లక్షన్నర కవితలు రాసాను - పి.బి. శ్రీనివాస్;---- యామిజాల జగదీశ్
 కాలంగలిల్ అవళ్ వసంతం అనే పాట ఎప్పుడు విన్నా మనల్ని స్వర్గానికి తీసుకుపోతుంది. ఎప్పటికీ ఆ మధురమైన గొంతుకి సొంతదారు పి.బి. శ్రీనివాస్. 
PBS అనే పొడి అక్షరాలను Play Back Singer అని చెప్పుకోవచ్చు. తన మధురమైన స్వరంతో వినేవారిని కట్టిపడేస్తారు. తమిళం, తెలుగు, కన్నడం, మళయాలం, హిందీ తదితర భాషలలో పాటలు పాడటమే కాకుండా కవిగానూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఈ ఇంటర్వ్యూ నాటికి ఆయన వయస్సు డెబ్బయ్ మూడేళ్ళు. మన తెలుగువారైన పీబీఎస్ కన్నడంలో నటుడు రాజ్ కుమార్ కి పాడిన క్రమంలో ఆయన గాయకుడికే గాయకుడిగా ప్రసిద్ధికెక్కారు. 
పీబీఎస్ గారిని తమిళనాడు ప్రభుత్వం ఇయల్, ఇసై, నాటక మండ్రానికి అధ్యక్షుడిగా నియమించిన సందర్భంలో ఓ తమిళ పత్రిక (2004లో) ఆయనను కలిసి ముచ్చటించింది. ఆ ఇంటర్వ్యూలో పీబీఎస్ గారు చెప్పిన విషయాలను కొన్నింటిని ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరిచాను.....
నేను"చిన్నతనంలోనే సంగీత కళాకాడినైనవాడిని. ఇందుకు మా అమ్మ ఆశీస్సులే కారణం.అమ్మ మంచి గాయని. స్వరశక్తి కలిగిన వారు. ఇంట్లో పాడుతుండేవారు. అమ్మ ఆశీస్సులే నన్ను సంగీతంలో పైపైకి ఎదగనిచ్చాయి. సినిమా పాటలను వింటూనే నన్ను నేను వృద్ధి చేసుకున్నాను. నాకు కర్ణాటక సంగీతం వద్దని ఆరంభంలోనే నిశ్చయించుకున్నాను. 
ఎందుకంటే ఆనాడు కర్ణాటక సంగీతాన్ని చెప్పడానికి గురువుల విధానం నాకు బోధపడలేదు. 
అయితే ఎం.ఎస్., డి.కె.పట్టమ్మాళ్, సెమ్మంగుడి, అరియకుడి, జి.ఎన్. బాలసుబ్రమణ్యం తదితరుల సంగీతాన్ని విన్న తర్వాతే నాకు కర్ణాటక సంగీతంపట్ల ఆరాటం కలిగింది. 
పాడేవారు మంచిగా పాడితే సంగీతం బాగుంటుందని అర్థం చేసుకున్నాను. కర్ణాటక సంగీతాన్ని నేను క్రమపద్ధతిలో నేర్చుకోకపోయినప్పటికీ రాగాలు, తాళాలు అన్నింటినీ స్వయంగా నేనే గ్రహించికొత్త కొత్త రాగాలను సృష్టించాను.
నేను సినిమాలో చేరడం మా నాన్నగారికి ఇష్టం లేదు. కానీ నాకేమో సినిమా అంటే ఓ ఆశ. ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాలో చేరితే అబ్బాయి చెడిపోతాడు అని ఆయన అనుకున్నారు. కానీ నాకేమో సినిమా తప్ప మరిదేనిమీదా ఆసక్తి లేదని చేప్పాను. వెంటనే మా నాన్న గారు "నువ్వు డిగ్రీ పూర్తి చేయి. ఆ తర్వాత చూద్దాం" అన్నారు.
నేను సినిమాలో చేరడంకోసం నా చదువుని ఓ తపస్సులో పూర్తి చేశాను.అనంతరం నన్ను ఓ జ్యోతిష్కుడి వద్దకు తీసుకుపోయారు మా నాన్నగారు. ఆయన నాన్నగారితో "మీకు రాసిస్తాను....ఇతను సినిమా రంగంలో అడుగు పెట్టడు" అని అన్నారు. అప్పుడు ఆయనను నేనడిగాను "మీరు చెప్పేది అక్షరాలా జరుగుతుందా?" అని. వెంటనే ఆయన "లేదు. కొన్ని సమయాలలో కొన్ని మార్పులు జరగవచ్చు" అన్నారు. నేనప్పుడు ఆయనతో "ఆ మార్పులలో నేనూ ఒకడిని" అన్నాను.
"ప్రయత్నిద్దాం. అది జరగకుంటే వదిలేద్దాం. కానీ నా శ్వాస ఉన్నంత వరకూ ప్రయత్నిస్తాను" అన్నాను.
నా జవాబు ఆయనకు నచ్చింది. వెంటనే ఆయన మా నాన్నగారితో "మీరు ఇతనిని సినిమాలో చేర్పించండి. ఇతనిలో తపన ఉంది. శక్తి ఉంది. భగవంతుడిని ప్రార్థిస్తాను. కచ్చితంగా ఇతను ముందుకు వస్తాడు" అన్నారు.
ఆ తర్వాత మా నాన్నగారు నన్ను జెమినీ స్టూడియోకి తీసుకుపోయారు. 1952లో మొదటిసారిగా నేను సినీ ప్రపంచంలోకి ప్రవేశించాను. పద్మశ్రీ ఈమని శంకరశాస్త్రి,.పి.ఎస్. కలాన్ తదితరులు మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో నాతో పాడించారు. అది తమిళంలో మిస్ మాలిని అనే సినిమా.ఆ చిత్రంలో రెండు పంక్తులు పాడాను. ఇలాగే నా నేపథ్యగాన ప్రవేశం జరిగింది.
జెమినీలో ఎ.వి.ఎం.ఆర్. నాగేంద్రరావు ఆల్ రౌండ్ ఆర్టిస్టుగా ఉండేవారు. ఆయన జాతకం అనే సినిమాను తెలుగు కన్నడం, తమిళం భాషలలో నిర్మించారు. అప్పుడు జి.కె. వెంకట్ నన్ను రాజ్ కుమారుని పరిచయం చేశారు. "మంచి గాత్రశక్తి గల ఈ యువకుడు నా మిత్రుడు. ఈయనకు మీ సినిమాలో ఓ అవకాశం ఇవ్వాలి" అని అడిగారు. వెంటనే రాజ్ కుమార్ కోకిలేశ్వరర్ అనే సినిమాలో నాకు పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమాలో ఓ శ్లోకం, ఓ పాట పాడాను. నా పాట విన్న రాజ్ కుమార్ "వెంకటేష్, నువ్వు నాకొక మంచి నేపథ్య గాయకుడిని పరిచయం చేసావు" అని ప్రశంసించారు.
దీని తర్వాత భక్త కనకదాసా అనే సినిమా టి.ఆర్. నాయుడు రూపొందించారు. ఈ సినిమాకు సంగీతం ఎం.వి. రాజు సమకూర్చారు. ఈ సినిమాలో అన్ని పాటలూ కనకదాసువే. ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది.
అప్పుడు రాజ్ కుమార్ "ఇక నా సినిమాలకు నేను పాడను. నాకోసం పి.బి. శ్రీనివాసే పాడుతారు" అని చెప్పారు. అరోజు నుంచి దాదాపు ఇరవై ఏళ్ళపాటు రెండు వందలపాటలకుపైగా నేను ఆయనకు పాడాను. ఈరోజు కన్నడ ప్రపంచంలో చనా గురించి చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం రాజ్ కుమారే. అందువల్ల నేనాయనకు రుణపడి ఉన్నాను.
 జాతకం అనే సినిమాతో తమిళ సినీ రంగంలోకి అప్పటికే అడుగుపెట్టినప్పటికీ ప్రేమపాశం సినిమాలో నేను సోలోగాను, పి. సుశీలతో కలిసి పాటలు పాడాను. కానీ నన్ను తమిళనాడు అంతటా పరిచయం చేసింది సిల్వర్ జూబ్లీ జరుపుకున్న పావమన్నిప్పు సినిమాలో నేను పాడిన కాలంగలిల్ అవళ్ వసంతం పాట తర్వాతే.
కన్నదాసన్ రాసి విశ్వనాథన్ రామమూర్తి సంగీతంలో నేను పాడిన ఆ పాటకు విశేష ఆదరణ లభించింది. 
పావమన్నిప్పు సినిమాలో నేను జెమినీ గణేశన్ కి పాడి అది పాపులర్ అవడానికి ముందే అంజలి పిక్చర్స్ వారి అడుత్త వీట్టు పెన్ సినిమాలో నేను చాలా పాటలు పాడాను. నేను, జానకి పాడిన ఓ పాట హిట్టయ్యింది జెమినీగణేశన్ కి నేను ఎక్కువ పాటలు పాడలేదు. కానీ నేను ఆయన కోసం పాడిన అన్ని పాటలు సూపర్ హిట్టయ్యాయి.
కాలంగలిల్ అవళ్ వసంతం పాట  ఎ.వి.ఎం. చెట్టియార్ కి ఎంతగానో నచ్చింది. అప్పటి నుంచి ఆయన నన్నెలాగైనా హిందీ సినిమాలో పాడించాలనుకున్నారు. అందువల్ల చిత్రగుప్తుడితో ఓ నెల రోజులపాటు ప్రాక్టీస్ చేయించమన్నారు. 
అయితే నేను పాడిన మొదటి సారే చిత్రగుప్తన్ ఓకే చెప్పేసారు. మైన్ బీ లడికి హూన్ అనే హిందీ సినిమాను చెట్టియార్ నిర్మించారు. నాతో ధర్మేంద్రకు పాడించాలనుకున్న తన కోర్కెను ఆయన సాధించుకున్నారు. ఈ సినిమాలో మీనాకుమారికి లతా మంగేష్కర్ పాడారు. నాకు చాలా కాలంగా లతాతో కలిసి పాడాలని కల. ఆ కల చెట్టియారుతో నెరవేరింది. నాకెంతో సంతోషం వేసింది. ఓమారు లతా సోదరి ఉషా పాడిన పాటలో దొర్లిన తప్పుని చెప్పాను. అది విన్న వి.ఎన్. శర్మాజీ చెన్నై నుంచి వచ్చిన ఇతను నాకు చెప్తున్నాడే అని ఆశ్చర్యపోయారు. ఆయన మళ్ళీ ఆ పాట విన్నారు. నేను చెప్పిన లోపాన్ని ఆయన మార్చారు. ఆ సంఘటన తర్వాత ఆయన కొన్ని హిందీ సినిమాలలో పాడేందుకు నాకు అవకాశమిచ్చారు. నేను హిందీ సినీ జగత్తులోకి ప్రవేశించడానికి ఇదీ ఒక కారణమనొచ్చు.
నా గొంతు లతాకి నచ్చడంతో నన్ను దాదాపు 15, 16 హిందీ సంగీత దర్శకులకు సిఫారసు చేసారు. కానీ నేను హిందీలో ఎక్కువగా పాడలేదు. తర్వాత తమిళ, కన్నడం పాటలు పాడాను. దక్షిణాది భాషలలో నేను ఎక్కువగా 
తమిళం, కన్నడంలలో పాడాను. తెలుగు, మళయాలంలలో కాస్త తక్కువ పాడాను.
 
నేనిప్పటివరకు ఎనిమిది భాషలలో అనేక పాటలు, కవితలు రాశాను. ఇప్పటివరకు లక్షన్నర కవితలు రాశాను. 
నేను పాడిన శారదా భుజంగ స్తోత్రం, సంస్కృత భక్తి పాటలు, పురంధర దాస్ పాటలు, శ్రీ వేంకటేశ సుప్రభాతం, ముకుందమాల, మళయాలంలో నైవేద్యం, శివపరివార స్తోత్రం ఇలా ఎన్నింటినో పాడాను. వీటికి మంచి ఆదరణ లభించింది.
ఛందస్సు అనే శీర్షికతో కవితా వ్యాకరణం గురించి రాసాను. శ్రీనివాస గాయత్రీ వృత్తం, చిత్రకవిత పద్ధతిలో దశ గీత గీతా సందేశం
(Dasa Geetha Geetha Sandesam) అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఇది వీణ గాయత్రితో కలిసి పాడాను. అంతేకాకుండా 
 'Man has set his foot on Moon' అనే
EP గ్రామఫోన్ రికార్డుని అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కి, నీల్ ఆర్మ్ స్ట్రాంగుకీ పంపాను.వారు ప్రశంసిస్తూ నాకు ఉత్తరాలు రాశారు. ఎంతో ఆనందమేసింది. అందులో  "man to moon.. moon to god" అని రాసాను. అంతేకాకుండా లవ్లీ లవ్ సాంగ్స్, వైట్ షాడోస్,  గాయకుడి గేయాలు, ప్రణవం అనే పుస్తకాలూ  ప్రచురించాను.
ఎనిమిది భాషలలో వేలాది గజళ్ళు రాసి స్వరపరిచాను. వీటిలో ఎక్కువ శాతం ప్రేమగీతాలే. సోలోగా కొన్ని పాడాను. ఈ.వి.ఎస్. దేవి రామమూర్తితో కలిసి మరికొన్ని పాడాను. వీటికీ మంచి ఆదరణే లభించింది. నాతో పాడిన దేవి ఈమని శంకర శాస్త్రిగారి కుమార్తె.
కర్ణాటక సంగీతాన్ని ఓ క్రమపద్ధతిలో నేర్చుకోకున్నా ప్రముఖుల సంగీత విద్వాంసుల పాడే తీరును క్షుణ్ణంగా వింటూ నా సంగీత జ్ఞానాన్ని పెంచుకున్నాను.
నవనీత సుమ సుధా అనే రాగాన్ని సృష్టించాను. ఈ రాగానికి జన్యరాగ జన్యం అని పేరు పెట్టారు జి.ఎస్. మణి. ఎందుకంటే సరస్వతి రాగం పాడేటప్పుడు ఏర్పడిందే ఈ రాగం. 
"నవనీత సుమ సుధ" రాగం అనేది...
న - నవరస కానడా
వ - వసంత
నీ - నీతిమతి
త - తపస్విని
సు - సువర్ణముఖి
మ - మలయమారుతం
సు - సునాదవినోదిని
ధ - ధన్యాసి
ఈ ఎనిమిది రాగాల మొదటి అక్షరాలను కలిపితే ఏర్పడినదే నవనీత సుమ సుధ రాగం.
====================================


అలాగే చిత్రకవిత నడకలో వాగ్గేయకారుడు త్యాగరాజు గురించి కీర్తనలు రాశాను.
Music అనే పదంలో మొదటి అక్షరం M మెలోడికి సంకేతం. మనం ఈ మాటలో Mu తీసేస్తే "sic" అయిపోతుంది. కనుక సంగీతానికి లయ చాలా ముఖ్యం.
మా పిల్లలందరికీ బాగా పాడుతారు. మా అక్కయ్య కొడుకు వి.జి. మధుసూదన్ నాతో పలు వేదికలపై పాడాడు. అతను నాలాగే పాడతాడు. నా వారసుడిగా అతనిని చెప్పుకోవచ్చు. నా పాత పాటలను అతను పాడగా రికార్డు చేసి ఎం.ఎస్. విశ్వనాథన్ కి పంపాను. అవి విన్న విశ్వనాథన్ "మీరు పిడినవేగా" అన్నారు.
అవి నేను పాడలేదు...నా మేనల్లుడు పాడాడు అనగానే ఆయన ఆశ్చర్యపోయారు. నా మనవడు ఆనందవర్థన్ మృదంగం, వేణువు వాయిస్తాడు. నా సోదరుడు రామానుజం బాగా పాడేవారు. నా సోదరి కొడుకు బాబు, నా రెండవ సోదరి కుమార్తె లక్ష్మి కూడా పాడుతారు.



కామెంట్‌లు