*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 063*
 *ఉత్పలమాల:*
*భూప లలామ రామ, రఘు | పుంగవరామ, త్రిలోకరాజ్య సం*
*స్థాపన రామ, మోక్షఫల | దాయకరామ, మదీయపాపముల్*
*బాపఁగదయ్యరామ, నిను | బ్రస్తుతి చేసెదనయ్య రామ, సీ*
*తాపతి రామ ! భద్రగిరి | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!  రామా, నీవు భూమిని పాలించే రాజులందరిలో గొప్పవాడివి, రఘువంశములో పుట్టిన రాజులు అందరిలో నీవు ఘనమైన వాడివి, మూడు లోకాలను జయించి ఏకైక సామ్రాజ్యం స్థాపించిన వాడివి, ప్రజలందరికీ మోక్షమును ఇచ్చే వాడివి, సీతమ్మకు పతివి ఇటువంటి నిన్ను కీర్తిస్తాను నేను చేసిన పాపములనుండి కాపాడి రక్షించు రామా!........అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"రామచంద్ర రఘువీర! రామచంద్ర రణధీర!" అని మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు రాముని కీర్తిస్తూ మనచేత  కూడా కీర్తన చేయిస్తూ వచ్చారు. ఎందుకంటే, రామనామం మనందరినీ రక్షిస్తుంది అనే నమ్మిక వల్ల. ఇప్పుడు మనవంతు. ఆ నామ మహాత్మ్యాన్ని, ఆ నమ్మకాన్ని మన తరువాత తరానికి అందించాలి. "రామ నామము, రామ నామము, రమ్యమైనది రామ నామము." ఇది కదా అందరికీ ఆత్మానందాన్ని ఇచ్చేది. ఇదే కదా అందరికీ రక్ష. ఈ నామమును మరచి పోకుండా వుండేలా మనల్ని అనుగ్రహించమని ఆ దేవదేవుని వేడుకుందాము........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు