*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౯౯- 099)*
 *కర్మ పద్ధతి*
కందము:
*కాననమున రణమున సలి,*
*లానలరిపుమధ్యమున మహాబ్దినగాగ్ర*
*స్థానమున సత్తునిద్రితుఁబూనికతో*
*బూర్వపుణ్యములురక్షించున్*
*తా:*
చిక్కటి కారడవిలో గానీ, శత్రువుల గుంపు మధ్యలో గానీ, యద్ధం మధ్యలో గానీ, నీటి మధ్యలో గానీ, నిప్పు మధ్యలో గానీ, మహాసముద్రము మధ్యలో గానీ, కొండ చివర గానీ, ఒళ్ళు తెలియని మత్తులో వుండి పోయిన వారిని వారు ఇంతకుముందు చేసిన మంచి పనుల వల్ల వచ్చిన పుణ్యమే కాపాడుతుంది....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఏకచక్ర పురంలో వున్న వారు అందరూ దైవభక్తి కలిగి, పాపపు పనులు చేయడానికి భయపడుతూ వుండేవారు. వారి ఊరి మీదకు బకాసురుడు వచ్చి రోజూ ఒక కుటుంబం నుండి ఒక మనిషి ని, బండెడు అన్నాన్ని, జోడెడ్లను ఆహారం గా పంపమంటాడు. అక్కడికి వనవాసంలో భాగంగా పాడవులు వస్తారు. బిక్షాటన చేసుకోవడానికి ఒక బ్రాహ్మణ ఇంటిముందు ఆగి బిక్ష అడుగుతారు. ఆ కుటుంబం అంతా చాలా బాధ పడుతూ ఏడుస్తూ వుంటుంది. కారణం అడిగిన పాండవులకు బకాసుర విషయం చెప్తారు. భీమసేనుడు వెళ్ళి బకాసుర సంహారం చేస్తాడు. ఆ బ్రాహ్మణ కుటుంబం ఎల్లప్పుడూ ఊరి మంచి కోరుకుంటూ, పదిమంది కోసం ఆలోచిస్తూ మంచి మాటలు మాట్లాడుతూ వుండడం వల్ల కలిగిన పుణ్య కర్మ ఫలమే బకాసురుని నుండి ఏకచక్రపురాన్ని రక్షించింది. అందువల్ల మనం కూడా నితాంత ధర్మానువర్తులం కాలేక పోయినా, ఆ దారిలో ప్రయాణించే ప్రయత్నం చేసినా పరమేశ్వరుడు మనల్ని మన సమాజాన్ని తప్పకుండా కాపాడుకుంటూ వుంటాడు..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు