ఎల్.ఆర్. ఈశ్వరి;-- యామిజాల జగదీశ్
 సంగీత ప్రపంచంలో అయిదు దశాబ్దాలకుపైగా పాటలు పాడి కోట్లాదిమంది అభిమానాన్ని సంతరించుకున్న గాయనిగా వినుతికెక్కారు ఎల్. ఆర్. ఈశ్వరిగారు.
అది "ఎలంద పళం " కానివ్వండి....కళాశలా కళాశలా....అవనివ్వండీ....ఆవిడ గొంతులో పాట వింటుంటే ...ఆ అనుభూతీ, ఆ ఆనందమూ వేరు.
నేను ఆవిడ పాటలు తమిళంలోనే ఎక్కువగా విన్నాను. అమ్మవారిమీద ఆవిడ పాటలు అనేకం. తమిళనాడులో ఆ పాటలకు విశేష ఆదరణ ఉండేది. ఇప్పటికీ ఉందికూడా. చెల్లాత్తా, కర్పూర నాయగి వంటి భక్తి పాటలు ఎంతో ఫేమస్. ఆవిడ క్రిస్మస్ పాటలుకూడా పాడారు. వరువాయ్ వరువాయ్, దైవం తంద దివ్య కుమరన్ వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రిస్మస్ పాటలకు డాక్టర్ ఆనంద్ చెల్లప్ప సంగీతం సమకూర్చారు.
ఆవిడ పూర్తి పేరు Lourde - Mary Rajeswari.  అయితే ఆవిడ ఎల్. ఆర్. ఈశ్వరిగానే బాగా పాపులర్ అయ్యారు. నేపథ్యగాయనిగా ఇవిడ తమిళం, తెలుగు‌ మళయాలం, కన్నడం, హిందీ, తుళు, ఇంగ్లీష్ లలో అనేక పాటలు పాడారు. ఆవిడను తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది. హిందీలో ఆవిడ ఒకే ఒక్క పాట పాడారు. Pistolwali సినిమాలో  "Udati Si Chidiya" అనే పాట పాడారు. తెలుగులో జ్యోతిలక్ష్మి నటించిన పిల్లా పిడుగ సినిమాను  హిందీలో డబ్ చేసిన సినిమా ఇది.
ఎం.ఎస్. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి, కె.వి. మహదేవన్, వేదా, వి.కుమార్, శంకర్ - గణేశ్, జి.కె. వెంకటేష్, కున్నైక్కుడి వైద్యనాథన్ తదితర సంగీతదర్శకత్వంలో ఆమె విభిన్న పాటలు పాడారు.
తమిళంలో పాసమలర్ అనే సినిమాలో ఆవిడ పాడిన వారాయ తోయి వారాయో...అనే పాటను కళ్యాణమండపాలలో తప్పకుండా వినిపించేవారు.
ఆవిడను ఒకానొకప్పుడు ఎస్.ఎస్. జైన్ కళాశాలకు చెందిన ముగ్గురు యువతులు పూజా, మీనా, వినూ కలిసి ఇంటర్వ్యూ చేశారు. 
ఆ ఇంటర్వ్యూ నేను చదివింది తమిళంలో. బాగుందనిపించింది. ఆవిడ పాడిన పాటలు తెలుగువారికికూడా పరిచయమే కనుక ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పిన విషయాలను చెప్పాలనిపించి అనుసృజించాను. 
రండి అమ్మాయిలూ అంటూ ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఈశ్వరిగారు వారితో పంచుకున్న విషయాలను ఆమె మాటల్లోనే చూద్దాం....
మా అమ్మ వాళ్ళ నాన్నగారి సొంత ఊరు పరమకుడి. మా నాన్నగారి స్వస్థలం చెన్నై. 
నేను పుట్టింది, పెరిగింది, సినిమాలోకి ప్రవేశించి పేరుప్రఖ్యాతులు పొందిందంతా చెన్నైలోనే.
మేము చెన్నైలోని పుదుప్పేట్టయ్ లో నివసించేవాళ్ళం.
మాది చాలా సాధారణ కుటుంబం. అమ్మ పేరు రెజీనా మేరీ నిర్మలా. తండ్రి పేరు ఆంటనీ దేవరాజ్. ఆయన స్పెన్సర్స్ అండ్ కంపెనీలో టైపింగ్, షార్ట్ హ్యాండ్ అంతా తెలిసిన వ్యక్తిగా పని చేశారు. ఆయన రోజూ సైకిలుమీదే ఆఫీసుకి వెళ్ళి వచ్చారనేది నాకు గుర్తుంది. మరేదీ జ్ఞాపకం లేదు. కారణం ఆయన నా ఆరో ఏట మరణించారు. ఆయన చాలా అనారోగ్యంతో బాధపడ్డారు. ఆయన ఏ జబ్బుతో బాధపడ్డారనేదికూడా నాకు గుర్తు లేదు.
ఆయనకు ఏడెనిమిది ఆపరేషన్లయ్యాయి. డాక్టర్ బొమ్మయ్యా ఆయనకు వైద్యచికిత్సలు చేశారనీ జ్ఞాపకముంది. ఆయనకు చికిత్స కోసం మా అమ్మ చాలా ఖర్చు చేయవలసి వచ్చింది. ఇంట్లో ఉన్న నగలతో డబ్బులు తీసుకుని ఆయన వైద్యానికి ఖర్చు చేసినట్టూ అమ్మ చెప్తుండేవారు.
ఆయన మమ్మల్ని వదిలిపెట్టిపోయినప్పుడు మా అమ్మ మెడలో ఒక్క పసుపుతిడుమాత్రమే. మా తాహతుకి మించి ఖర్చు చేసినప్పటికీ నాన్నను కాపాడుకోలేకపోయాం అని చాలాసార్లు బాధపడ్డ రోజులున్నాయి. అప్పట్లో మా సొంతవాళ్ళెవరూ సాయం చేయడానికి ముందుకురాలేదు. 
 
మా ఇంట నేను పెద్దదాన్ని. నాకొక తమ్ముడు. అతని పేరు అమల్ రాజ్.  తర్వాత ఒక చెల్లెలు. ఆమె పేరు అంజలి.
మా నాన్నగారు చనిపోయినప్పుడు తమ్ముడికి అయిదేళ్ళు. చెల్లికి రెండేళ్ళు. 
 నేను ఎగ్మూరులో ఉన్న ప్రెసిడెన్సీ బాలికల స్కూల్లో చదువుకున్నాను.
నా తమ్ముడు చింతాద్రిపేటలోని స్కూల్లో చదివాడు. మా నాన్న పోయిన తర్వాత మా కుటుంబాన్ని ఆదుకున్నది మా అమ్మ గాత్రమే. మా అమ్మ బాగా పాడేవారు. మా నాన్నగారు జబ్బుపడ్డప్పుడు మా అమ్మ సినిమాలో అవకాశం వస్తే దాని ద్వారా లభించే ఆదాయం కుటుంబాన్ని నడీపించడానికి, నాన్నగారి మందులకు ఉపయోగపడతాయనుకున్నారు. అందుకు మా నాన్నగారు సమ్మతించారు. ఆ సమయంలో జెమినీ సంస్థ సినీరంగంలో ప్రముఖంగా ఉండేది. ఆప్పుడే చంద్రలేఖ అనే సినిమాను బ్రహ్మాండంగా రూపొందిస్తున్నారు. మా అమ్మ తన గాత్రశక్తిగురించీ మా కుటుంబ స్థితిగతుల గురించి వివరిస్తూ జెమినీవారికి ఓ ఉత్తరం రాశారు. అప్పుడు అమ్మకు కోరస్ గాయనిగా అవకాశం లభించింది.
చిన్నప్పటి నుంచే నాకూ పాటలంటే ఇష్టం. భగవంతుడి కృపతో అమ్మలాగే నాదీ మంచి గాత్రమే. స్కూల్లో ఏ కార్యక్రమమున్నా నన్ను పాడమనేవారు. స్కూలు వార్షికోత్సవం వంటివి నిర్వహించేటప్పుడు ఒక కార్యక్రమానికీ ఇంకొక కార్యక్రమానికీ మధ్య ఉండే కొద్దిపాటి సమయంలోనూ (గ్యాప్ లో)
నాకొక మైక్ ఇచ్చి వేదికమీదకు ఎక్కించేవారు. ఓమారు, వైఎంసిఎలో ఓ పాటల పోటీ ఏర్పాటు చేసినప్పుడుఓ మిత్రురాలు నువ్వు బాగా పాడుతావుగా, నువ్వూ ఈ పోటీలో పాల్గొనమని చెప్పింది. మొదటిరోజు కాస్తంత ఆలోచించినా ఆమె బలవంతం చేయడంవల్ల సరేనని ఒప్పుకున్నాను. కానీ పాటలపోటీలో పాల్గొనడానికి పావలా డబ్బు కట్టాలని తెలియడంతోనే ఆ మేరకు నాకు వీలు లేదని నన్నొదిలేయమని చెప్పేసాను. కానీ నా స్నేహితురాలు వదలలేదు. ఆ పావలా నేను కడతాను....నువ్వు తప్పకుండా పాటలపోటీలో పాల్గొనవలసిందే అని ప్రేమగా ఆదేశించింది. ఆమె పేరు భానుమతి. నేనూ ఆమె నా చెల్లి తిన్నగా వైఎంసిఎకి వెళ్ళాం. అక్కడకి అనేక పాఠశాలలనుంచి అనేకమంది విద్యార్థనీ విద్యార్థులు వచ్చారు. వారినీ ప్రోత్సహించడానికి మరింతమంది వచ్చారు. నేనేమో లోలోపల వణుకుతున్నాను. కారణం అమ్మతో చెప్పకుండా ఇక్కడి వచ్చేసాం...ఇంటికి తిరిగెళ్ళడంతోనే అమ్మ ఏమంటుందోనని భయం. ఒక్కొక్కరినీ పిలుస్తున్నారు. వారు పిడి కింద దిగుతుంటే చప్పట్లే చప్పట్లు. నా పేరు పిలిచిన వెంటనే ఒకింత భయంతోనే వేదిక ఎక్కినా మైకు పట్టుకోగానే నా భయం పోయింది. నీ కేలనా....అనే కీర్తన పాడాను. పోటీ ముగీసింది. వైఎంసిఎ నుంచి బయలుదేరుతుంటే రాత్రి ఏడు దాటింది. నా స్నేహితురాలిని ఇంటికి తీసుకుపోవడానికి వచ్చిన ఆమె తల్లి మమ్మల్ని బస్సు ఎక్కించారు. మామూలుగా అయితే స్కూలు నుంచి నాలుగున్నరకల్లా ఇంటికి చేరుకునే మేము ఆరోజు ఇంటికి చేరడానికి ఎనిమిదిన్నరయింది. మమ్మల్ని చూడటంతోనే అమ్మకు కౌపం వచ్చింది.
ఎక్కడికెళ్ళావే...ఎందుకింత ఆలస్యం అని అడిగి నన్ను కోట్టడం ఆరంభించారు. నన్ను మాట్లాడనివ్వలేదు. అలా ఇలా కాదు. బాగా కొట్టింది. తిన్న దెబ్బలతో అలాగే పడుకుండిపోయాను.
నేను పాడిన మొదటి భక్తి పాట కున్నైక్కుడి సంగీతంలో ఉలగాలుం ఉమయవళే....మొత్తంమీద ఎన్ని భక్తి పాటలు పాడానో లెక్కలేదు.
జయలలిత (తమిళనిడు మాజీ ముఖ్యమంత్రి)కి నేను పాడిన మొదటి పాట నీ ఎన్బదెన్న....నాన్ ఎన్బదెన్న....
( వెన్నిర ఆడై సినిమా).
వేళాంగన్ని మాతా నా ఇష్టమైన దైవం.
ఇష్టమైన రాగం - షణ్ముఖప్రియ. వారాయ తోయి పాట ఆ రాగంలోనిదే.
చేపలతో చేసిన అన్ని రకాల వంటలూ ఇష్టమే
ఈ ఇంటర్వ్యూ దాదాపు పదకొండేళ్ళక్రితం వెలువడింది.
 1958 నుంచి 1980ల వరకు ఆరు భాషలలో ముప్పై వేలకు పైగా పాటలు పాడిన ఈవిడ 1958లో నల్ల ఇడత్తు సంబంధం అనే సినిమాకోసం ఇవరేతాన్ అవరు...అవరేతాన్ ఇవరు అనే పాటను మొదటిసారిగా పాడారు.
శివాజీగణేశన్ - సావిత్రి నటించిన పాసమలర్ సినిమాలో పాడిన పాటతో ఆవిడ పాపులర్ అయ్యారు. ఆకాలంలో సహగాయనీమణులతో పోటీ ఉన్న మాట నిజమే. కొనీ మా మధ్య ఈర్ష్య ఉండేది కాదు. సంగీతదర్శకులలో కె.వి. మహదేవన్ అంటే ఓ మెట్టు ఎక్కువ ఇష్టం. ఇప్పుడు పాడుతున్న వాళ్ళందరూ తమతమ ప్రతిభనం బాగానే నిరూపించుకుంటున్నారు. అయితే ఇప్పుడొచ్చే పాటలలో పాటల మాటల కన్నా వాయిద్యాల ఘోష ఎక్కువగా ఉందని ఓ అభిప్రాయం. అది నిజమే.
పాడుతున్నప్పుడు నేను అనుభూతితో పాడటంచూసి మీరు సినిమాలో నటించి ఉండొచ్చు అని అడిగేవారు.కానీ నేనెందుకు నటించాలి? నటిగా ఉండి ఉంటే వయస్సయిపోయిందని ఓ పక్కన పెట్టేసేవారు. ఓ మంచీ విషయమేమిటంటే నేనా తప్పు చేయలేదు.
యాభై అయిదేళ్ళ తర్వాత ఆవిడ మూక్కుత్తి అమ్మన్ అనే సినిమాలో ఓ భక్తి పాట పాడారు. మూక్కుత్తి అమ్మనుక్కు పొంగల్ వైప్పోం....వేప్పిలై ఏంది వందు వరం కేట్పోం....అనే ఈ భక్తిపాటను కవి పా. విజయ్ రాశారు. గిరీశ్ స్వరపరిచారు. మూక్కుత్తి అమ్మన్ గా నయనతార నటించారు.
ఆర్. జె. బాలాజీ దర్శకత్వం వహించారు. 2020 నవంబర్ నెలలో ఈ సినిమా విడుదలైంది.




కామెంట్‌లు