ఉభయాచలం కొండ గుహలో చలి వేడి వర్షం అనే ముగ్గురు అక్కచెల్లెండ్లున్నారు.ఒకరిపై ఒకరికి అసూయ ఈర్ష్య ద్వేషం!తామే గొప్ప అని వాదులాట కీచులాట! ఓతాత కన్పడితే తీర్పు ఇవ్వమన్నారు.అందులో ఏఒక్కరిని గూర్చి గొప్ప అని చెప్తే మిగతా వారికి కోపం రావటం ఖాయం!"అమ్మా!నేనొక మూర్ఖుడిని! ఊరిచివర ముసలవ్వ ఉంది. ఆమె సరైన తీర్పు ఇస్తుంది " అని బతుకు జీవుడా అని తప్పించుకున్నాడు. ముందు చలి ఆమె దగ్గరికి వెళ్లింది" నాతల్లీ! నీవే గొప్ప దానివి! నీవు వస్తే హాయిగా దుప్పటి ముసుగులో గుర్రు కొట్టవచ్చు! వెచ్చటి ఎండలో కబుర్లతో కాలక్షేపం చేయొచ్చు. కాకపోతే నీవింకా మంచి పనులు చేయాలి. ఈసంగతి వాన ఎండకి చెప్పకు!" అవ్వ మాటలకు ఆనందంగా వెళ్లి పోయింది. మధ్యాహ్నం ఎండ వచ్చి అవ్వ తీర్పు కోరింది."నీవు వస్తే హాయిగా చెట్లకింద కబుర్లు!చిలోపొలో ఆటలు! నీవల్ల ఎంతో లాభం!మామిడి పండ్లు తాటిముంజలు! నీవే గొప్ప!కానీ నీవింకా మంచి పనులు చేయాలి. " వెర్రి ఆనందం తో గంతులేస్తూ వెళ్లి పోయింది. సాయంత్రం వర్షం వచ్చి "అవ్వా!నేనే గొప్ప దాన్ని కదూ ?" అడిగింది. "అవునమ్మా!నీవు లేకుంటే ప్రాణి మనుగడ లేదు. పాడీపంటకు మూలాధారం! నీలో మంచి గుణాన్ని పెంపొందించుకోవాలి. అందరి కన్నా గొప్ప గా బ్రతుకు!" ఇలా ముగ్గురు అక్కచెల్లెండ్లు తమలో మంచి ని పెంచుకోవడంలో నిమగ్నమై పోట్లాడుకోటం మానేశారు. 🌷
అవ్వ తీర్పు! అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి