పిల్లాపోయి కుక్కా వచ్చ ఎట్లెట్ల.... సరదా జానపద కథ --డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక కొండజాతి జనాలు జీవించేటోళ్లు. వాళ్లలో ఒకనికి పక్కనే ఉన్న ఇంకో అడవిలో వున్న పిల్లతో పెళ్లి కుదిరింది. వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మాయిని తీసుకువద్దామని పెళ్లికొడుకు తరపు బంధువులంతా పెళ్లికూతురికి ఇవ్వవలసిన నగానట్రా అన్నీ తీసుకోని
బైలుదేరినారు. ఆ వూరికీ ఈ వూరికీ మధ్యన చానా దూరం వుంది. వాళ్ళు ముక్కాలు దూరం పోయినాక ఒక పెద్దమనిషి "పెండ్లికూతురు వాళ్ళకు ఇవ్వవలసినవన్నీ సరిగ్గా వున్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఏమన్నా లేకపోతే అనవసరంగా మాట పడాల్సొస్తాది” అన్నాడు. సరేనని వాళ్ళు ఇవ్వవలసినవన్నీ వున్నాయో లేదోనని పట్టిపట్టి చూడసాగినారు. అన్నీ వున్నాయిగానీ మేక లేదు. “అరెరే మేక లేకపోతే ఇంకేమన్నావుందా. పెళ్లి వుండదూ... విందు వుండదూ... ఐనా ఇంతవరకూ వెనకాలనే వస్తుండెనే... అప్పుడే ఏమయింది” అనుకుంటూ అందరూ తలా ఒక దిక్కు పోయి వెదకసాగినారు. కానీ వాళ్ళు అట్లా ఎంత వెదికినా వాళ్ళకు వాళ్ళ మేక కనబడలేదు గానీ ఒక చోట ఒక నక్క కనబడింది. దాని పక్కన వేరే మేక ఒకటి వుంది. అప్పుడు వాళ్ళు నక్క దగ్గరికి పోయి "నక్కా.... నక్కా.... మా మేక దారిలో తప్పిపోయింది. నీ మేకనివ్వవా.... లేకపోతే పెళ్లి ఆగిపోతుంది” అని అడిగినారు. దానికానక్క "రేపు రాత్రి మా బంధువులనంతా పిలిచి పెద్ద విందు ఇవ్వాలని అడవంతా వెదికీ వెదికీ దీన్ని చానా కష్టపడి పట్టుకొచ్చినా... నేనివ్వను” అనింది.
అప్పుడు వాళ్ళు “నీకేం కావాల్నో కోరుకో... ఇస్తాం... అంతేగానీ మేకను మాత్రం ఇవ్వనని చెప్పొద్దు” అంటూ బతిమలాడినారు. అప్పుడా దొంగనక్క కాసేపాలోచించి "సరే... నేనేమడుగుతే అదిస్తామంటున్నారు గదా... అడిగినాక మాట తప్పితే” అనింది. “తప్పము గాక తప్పము” అన్నారు అందరూ. అప్పుడా దొంగనక్క “నాకు పెళ్లికూతురినియ్యండి. పెళ్లి చేసుకుంటా” అనింది. ఆ మాటలకు వాళ్ళకు పీకల్దాకా కోపం ముంచుకొచ్చింది. ఐనా అవసరం తమదే గదా... అందుకని ఇప్పుడెందుకు గొడవ... తరువాత చూసుకోవచ్చు” అనుకొని కోపాన్ని అణచుకున్నారు. దొంగ నవ్వులు నవ్వుతా “అట్లాగే తప్పకుండా” అంటూ మాటిచ్చి మేకను తీసుకోని వెళ్ళిపోయినారు.
పెళ్లికూతురు ఇంటికి చేరుకోని వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పెళ్లికూతురితో తిరిగి బైలుదేరినారు. దారిలో నక్క అడ్డం వచ్చింది. “నాకు పెళ్లికూతురినిచ్చి పెళ్లి చేస్తామని మాట ఇచ్చినారు గదా... ఇవ్వండి” అనింది. అప్పుడు వాళ్ళు పళ్ళు పట పట పట కొరుకుతా "ఏందీ... నీకు పెళ్లి కూతురినిస్తే పెళ్లి చేసుకుంటావా... అంత ఆలస్యం ఎందుకు... ఇదిగో ఇప్పుడే ఇక్కడే నీకు పెళ్లి చేస్తాం” అంటూ తలావొక కట్టె తీసుకోని దానెంట పన్నారు. అది చూసి నక్క “అమ్మ బాబోయ్ .... ఏమో అనుకుంటి గానీ.... నన్నే మోసం చేస్తారా... నేనేంటో నా తడాఖా ఏంటో మళ్ళా చూపిస్తా” అనుకుంటూ వాళ్ళకు దొరక్కుండా అక్కన్నించి పారిపోయింది.
పెళ్లికూతురిని తీసుకొని వాళ్ళు వూరికి చేరుకున్నారు. తరువాత రోజు పొద్దున్నే పెళ్లికి బంధువులంతా వచ్చినారు. అందరూ బాగా చీకటిపడేంత వరకూ ఆడిపాడి అలసిపోయి నిద్రపోయినారు. అంతలో నక్క నెమ్మదిగా అక్కడకు చేరుకోనింది. అడుగులో అడుగు వేసుకుంటా పెళ్లికూతురున్న గదిలోనికి పోయింది. నిద్రపోతున్న పెళ్లి  కూతురు నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి, కాళ్ళూ చేతులూ కట్టేసి ఒక పెద్ద గోనెసంచీలో వేసుకోని చప్పుడు కాకుండా అడవిలోనికి బైలుదేరింది.
అట్లా పోతాపోతావుంటే అడవిలో ఒకచోట ఒక చిన్న గూడెం కనబడింది. అక్కడ ఏదో జాతర జరుగుతావుంది. ఆడామగా, పిల్లా పీచూ, ముసలీ ముతకా అందరూ ఆనందంగా నాట్యం చేస్తా వున్నారు. దానికి నాట్యమంటే చానా చానా ఇష్టం. డప్పుల చప్పుడు వింటావుంటే దాని మనసు మనసులో ఉండదు. ఒళ్ళంతా ఆనందంతో వూగిపోతుంది. నక్కకు గూడా వాళ్ళతో పోయి చిందులు తొక్కాలనిపించింది. వెంటనే సంచీని ఒక పెద్ద చెట్టుకొమ్మకు తగిలిచ్చి వురుక్కుంటాపోయి వాళ్ళతో కలసి ఆడసాగింది.
ఇక్కడ పెండ్లింటికాడ పెళ్లికూతురు కనబడక పోవడంతో అందరూ అదిరిపోయినారు. “ఇదేందిరా పన్నుకున్న పిల్ల పన్నుకున్నట్టే చిన్న సప్పుడు గూడా కాకుండా మాయమైపోయింది” అనుకుంటా అందరూ తలా ఒక దిక్కు వెదకడానికి బైలుదేరినారు. పెళ్లికొడుకేమో వెదుకుతా... వెదుకుతా... గూడెం దగ్గరికి వచ్చినాడు. అట్లా వెదుకుతా వుంటే ఒకచోట చెట్టుకు మూట వేలాడుతా కనబడింది. “ఇదేందబ్బా... ఎవ్వరూ లేని ఈ అడవిలో ఈ మూట ఇట్లా వేలాడుతావుంది” అనుకుంటా దగ్గరికి పోయినాడు. అంతలో లోపలినుండి “వూ... వూ...” అని చిన్నగా మూలుగులు వినబన్నాయి. దాంతో బెరబెరా దాన్ని దించి మూతి విప్పినాడు. అంతే లోపల పెళ్లికూతురు విలవిలలాడుతా కనబడింది. గబగబా ఆమె నోట్లో గుడ్డలు తీసేసి, కట్లు విప్పేసినాడు. ఆమె ఏడ్చుకుంటా జరిగిందంతా చెప్పింది.
“అలాగా... అది ఇంకెప్పుడూ ఎవరి జోలికి పోకుండా దాని సంగతి చెప్తా చూడు” అంటూ పెళ్లికొడుకు బెరబెరా ఇంటికి పోయి ఒక మాంచి వేట కుక్కను తీసుకోనొచ్చి సంచీలో యేసి గట్టిగా కట్టేసి పైన తగిలించినాడు. ఆ వేట కుక్క అట్లాంటిట్లాంటి అల్లాటప్పా కుక్క కాదు. సింహాన్నయినా సరే సయ్యంటే సయ్యంటూ ఎదిరించడమే తప్ప వెనుదిరిగి పారిపోయే రకం కాదు.
నక్కకు ఇదంతా తెలీదు గదా... దాంతో బాగా ఆడిపాడి అలసిపోయి తిరిగి అక్కడికి వచ్చింది. మరలా ఆ మూటను భుజాన వేసుకొని సంబరంగా ఇంటికిపోయింది. ఎక్కడెక్కడి నక్కలన్నింటినీ ఇంటికాడికి పిలుచుకోనొచ్చి “ఈ రోజు నేను ఒక అమ్మాయిని తీసుకోని వచ్చినాను. మీరందరూ నాకూ ఆ పిల్లకు పెళ్లి చెయ్యండి. తరువాత మీకంతా మంచి విందు ఇస్తా” అని చెప్పింది. నక్కలన్నీ విందనేసరికి నోట్లో నీళ్ళూరుతావుంటే లొట్టలేసుకుంటా “అలాగే... అలాగే... పిల్లను తేపో... పెళ్లి చేస్తాం” అన్నాయి సంబరంగా.
నక్క మూటతెచ్చి వాటి మధ్యన పెట్టింది. పెళ్లికూతురు ఎట్లుందో ఏమో చూద్దామని నక్కలన్నీ ఒకదానిమీద ఒకటి పడతా మూట చుట్టూ చేరినాయి. నక్క మూట విప్పింది.
అంతే.. లోపల్నించి వేటకుక్క ఎగిరి బైటకు దుంకింది.
దుంకడం దుంకడం కనబన్న దాన్ని కనబన్నట్టు కాలు దొరికితే కాలు, మూతి దొరికితే మూతి పట్టుకొని పరపరపర కొరకడం మొదలు పెట్టింది. అంతే... నక్కలన్నీ అదిరిపడి తలా ఒక దిక్కు తిరిగి చూడకుండా పారిపోయినాయి. కుక్క కాసేపు అక్కన్నే కాపుకాసి ఒక్క నక్కగూడా అటువేపు రాకపోయేసరికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది.
అదట్లా పోగానే మళ్ళా నక్కలన్నీ నెమ్మదిగా కుంటుకుంటా ఏడ్చుకుంటా అక్కడికి చేరుకున్నాయి. అవి దొంగనక్కను పట్టుకోని “ఏమే దొంగదానా.... మాంచి విందు భోజనమని చెప్పి పిలిచి మమ్మల్ని కుక్కతో కరిపిస్తావా” అంటూ దాన్ని కొరికినచోట కొరకకుండా కొరికి కొరికి పెట్టినాయి.
పెళ్లికూతురు పోయి కుక్క ఎట్లా వచ్చిందో అర్థంగాక తలగోక్కుంటా నక్క అక్కనుంచి పారిపోయింది.
***********

కామెంట్‌లు