జింక గర్వభంగం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 ఒక అడవిలో అందమైన జింక ఉండేది. దాని అందానికి ప్రతి ఒక్క జీవీ ఆశ్చర్యపడి దానితో స్నేహం చేసేవి. దానికి సేవలు చేసేవి. దాన్ని బాగా పొగిడేవి. దీంతో జింక ఏ పనీ చేయకుండా సోమరిగా ఉంటూ పొగరుగా ప్రవర్తించేది. 
     ఇలా ఉండగా ఆ జింక అందాన్ని చూసి ఒక పెద్దపులి కూడా దానితో స్నేహం చేసింది. జింకను ప్రాణంగా చూసుకుంటూ దానికి కావలసిన సేవలు అన్నింటినీ చేసేది. దానిని తన వీపుపై ఎక్కించుకొని ప్రతిరోజూ చాలా దూరం తిప్పేది. రాను రాను పులి పట్ల జింకకు చాలా చనువు పెరిగింది. ఎన్నో పెద్ద పెద్ద జీవులను వేటాడి తినే క్రూరమైన పులి తనకు సేవలు చేయడంతో పులిపై జింకకు చులకన భావం పెరిగింది. పులిపై ఆధిపత్యం చెలాయించింది. తన చుట్టూ అనేక పెద్ద పెద్ద జంతువులు ఉన్నప్పుడు జింక మరీ రెచ్చిపోయేది. రాజులాగా ఆజ్ఞలు ఇస్తూ పులితో చిన్న పెద్ద పనులు అన్నింటినీ చేయించుకునేది. 
       ఒకరోజు జింక పులితో "నాతో పోరాడి నువ్వు గెలవగలవా?" అని అడిగింది. జింక మాటలు పులికి ముద్దుగా అనిపించి "గెలవలేను" అంది. "నేను పులిని జయించాడు, పెద్దపులితో పోరాడి దాన్ని చిత్తుగా ఓడించాను." అని అడవి అంతా ప్రచారం చేస్తుంది. ఒక ఏనుగు అది విని, "తప్పు, నీ ప్రియ నేస్తం గురించి చులకనగా ప్రచారం చేయడం తగదు. పులి తలచుకుంటే నిన్ను క్షణాల్లో చంపేయగలద ‌" అంది. "పోవే, పెద్ద చెప్పొచ్చావు. నీకు నా బలం చూసి ఈర్ష్య కలిగింది. వెళ్ళు ఇక్కడ నుంచి." అన్నది. 
       ఒకరోజు ఒక బలమైన మాయదారి ఎలుగుబంటి జింకపై దాడి చేసి, దాన్ని చావ బాదుతుంది. జింకకు ఏ మాత్రం శక్తి లేక బాధతో విలవిలలాడుతుంది. ఇంతలో పెద్దపులి ఎలుగుబంటిపై దాడి చేసి క్షణాల్లో దాన్ని మట్టు పెట్టింది. చాలా జంతువులు ఈ దృశ్యాన్ని చూశాయి. జింక సిగ్గుతో తల వంచుకుంది. పులిని హేళన చేయడం మానేసింది. పులితో సేవలు చేయించుకోవడం ఆపేసి, పులికి సేవలు చేయడం మొదలుపెట్టింది. అడవిలో ఏ జంతువునూ చులకన చేయడం లేదు.

కామెంట్‌లు