రంటే ఇష్టంలేక  షెర్లాక్ హోమ్స్ మరణించినట్టు రాశారు. అయితే దీనిని పలువురు వ్యతిరేకించడంతో షెర్లాక్ హోమ్సుని మళ్ళీ పుట్టించారు ఆర్థర్.
ఈయన తన జీవితంలో మొత్తం 22 నవలలు, 204 కథలు, 16 సంపుటాలు, 4 కవితా పుస్తకాలు, 14 నాటకాలు, 13 ఆధ్యాత్మిక పుస్తకాలు వంటివి రాసారు. 
ఆ తర్వాత శేషజీవితాన్ని ఆధ్యాత్మిక బాటలో కొనసాగించారు.
ఆయన 1930 జూలై ఏడో తేదీన తన తోటలో విహరిస్తుండగా గుండెపోటుతో కింద పడి మరణించారు.ఆ సమయంలో ఆయన చేతిలో ఓ పువ్వుకూడా ఉంది. ఆయన చివరగా తన భార్యతో చెప్పిన మాటలు..."నువ్వో అద్భుతం" అని.





కామెంట్‌లు