కన్నవాళ్ళు;-- జగదీశ్ యామిజాల
 ఓరోజు రబ్బరు, పెన్సిలు మాట్లాడుకుం టున్నాయి.
మాటల మధ్యలో పెన్సిలు "నిన్ను చూస్తుంటే జాలేస్తుంటుంది" అంది.
"ఎందుకూ?" అడిగింది రబ్బరు.
అప్పుడు పెన్సిలు  "నేను తప్పు చేసిన ప్రతి సారీ నన్ను చెరిపి సరిదిద్ది నన్ను ఓ క్రమంలోకి తీసుకొస్తుంటావు. బాగానే ఉంది. నీకందుకు కృతజ్ఞతలు. కానీ ఈ క్రమంలో నన్ను సరి చేస్తున్నావనుకుని నువ్వు తరిగిపోతుంటావు. అందుకే నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది" అంది.
అయితే రబ్బరు ఏమాత్రం బాధపడలేదు.
"అది నా బాధ్యత. నన్ను సృష్టించిందే అందుకు. కనుక నన్ను చూసి నువ్వు జాలి పడకు. నాకు లేని బాధ నీకెందుకు? పైగా నేను చేసే పని నాకెంతో ఆనందాన్నిస్తుంది"  చెప్పింది రబ్బరు.
"ఏమిటీ ఆనందమా? నువ్వు తరిగి తరిగి ఓ రోజు అసలే కనిపించకుండాపోతావు?" అంది పెన్సిల్.
అప్పుడు రబ్బరు "నువ్వు చేసే తప్పులను చెరిపి నీతో మళ్ళీ సక్రమంగా రాయించే ప్రక్రియలో నా వంతు పని నేను సవ్యంగా చేసుకుపోవడం నాకెంతో తృప్తినిస్తుంది. అది ఓ విధంగా నా విజయమే. కనుక నేను తరిగిపోవడానికి ఏమాత్రం బాధపడను" అంది చిరునవ్వుతో.
ఇంతకూ ఇక్కడ తెలుసుకోవలసిం దేమిటంటే ఆ రబ్బరు మరెవరో కాదు, మన కన్నవాళ్ళే. వారు జీవితాంతం మనమేదైనా తప్పులు చేస్తే సరిదిద్దే రబ్బరులాంటివారు. మనల్ని చూసి అసూయపడని రెండు స్వచ్ఛమైన మనసులున్నాయంటే అవి అమ్మానాన్నలే. 


కామెంట్‌లు