చదువులు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ఆటల పాటల సరదాలను వారికి దూరం చేయించి...
బడి పేరిట వారితో బండెడు బరువులు మోయించి....
కల్లాకపటం ఎరుగని వారిని కన్న ప్రేమకు దూరం చేసి వేధించి...
నడక నేర్చినేర్వగానే నర్సరీ అంటూ నరకాన్ని వారికి చూపించి...
పరువు ప్రతిష్టలు అంటూ వారితో పరుగులు పెట్టించి...
చిన్నతనం నుంచే ర్యాంకులంటూ, రాద్ధాంతం చేస్తూ...
గ్రేడులంటూ గుబులును వారిలో పెంచుతూ...
ఆ పసిపిల్లల శృతిమెత్తని హృదయాలలో ఒత్తిడిని కలిగిస్తూ....
ఒకటవ తరగతి నుండే వేలకు వేలు ఫీజులు కట్టి...
హాయిగా ఆడుకునే వయసులోనే హాస్టళ్ళకు వారిని నెట్టి...
చదువు చదువు అంటూ వారిని చుట్టుముట్టి...
పట్టు బట్టి అర్ధంకాని చదువులను అర్ధరాత్రి వరకు చెప్పబట్టి...
కేవలం చదువుకొని మార్కులు తెచ్చుకోవడం మాత్రమే మా హక్కు...
అవి ఏమాత్రం తగ్గినా సరే చావే మాకు దిక్కు...
అనేంతలా పిల్లల పసి మనస్తత్వాలను మార్చేస్తున్నారు
ఈ కాలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు!!!
బంగారు భవిష్యత్తు కలిగిన భవితను ఉరి పోసుకునేలా ఉసిగొలుపుతున్నారు...
వారి ఉసురు పోసుకుంటున్నారు...
అందుకే చిన్నతనం నుండే,
పిల్లలకు ఫలితాన్ని ఆశించి పరుగులు తియ్యమని చెప్పకండి...
పరుగు తీస్తూ పడినా పైకి లేచే ప్రయత్నం చేయమని చెప్పండి...
చదివి రాంక్ సాధించడమే వారికీ జీవితంలో పెద్ద కల అంటూ చెప్పకండి...
అన్ని కళలలానే చదువు కూడా ఒక కళ మాత్రమే అని చెప్పండి...
అలాగే, పుట్టినప్పటి నుంచి బాగా ఎలా బ్రతకాలో నేర్పకండి...
ముందు బ్రతకడం ఎలానో నేర్పండి చాలు....
అప్పుడు పాతికేళ్ళకు పదిలమైపోతున్న పసినవ్వులు నిండు నూరేళ్ళు 
నిండుగా నిలిచి వుంటాయి...


కామెంట్‌లు