"ఆకులో ఆకునవుదామనుకున్నా
కొమ్మలో కొమ్మని కూడా అయిపోదామనుకున్నా
కెరటాల్లోని చిరుగాలిని గుండె నిండుగా
నింపుకోవాలనుకున్నాను..
ఆకుపచ్చని లేలేత రెమ్మలు గాలికి ఊగుతూ
జీవితమంటే రేపటి ఆశతో బతకడమే అని
గుసగుసలాడాయి..
నిటారుగా నిలిచిన ముదురు గోధుమరంగు మాన్లు
తలవంచని ధీరత్వంతోనే నీ పయనం సాగించు
అని పాఠాలు చెప్పే పనిలో పడ్డాయి..
చెట్టు పుట్ట పిట్ట బంధిఖాన లేని సహజీవనమే
మా ఆనందానికి ప్రతీక అన్నాయి..
కాసేపైనా వాటి మౌన భాషను వింటూ
మైమరచిపోవాలనుకున్నాను..
నల్లమల నిశ్శబ్ద రాగంలో స్వేచ్ఛా గీతాన్ని
తనివితీరా వినాలనుకున్నాను..
అంతలోనే కార్లు, వేన్ ల హారన్లు వినిపిస్తే
అడవి పక్కున నవ్వింది నన్ను చూసి..
అడవి కాదు నగర జనారణ్యం
నీ నెలవు పదపద అంటూ వాస్తవం
వ్యంగ్యంగా నన్ను చూసి ఈసడించింది..
నవ్వలేని నేను తెల్లబోయిన మనసుతో
వెనుదిరిగి చూస్తూ చూస్తూ
వ్యాను ఎక్కి కూర్చున్నాను..
నల్లమల కి దూరమవుతూ
జనారణ్యానికి దగ్గరవుతూ..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి