*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 035*
 *చంపకమాల:*
*అవనిజ కన్నుదోయి తొగ | లందు వెలింగెడు సోమ, జానకీ*
*కువలయనేత్ర గబ్బిచను | కొండలనుండు ఘనంబు మైథిలీ*
*నవనవ యౌవనంబను వన | ంబునకున్ మదదంతి వీవెకా!*
*దవిలి భజింతు నెల్లపుడు | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! భూదేవి కూతురు, నీ భార్య, అయిన సీతాదేవి కలువ కన్నలలో వెలుగును నింపే చంద్రుడు నీవు. జనక రాజ కుమారి అయి నీ ఇల్లాలు అయిన జానకీదేవి ఉబ్బిన స్థనములు అనెడి కొండలయందు సంచరించే మేఘుడవు నీవు. మిథిల రాజకుమారి యవ్వన వనంలో విహరించే మదగజము నీవు. ఇటువంటి నిన్ను ఆర్తితో ఎప్పుడూ భజన చేస్తూ వుంటాను..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఎంతటి దయామయుడైన అయ్య అయినా, ఒక్కొక్క సారి అమ్మ చెపితే గాని కరుణ కలుగ పోవచ్చు. అందుకే రామదాసు "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అని వేడుకున్నాడు ధరణీ సుతను. ఇక్కడ ఈ పద్యంలో కూడా అమ్మని పొగుడుతూ భరతాగ్రజుని కరుణ కోరుకుంటున్నారు. ఎటు తిరిగీ అమ్మ కరుణారస దృష్టి మనమీద ఎల్లప్పుడూ వుండాలి అని అందరమూ వేడుకోవాలి. అమ్మ తోడు అనే తెరచాపని చుక్కానిగా చేసుకుని, రామనామము అనే తెడ్డు సాయంతో మన జీవిత నావను వైతరణి దాటించుకునే మంచి ప్రయత్నం మనమందరం చేయాలి. అందరమూ "రామ రామ రామ సీతా! రామ రామ రామ సీతా!" అని నామ జపం చేసుకుందాము.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు