స్వాతంత్ర వజ్రోత్సవ వేళ
ఇంకను నిషేధించబడుచున్న మానవులుగా మాట్లాడుతున్నం
జోడించిన చేతుల్ని తెగ్గోయబడిన అమానుషాలను వినిపిస్తున్నం
కారంచేడు నరమేధం నుంచి కాలుతున్న శవాలదాకా నిదానించి చూడండి
తెగిపడ్డ తలలు
మొలిచిన సమాధులు
మోడైన బతుకులు
లెక్కకు మించి
కులమదం
అవమానాలకు గుచ్చి ఊరేగిస్తున్నాయి
ఘడియ ఘడియ కు బతుకు సుడిగుండం
పూట పూటకు నిత్య బలి జరుగుతుంది
అంతరాల జాడ్యంలో అంతులేని బాధ
వెంటాడుతుంది
కంచికచర్ల కోటేశు వారసులు
అంగ విచ్ఛేదనమైన మంథని మధుకర్ లు
నరకబడ్డ ప్రణయ్ లు
వివక్షల విష వలయంలో విగత జీవులవుతూనే ఉన్నారు
ఒక ఆకలి తెంపిన రెండు మామిడి పళ్ళు
అందరిముందు గ్రామ పంచాయతీలో ఉరితీస్తాయి
నీదెప్పుడూ కిందిమెట్టని నిందించే
అభ్యంతరాల విద్యాలయాలు
ఇప్పటి రోహిత్ లను వేపుక తింటున్నాయి
వజ్రోత్సవ సాక్షి గా
పాఠాలు నేర్పాల్సిన పీఠాల్లో
నీళ్ళ కుండను ముట్టిన తొమ్మిదేళ్ల బాలున్ని
యథేచ్ఛగా అంటరానితనం చావబాది జీవి తీసింది
మువ్వన్నెల జెండా తీరు
ఆకలితో జీవిస్తం కానీ
అవమానాలతో కాదు
ఇల్లు లేకపోవచ్చు కానీ ఒళ్ళంతా దేశభక్తి
జండాను ఆత్మ గౌరవంతో ఎగురేస్తం
భారతదేశం శత్రు భూమి కాదనీ
భారతీయులంతా నా సహోదరులేనని ప్రకటిస్తున్నం
మారే వరకు మార్చే వరకు
చివరికి మేం చనిపోతూ
జై బోలో
స్వాతంత్ర భారత్ కి అని నినదిస్తూనే ఉంటాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి