ఉమ్మడి కుటుంబం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది వ్యష్టి నుంచి వ్యక్తి, వ్యక్తి నుంచి  సమష్టి వచ్చిన ప్రస్తుత సమాజంలో  వివాహమైన వ్యక్తి మరుక్షణం నూతన వధువుతో ఒక ఇంటిని కొనుక్కొని తల్లిదండ్రులను వదిలి అత్తమామలతో కొత్త కాపురం పెడుతున్న రోజులు.  దీనివల్ల వారి వ్యక్తిత్వం పెరుగుతుందని వారికి స్వేచ్ఛ లభిస్తుందని భ్రమలో ఉన్న యువత తెలుసుకోవలసిన విషయం ఒకటి వున్నది ఏ ఒక్కరు ఒంటరిగా జీవించలేరు  అసలు మనిషి అంటేనే సంఘజీవి. ఇంట్లో అమ్మ గాని, అమ్మమ్మ గాని, నాయనమ్మ గానీ  ఉంది అనుకుందాం  వీరికి పిల్లలు వస్తారు కదా  చంటిపాప ఏడుస్తూ ఉంటుంది  ఏం చేయాలో ఆమెకు తెలియదు  కంగారు ఎక్కువ  వెంటనే ఆసుపత్రి గుర్తొస్తుంది అక్కడకు తీసుకు వెళ్తారు. వెంటనే ఆయన దానికి తగిన పరీక్షలు చేయాలి  ఫలానా చోటికి వెళ్లి రక్తం ఇవ్వండి అంటూ చీటీలు రాసిస్తాడు  అవన్నీ  పూర్తయ్యేంతవరకు ఈ పసిగుడ్డు ఏడుపు ఆపుతుందా ఆ బాధ తగ్గుతుందా. అదే ఇంట్లో పెద్ద దిక్కు ఉంటే  ఇలాంటి రుగ్మతలను చూసిన ఆమె  చిటికలో ఒక చిన్న చిట్కాను ఉపయోగించి ఆ పసి పాప  బోసినవ్వులు చిరునవ్వుతో కళకళలాడే స్థితికి తీసుకొస్తుంది  ఏం చేస్తుందో తెలుసునా ఒక తమలపాకు తీసుకొని కొంచెం ఆముదం వేడిచేసి ఆకు మీద వ్రాసి ఆ పసిగుడ్డు బొడ్డు పైన ఉంచుతుంది. ఐదారు నిమిషాల్లో బిడ్డ ఏడుపు మానుతుంది. పదిహేను ఇరవై ఐదు నిమిషాల్లో  సాఫీగా విరోచనం అవుతుంది. ఇంత చిన్న పనికి అటు ధనాన్ని సమయాన్ని  వృధా చేసే యువతకు  ఇది పాఠం కాదా  కొత్తగా కాపురం పెట్టిన నీకు ఆ ఇంట్లో ఏ పని చేయాలన్నా గానీ  పూర్తిగా తెలియని పరిస్థితి కదా దానిని సరి చేయడం కోసం ఎవరో ఒకరు ఉంటే  ఎంత ఆసరాగా ఉంటుంది. దానిని గమనించకుండా వీరు ఏ ప్రయత్నం చేస్తారో నా మీద  లేనిపోని మాటలు అంటారో అనే ఊహలతో ఆనందమయ జీవితాన్ని  దుఃఖమయం చేసుకోవడం భావ్యమా?
మీరు ఆలోచించండి ఉమ్మడి కుటుంబాలలోనే పాత పద్ధతిలో పురుషుడు సంపాదిస్తూ ఉంటే స్త్రీ ఇంటి పనులన్నీ చూసుకునేది  కానీ ఇవ్వాళ భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగం చేయకపోతే గడిచే పరిస్థితి కాదు. అప్పుడు చంటి పిల్లలును ఏం చేస్తారు ఎక్కడో  పిల్లల సంరక్షణ ఆలయంలో వుంచి వెళ్తారు వీరికి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఎలా పిల్లల్ని చూస్తారో  తెలియదు వారికి వీరి పిల్లవాడు ఒక్కడే కాదు కదా మిగిలిన వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. మన పెద్ద వాళ్ళు చెప్పే గుంపులో గోవిందలా ఉంటుంది పరిస్థితి. ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు ఇవేమీ పిల్లలకు వాళ్లు చూపించలేరు. వయసు వచ్చిన తర్వాత తల్లితండ్రులు   డబ్బు సంపాదించడం కోసం మిమ్మల్ని వృద్ధాశ్రమాలలో పెడితే మాకు ఎలా ఉంటుంది.
చివరలో వారు అదే స్థితి మీకు తీసుకువస్తే అన్న దానిని దృష్టిలో పెట్టుకుని  ప్రేమలకు, ఆప్యాయతకు దూరమై ఉమ్మడి కుటుంబాలను మళ్లీ ప్రోత్సహిస్తే ఆరోగ్యంతో పాటు ఆనందంగా చక్కటి జీవితాన్ని  గడపడానికి అవకాశం ఉంటుంది. ఏదో చిన్న వైద్యురాలు చెప్పింది అని చిన్నచూపు చూడకండి  పెద్ద మనసుతో ఆలోచించి కార్యానికి ఉపక్రమించండి. ఇది నా సలహా మాత్రమే. మీరు కార్యాచరణలో మునిగి ఉంటే  నా కన్నా ఆనందించేవారు మరొకరు ఉండరు అని జ్ఞాపకం పెట్టుకోండి.


కామెంట్‌లు