కీర్తి పతాకం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కాషాయ, తెలుపు, ఆకుపచ్చ
వర్ణాల పింగళి సంతకం 
మన అందాల పతాకం...
ఎందరో అమరవీరుల త్యాగాల, 
సుచరిత్రల సూచిక 
మన ఆదర్శ పతాకం...
పవిత్రమైన స్వేచ్ఛా 
భావాలకు, ఆలోచనలకు తార్కాణం 
మన త్రివర్ణ పతాకం...
వెన్ను చూపని యుద్ధ వీరుల
ధైర్య సాహసాల దేశ గౌరవం 
మన జాతి పతాకం...
నిండైన భారతీయ సంస్కృతీ
సంప్రదాయాలకు ప్రతీక 
మన స్వర్ణ పతాకం...
పరదేశపు నేలపైన,
స్వదేశపు ఖ్యాతి 
మన విజయ పతాకం...
వర్ణ, వర్గ, కుల,మత 
భేదాలన్న ఎల్లలు లేని 
సమత మమతల సందేశం 
మన శాంతి పతాకం...
స్వాతంత్ర్య యోధుల  
నిస్వార్థ సేవలకు నిదర్శనం 
మన స్ఫూర్తి పతాకం...
ఆంగ్ల దొరలను తరిమిన
దొరతనానికి రుజువు 
మన శౌర్య పతాకం...
భారతీయ సమైక్యతకు,
దేశ భక్తికి సంకేతం 
మన మువ్వన్నెల కీర్తి పతాకం...



కామెంట్‌లు