సోనూబాయి ఏడుగురు అన్నల ముద్దు చెల్లి.ఆఖరి వదినెతో కలిసి మట్టి తవ్వకానికి వెళ్లింది.వదినెతట్టలో మట్టి సోనాబాయి తట్టలో బంగారం కలిసిన మట్టి ఉంది. "వదినా!బరువు గా ఉంది కాస్త ఎత్తవా?" పదిహేనేళ్ళ సోను అడిగింది. "ఇప్పటికే ఆలస్యమైంది. ఎవరిచేతనన్నా పెట్టించుకో?" అని విసవిసా వెళ్లి పోయింది. అటుగా ఓదొంగసన్యాసి ఒంటరిగా ఉన్న ఆపిల్లను చూసి "ఎందుకు ఏడుస్తావు పిల్లా? నేను మోసుకొస్తాలే" అని తనతలపై పెట్టుకొని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఊరికి చాలా దూరంలో ఉన్న తన గుహలోకి బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లాడు. సోనూవదిన ఇంటికి వెళ్లి ఏమీతెలీని నంగనాచిలా"అదేంటి!సోనూ ఇంకా ఇంటికి రాలేదా? నాకన్నా ముందే బైలుదేరింది.ఎక్కడ ఆడ్తూ కూచుందో?" అంది.ఆదొంగసన్యాసి ఆపిల్ల చేత గారడీ ఆటలు ఆడిస్తూ ఊరూరా తిప్పుతూ ఉండేవాడు. ఆవచ్చిన డబ్బు తో ఖుషీచేసేవాడు.పంజరంలో చిలకలామారింది ఆమె బతుకు! వాడికి వంట వార్పు చేసి పెట్టేది. ఏడాది గిర్రున తిరిగింది.
ఓసారి తన పల్లెకే తీసుకుని వెళ్లాడు."ఇంటింటికీ వెళ్లి బిచ్చం అడుక్కుని రా!" అనితరిమాడు.తన అన్నల ఇంటిముందు నిలబడి ఇలా గొంతెత్తి పాడసాగింది. "ఏడుగురన్నల చెల్లిని! మట్టి తవ్వపోతిని! వదినె నన్ను విడిచింది.!దొంగ నన్ను ఎత్తుకపాయె! సోనాలా పెరిగిన సోనూబాయిని!" ఆస్వరం విని అంతాలోపల నించి పరుగెత్తుకొని వచ్చారు."మళ్లీ పాడు అమ్మాయీ!" అంతే చెల్లిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి శుభ్రంగా స్నానంచేయించి కడుపు నిండా తిండి పెట్టారు. ఆమె ద్వారా జరిగినది తెలుసు కున్న వారు చెడ్డ వదినెను బైట కి వెళ్ళగొట్టారు. దొంగ సన్యాసి వేషంలో ఆమెను వెతుకుతూ బైలుదేరాడు.పాట అందుకున్నాడు" పెద్ద కనులచిన్నది! బక్కపల్చని పొట్టిది! చూశారా మీరెవరైనా?" అన్నలు వాడిని పట్టుకుని తాళ్లతో కట్టేసి చాలా లోతైన నీటిబావిలో పారేసి పైన రాతిబండను పరిచారు.ఆఅన్నలకు తెలుసు ఆఊరి పెద్ద న్యాయాధికారి దగ్గరకు వెళ్తే విచారణ పేరు తో కాలయాపన చేస్తారు. వాడి దగ్గర డబ్బు గుంజి వదిలేస్తారు.అందుకే గుట్టు చప్పుడు కాకుండా తమ పొలంబావిలో పడేసి చెల్లిని కాపాడుకున్నారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి