ఆవిష్కరణలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  ఆంగ్లంలో ఒక సామెత ఉంది' అవసరం అనేది ఉపయోగ పడే వస్తువులు కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది కానీ అంగవైకల్యం లేక శారీరకలోపం కూడా వారికి ఉపయోగపడే వస్తువ కనిపెట్టడానికి శాస్త్రజ్ఞుణ్ణి ప్రేరేపిస్తుంది!
        కొన్ని వందల ఏళ్ళ క్రితం ఎద్దు కొమ్ములను చెవులు సరిగా వినపడని వారు కొమ్ములకు తగిన రంధ్రం చేసి వినడానికి ఉపయోగించేవారు.
      అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త తన చెవిటి భార్య కోసం 1870లో ఒక వినికిడి పరికరాన్ని కని పెట్టాలని శ్రమించాడు.ఆ శ్రమలో నుండి పుట్టుక వచ్ఛిందే 'టెలిఫోన్' తన భార్య కోసం తయారు చేసినా అది ప్రపంచానికి ఉపయోగపడే సాధనంగా మారిపోయింది!
      గుడ్డివాళ్ళు చదవలేరు కదా! మరి అటువంటి వారి కోసం లూయీస్ బ్రిల్లె (ఫ్రాన్స్)  వారు చదవగలిగిన ఉబ్బెత్తు అక్షరాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుడ్డివారికి ఎనలేని సేవ చేశాడు.అదే 'బ్రిల్లె లిపి' .
      1975 లోఅమెరికా శాస్త్రజ్ఞుడు రేకుర్జ్ వెయిల్ కనుచూపు లేనివారు వాక్యాలను వినగలిగే వాక్యాలుగా మార్చే పరికరం కని పెట్టాడు.ఆ పరికరం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కనుచూపులేని వారికి వెలుగు చూపించింది!
      ప్రపంచ వ్యాప్తంగా శారీరక లోపాలు ఉన్నవారికి ఉపయోగపడే అనేక పరికరాలు కనిబెట్టబడుతూనే ఉన్నాయి.
       గ్రెగ్ వాండెర్ హైడన్ అనే అమెరికా శాస్త్రజ్ఞడు వృద్ధులకీ, అంగవైకల్యం ఉన్న వారికీ ఉపయోగపడే అనేక పరికరాలు ప్రస్తుతం ఉన్న పరికరాలను మరింత మెరుగు పరిచే విధంగా అనేక పరిశోధనలు చేస్తూ భవిష్యత్తులో మరింత ఉపయోగకరమైన శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నాడు.అందరికీ ఉపయోగపడే సమాచార,సంజ్ఞల శాస్త్రం తన సహచరులతో కలసి అభివృద్ధి చేస్తున్నాడు. విద్యలో, సాంకేతికతలో,ఉద్యోగ పరంగా ఆ పరిశోధనలు ఉపయోగపడతాయి!
        ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకోవచ్చు. ప్రపంచంలో కంటి అద్దాలు మొదటిసారి క్రీ.శ.1000 లో చేతితో పట్టుకుని చూసేవి చేసినట్టు పరిశోధనల వలన తెలుస్తోంది! 1285 లో ఇటలీకి చెందిన సాధువు ఇప్పుడున్నట్టు కళ్ళకు పెట్టుకుని చదువుకునే కంటి అద్దాలు తయారు చేశాడు. 1456 లో గూటెన్ బర్గ్(జర్మనీ) అక్షరాలను ముద్రించే ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి పుస్తక ప్రపంచానికి ఎనలేని సేవ చేశాడు.పుస్తకాలలో సన్నటి అక్షరాలు చదవటానికి అనేక పరిశోధనల వలన ఇప్పటి కంటి అద్దాలు అభివృద్ధి చేయగలిగారు.
        ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది శాస్త్రజ్ఞుల వలన మనమందరం సుఖవంతమైన జీవితం గడుపుతున్నాము.వారందరికీ అనేక వందనాలు.
                 *******     *****

కామెంట్‌లు