ప్రముఖ రచయిత, సీనియర్ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన "పల్లె పొలి మేరల్లో "కవితా సంపుటిలోని "సత్యము స్వప్నము" కవితపై విశ్లేషణా వ్యాసం. ఈ కవిత నాకు నచ్చింది. నిఘంటువు ప్రకారం సత్యం అంటే నిజమగుమాట. మహాత్మా గాంధీ చిన్నతనంలో సత్యహరిశ్చంద్రుడు నాటకం చూసి సత్యం కోసం సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. కుమారుడు లోహితాస్యుడు పాము కుట్టి చనిపోయాడు. సత్యం కొరకు తన భార్య చంద్రమతిని కాటికాపరికి అమ్మేశాడు. సత్య హరిశ్చంద్రుని నుంచి ప్రేరణ పొంది ఆ మహనీయుని అడుగు జాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నాడు. జీవితమంతా అదే సత్య పథం లో నడిచాడు.మహాత్మా గాంధీ వ్రాసిన సత్యశోధన పుస్తకంలో కూడా రాసుకున్నాడు.సత్య అహింసలే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్రం సాధించాడు. స్వామి దయానందుడు సత్యం కొరకే చిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయి వేద విజ్ఞానం ఆర్జించి వేదాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ సత్యార్థ ప్రకాశం గ్రంథం రచించాడు. అన్ని మతాల ఖండన చేశాడు. సత్యం కొరకు పాటుపడ్డాడు.
గులాబీల మల్లారెడ్డి తన తల్లి భూదేవి తండ్రి లింగారెడ్డి తాత మల్ దాదా నుండి పుణికి పుచ్చుకున్న సంస్కారంతో సత్యమైన బాటలో నడుస్తున్నాడు. "సత్యము స్వప్నము" కవిత మనకు అందించిన నిధి అని చెప్పవచ్చు. నిఘంటువు ప్రకారం స్వప్నం అంటే నిద్ర, కల. మల్లారెడ్డి కవిత శీర్షిక పేరు "సత్యము స్వప్నము" ఏమిటి అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు మరియు మనలో ఆలోచనలు రేకెత్తించవచ్చు. మనం గురు పూర్ణిమ జరుపు కుంటున్నాం గురువు అంటే ఎవరు? అజ్ఞానం నుండి అంధకారం నుండి వెలుగులోకి తీసుకు వచ్చే వాడని అర్థం. ఆ రోజుల్లో శ్రీకృష్ణ భగవానుడు గురువు సాందీపుని వద్ద విద్య నేర్చుకున్నాడని మనం చదువుకున్నాము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధ రంగంలో కలిగిన విషాదానికి భగవద్గీతలోని 700 శ్లోకాలు చెప్పి జ్ఞానోదయం చేశాడు. ప్రతి ఇంట శ్రీకృష్ణ గురువు ప్రబోధమైన భగవద్గీత ఉంటుంది. మనిషి ఎలా జీవించాలి మరియు ఎలా మనుగడ సాగించాలి మరియు మానవుడు మాధవుడిగా ఎలా మారాలో తెలియజేస్తుంది. మహాత్మా గాంధీకి ఏ సందేహం కలిగిన భగవద్గీతను చదివేవాడని తన ఆత్మ కథలో రాసుకున్నాడు. భగవద్గీతలో సత్యం ఉంది కనుకనే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు. విద్యాహక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో రాసిన రాతలు అమలు కావడం లేదు. అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కాని పాలకుల చేతగానితనం వల్ల విద్య హక్కు ఆరోగ్యం హక్కు నినాదాలుగా మిగిలిపోయాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన అందరికీ విద్య అందరికీ ఆరోగ్యం రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. మన పాలకుల దమననీతికి ఇది అద్దం పడుతుంది. చదువుల నేపథ్యంలో విద్య ఈరోజు వ్యాపారంగా తయారైంది. విద్య ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యాసంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడి లాభాలు దండుకుంటున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ బడులు ఉండేవి. నాణ్యమైన విద్యను అందించేవి. ఆ కాలపు టీచర్లు నిస్వార్ధంగా విద్యాబోధనే ధ్యేయంగా విద్యార్థులను పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవారు. ఈనాటి ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపు మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసే దశకు చేరాయి. ఈనాటి ఉపాధ్యాయులకు అంకితభావం లేదు.
రాజకీయాలు టీచర్స్ యూనియన్లు మరియు సవాలక్ష వ్యాపారాలు మరియు అసమర్థమైన రాజకీయ నాయకులకు అండగా ఉంటున్నారు. చదువుల పందారంలో అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్లో ఉండి చదువును కొనసాగిస్తున్నారు. 40 ఏళ్ల కిందట ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి గది అద్దెకు తీసుకొని వంట చేసుకుని కాలేజీకి వెళ్లి చదువును కొనసాగించేవారు. అప్పుడు హాస్టళ్లు ఉండేవి కావు. నేటి కాలంలో పట్టణాలలో గదుల అద్దెలు విపరీతంగా పెరిగాయి. బ్యాచిలర్స్ కి గదులు ఎవరూ కిరాయికి ఇవ్వరు. బ్యాచిలర్స్ కి గదులు అద్దెకిస్తే లేనిపోని గొడవలు నానా అగచాట్లు చెప్పిన మాట వినరు. పట్టణంలో గల్లీ గల్లీకి బాయ్స్ హాస్టళ్లు మరియు గర్ల్స్ హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నెలకు కొంత డబ్బులిస్తే వాళ్లే భోజనం వండి పెడతారు. మరియు వసతి కల్పిస్తారు. చిన్న గదులు మరియు పెద్ద గదులు విశాలంగా ఉన్నప్పటికీ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటాయి. హాస్టల్ నిర్వాహకులు వేళకు భోజనము, టిఫిన్, టీ ,స్నాక్స్ ఇస్తారు. పొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తర్వాత టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తారు. మధ్యాహ్నం వచ్చి అన్నం తింటారు. మళ్లీ కాలేజీకి వెళతారు. సాయంత్రం పూట హాస్టల్ కి వస్తారు. స్నాక్స్ మరియు టీ తీసుకుంటారు. హోంవర్క్ చేసుకుంటారు, మరియు చదువుకుంటారు. రాత్రి భోజనం చేసి పడుకునే వరకు చదువుకుంటారు. రాత్రి నిద్ర కుపక్రమిస్తారు. పిల్లలకు తిండి మంచిగా ఉన్న లేకున్న హాస్టల్లో ఉన్నవాళ్లంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. అడ్జస్ట్ అయిపోతారు. పిల్లలు ఇది కావాలి. అది కావాలి అని గొంతెమ్మ కోరికలతో సతాయించరు.అమ్మా మరియు నాన్నలను ఇబ్బంది పెట్టరు. వాళ్ళ లక్ష్యం చదువు. చదువు పూర్తి అయితే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని కుటుంబానికి ఆసరాగా ఉంటుందని శ్రద్దాశక్తులతో చదువుతున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ హాస్టల్లో ఉండి చదువుకుంటు తీరిక సమయాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. హాస్టల్ కు కట్టే డబ్బులు వాళ్లే సంపాదించుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చదువుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటున్నది. కొందరి తల్లిదండ్రులు వ్యవసాయం మరియు కూలీ పనులు చేస్తున్నారు. అయినా వ్యవసాయంలో మరియు కూలీ పనుల్లో ఏమీ మిగలడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూరగాయలు మరియు పాల వ్యాపారం చేస్తున్నారు. అయినప్పటికీ ఏమీ మిగలడం లేదు.ఎంత పని చేసిన కుటుంబానికి సరిపోయే ఆదాయం ఉండడం లేదు. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు బాగా శ్రద్ధ చూపుతున్నారు. మా బతుకులు ఇలా కడతేరాయి. రేపు మా పిల్లలు బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఏదైనా పని చేసుకుని బతకాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకుంటున్నారు మరియు బుద్ధిగా మెదులుతున్నారు. కుటుంబం కోసం పిల్లలు త్యాగాలు చేస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటున్నారు. "అర్ధరాత్రి హాస్టల్ గదిలో...... "మగత నిద్రలో "చైతన్యం శరీరానికి జడత్వం "కమ్ముకున్నప్పుడు. "కలల సౌధములో.. "కళ్యాణ మందిరాలు. "సిగ్గుల దొంతర లో....... "శిల్పాలంటే కన్నెలు".
హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థులు కూడా కలలు కంటారు. కలలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. మగత నిద్రలో కలలు వస్తాయి. చైతన్యం జాగృతమై నిద్ర లేవగానే కలలు మాయమవుతాయి. అర్ధరాత్రి హాస్టల్ గదిలో మగత నిద్రలో చైతన్యం శరీరానికి జడత్వం కమ్ము కున్నప్పుడు కలలు వస్తాయి. కలలు అందరు కంటారు. కలలు నిజం చేసుకునేవాళ్లు కొందరు మాత్రమే ఉంటారు.కలలోని విషయాలు ఆచరణ ద్వారా నిజాయితీగా సాధించుకునేవారు కొందరు అని మాత్రమే చెప్పవచ్చు.తెలంగాణ కొరకు 369 మంది విద్యార్థులు అమరులయ్యారు. మలిదశలో తెలంగాణ కొరకు 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. వాళ్ళ బలిదానాల ఫలితమే తెలంగాణ. కానీ వాళ్ళు లేకున్నా వాళ్లు కన్న కల తెలంగాణ సాకారం చేసి చూపించారు. నిజాయితీగా కల కన్నారు. తెలంగాణ కలను నిజం చేసిన నిజమైన వీరులు త్యాగధనులు. వాళ్లకు నా జోహార్లు. తెలంగాణ చరితలో చెరిగిపోని వాళ్ళు శిలాక్షరాలు. వాళ్ల త్యాగం కల ఎప్పటికీ గుర్తుంటుంది. విద్యార్థులు కంటున్న కలల గురించి చెబుతున్నారు. "కలల సౌధంలో.. "కళ్యాణ మందిరాలు." ఆ కలల సౌధంను చూపిస్తూ అందులో కళ్యాణ మందిరాలు ఉన్నాయి అని మనకు తెలియజేస్తున్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి సినిమా కవి రాసిన పాట ప్రతి పెళ్లిలో వింటాం. పెళ్లంటే ఎంత హంగామా. ఇప్పుడు లక్షల రూపాయలు కళ్యాణ మందిరాలు ఫంక్షన్ హాల్లకు చెల్లిస్తున్నారు. పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చు చేసి ఆర్థికంగా కుటుంబాలు చితికి పోతున్నాయి. పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా? ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా? అంటే అది కూడా లేదు. అదనపు వరకట్నం కోసం వేధింపులు మరియు అత్త, మామ, ఆడబిడ్డలు, భర్త, మరదలు, కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు. ఈ దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది. కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే. ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు. "సిగ్గుల దొంతరలో "శిల్పాల్లాంటి కన్నెలు". ప్రాయం చేసే పడుచుదనానికి కోటి దండాలు శత కోటి దండాలు పాట గుర్తుకు వస్తే తన్మయత్వంలోకి వెళ్లి పోతాం. ప్రాయం లో ఉన్నప్పుడు ఆడపిల్లలు మనోహరంగా కనిపిస్తారు. ఆడపిల్లలు సిగ్గులు ఒలక పోస్తారు. సిగ్గుతో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎంతో అందంగా కనిపిస్తారు. అజంతా, ఎల్లోరా, శిల్పాల వన్నెలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తాయి. చిత్రకారుడు చిత్రం గీసి చిత్రాన్ని చూస్తే అక్కడ మనిషి చిత్రంలో ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అది చిత్రకారుని ప్రతిభకు సెల్యూట్. అజంతా, ఎల్లోరా, శిల్పాలను చెక్కిన శిల్పులను అభినందించాలి. శిల్పాన్ని ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారో తెలుస్తుంది. "అరవిచ్చిన గులాబీలు.... "పరిమళించే మల్లెలు.". అర విచ్చిన గులాబీలు ఎంత అందంగా ఉంటాయి. అమ్మాయిలను అరవిచ్చిన గులాబీలతో పోలుస్తున్నారు. పరిమళించే మల్లెలు సువాసనలు వెదజల్లుతాయి. మల్లెపూల వాసన ఎంత మధురంగా ఉంటుంది అమ్మాయిలు పరిమళించే మల్లెపువ్వుల్లా ఉంటారు. మల్లెపూలు తెల్లగా తేటగా ఉంటాయి. మల్లెపూలు సిగలో ధరిస్తారు. సిగలోన మల్లెపూలు మత్తును కలిగిస్తాయి. ప్రేమ మైకంలో దించుతాయి. "చాయకొచ్చిన "చామంతులు.... "పూబంతులు.". పచ్చదనం పసుపు రంగులో చామంతులు ఎంతో అందంగా ఉంటాయి. చాయ కొచ్చిన చామంతుల్లా అమ్మాయిలను చూస్తే మరులు గొలుపుతాయి. బంతిపూలను పూబంతులు అమ్మాయిలు అంటున్నారు. ముద్ద బంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జన్మ భాషలు ఎందరికి తెలుసులే. ఘంటసాల గానం చేసిన పాట మనం రోజు వింటాం. ముద్దబంతి పూలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి. "వన్నె వన్నెల "సన్నజాజులు...... రంగులేని "గడ్డి పూలు.'. "వన్నె వన్నెల సన్నజాజి పూలు". సన్నజాజి పువ్వుల్లా అమ్మాయిలు అందంగా ఉంటారు. రంగులేని గడ్డి పూవుల్లా అమ్మాయిలు సొగసుతో కనిపిస్తారు. "సోకు లేని గరిగ పూవుల్లా అమ్మాయిలు అందం చిందిస్తున్నారు వేయి రకాల కలువ పూవులా అమ్మాయిలు విలక్షణమైన అందంతో కనిపిస్తున్నారు. "వికసించే మందారాలు ... విప్పారే సింధూరాలు ". మందారాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో వికసించే మందారాల్లా అమ్మాయిలు శోభను చేకూర్చుతున్నారు. సింధూరాలు చూడ చక్కగా ఉంటాయి విప్పారే సిందూరాల్లా అమ్మాయిలు కనిపిస్తున్నారు. దోసిల్లలో కట్నాలు.. వెయ్యి మొదలు కోటి వరకు" సమాజంలో వరకట్నం దురాచారం ఎంతగా పేరుకుపోయిందో చెప్తున్నాడు.38 ఏళ్ల కిందనే కవిత వ్రాసి మనకు అందించాడు. దోసిల్లలో కట్నాలు వేయి మొదలు కోటి వరకు. ఆ కాలంలో కూడా కట్నం ఉంది అని మనకు తెలియజేస్తున్నారు. వరకట్నం దురాచారం వల్ల ఎంతమంది ఆడపిల్లల జీవితాలు బలి అయిపోతున్నాయో మనం పేపర్లలో చదువుతున్నాం. . న్యూస్ చానళ్ళ లో చూస్తున్నాం. ఇన్నేళ్లయిన వరకట్నపు దురాచారపు వికృతపు నీలి నీడలు ఇంకా ఈనాటికీ కొనసాగుతున్నాయి. ఆ రోజుల్లో వేయి రూపాయల కట్నం ఉంటే ఈనాడు లక్షల రూపాయల కట్నం నుండి కోట్ల రూపాయలకు ఎగబాకి వరకట్నం వ్యాపారం సజావుగా సాగుతుంది. "నన్ను కొంటున్న అంగడి బేరాలు" వారానికి ఒకరోజు సంతలోకి పశువులను తీసుకువచ్చి అమ్ముతారు. పశువులన్నీ అంగట్లో హాజరుగా ఉంటాయి. అమ్మే వాళ్ళతో కొనేవాళ్ళతో అంగడి రద్దీగా ఉంటుంది. అంగట్లో పశువులను అమ్మే దళారులు ఉంటారు దళారులు పశువుల ధర చెప్తారు. పశువుల్లో ఎవరికి నచ్చిన పశువును వారు ఎన్నుకుంటారు. ఒకే పశువును కావాలన్న వాళ్లు ఎక్కువగా ఉంటే సవాలు వేస్తారు. "నాకోసం సవాలెస్తున్న నినాదాలు". దళారీ రేటును ప్రకటించి సవాలు ఒకటో సారి రెండోసారి మూడోసారి అని అంటారు. ఎవరి సవాలు నెగ్గితే వారికి ఆ పశువు దక్కుతుంది. "విసిరేస్తున్న నూలు పగ్గాలు" సవాలు నెగ్గిన వాళ్ళు పశువుపై నూలు పగ్గం వేసి డబ్బులు కట్టి పశువును సొంతం చేసుకుని వెళ్ళిపోతారు. "సిగ్గేసి మనిషిని అన్నాను". మనిషికి పశువుకు తేడా లేదు అని సినిమా పాట ఉంది. ఇవాళ అది నిజం చేసి చూపిస్తున్నారు. సమాజం ఎటుపయనిస్తుంది. నాగరికతనుండి అనాగరికత దిశకు వెళుతుంది. రోజురోజుకు దారుణ దృశ్యాలు కంటున్నాం. వింటున్నాం. ఇది మన దేశానికి పట్టిన అరిష్టం అని చెప్పకనే చెబుతున్నది. మార్పు రావాలి. "వాట్ ఆర్ యూ?.....నో...నో.. హి...హి...హి... చడి చప్పుడు లేని శబ్దాలతో. పువ్వులు నవ్వులు రువ్వినవి" అంగట్లో అమ్ముడయ్యే పశువు అయిపోయావు. నీవెవరు?....కాదు...కాదు... అంగట్లో అమ్ముడయ్యే పశువులాంటి నిన్ను చూసి హి..హి...హి..... చడి చప్పుడు లేని శబ్దాలతో. పువ్వు లాంటి నాజుకైనా ఈనాటి నవీన యువతి ఆత్మవిశ్వాసంతో నవ్వులతో సమాధానం చెప్పింది. "కొంటెగా హేళన చేసింది". నీవు సంతలో పశువు అయిపోయావని కొంటెగా హేళన చేసింది. అందులో న్యాయం ఉంది. "మెస్కులైన్, సుపీరియారిటీ నీలో లేదన్నది". నీలో మగ జాతి లక్షణాలు ఏకోశాన లేవు.నీవు మగాడివే కాదు.మగాడిలా ప్రవర్తించడం లేదు.మగాడివి అయితే కట్నం ఎందుకు తీసుకుంటావు అని ప్రశ్నించింది? పక్షులు చూడు ఆడ మగ జంటగా అనురాగంతో ఒకే గూటి పక్షులై కలిసి మెలిసి ఉంటాయి. పశువులు కూడా ఆడ మగ జంతువులు కూడా జంటగా ఎప్పుడూ కలిసి మెలిసి తిరుగుతాయి.పక్షులను పశువులను చూసి నేర్చుకో .ధన మదంతో నీలో ప్రేమరాహిత్యం ఏర్పడింది. ప్రేమతో మెలిగే పక్షుల్లా, జంతువుల్లా మెలగడం నేర్చుకో. ఇదేనా నీవు నేర్చుకున్న సంస్కారం అని ప్రశ్నించింది? ,'"నన్ను అసలే వరించమన్నవి" ప్రకృతి పురుషుడు వీరిద్దరిని జంట అంటారు. ప్రకృతి పురుషుడు కలిసిమెలిసి ఉంటేనే సృష్టి. ప్రకృతి పురుషుడులోని అన్యోన్యతను దూరం చేసి అంగట్లో సరుకై అమ్ముడుపోతున్నావు. నీలో జంటగా కలిసి ఉండాల్సిన లక్షణాలను కోల్పోయి ప్రేమ మాధుర్యమును మరిచిపోయి వరకట్నం తీసుకొని అంగట్లో సరుకై పశువులా అమ్ముడైపోతున్నావు. అందుకే నిన్ను వరించమన్నవి. చెట్టుమీదనున్న బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని వెళ్తున్నాడు. పువ్వు లాంటి అమ్మాయిలు వరకట్నం కోసం కలియుగంలో పడుతున్న ఇక్కట్లు చూసి విక్రమార్కుని ప్రశ్నించాడు. పువ్వు లాంటి అమ్మాయిలకు సరైన సమాధానం చెప్పాలి. లేకుంటే నీ తల రెండు ముక్కలైపోతుంది. జంటగా ఉండాల్సిన జంటలు అనురాగంతో ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాలి. వరకట్నం దురాచారం వద్దు. అబ్బాయిలు మీరు అంగట్లో సరుకు కావద్దు. ప్రేమ పక్షుల్లా ప్రేమ జంతువుల్లా ప్రకృతి పురుషుడిలా అనురాగంతో కలిసి మెలిసి ఉండాలి అని సమాధానం చెప్పాడు. సరైన సమాధానం చూసి చెట్టుమీద బేతాళుడు విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలిపాడు. "భోజరాజు ముందరి విక్రమార్కుడి కన్నెల్లా. ఎగసిపోయినవి ఒక్కొక్కటి. ఆర్కుడి కోసం విక్రమార్కుడి కోసం". మల్లారెడ్డి "సత్యము, స్వప్నము" కవిత మనకు అందించి 38 ఏళ్లు అవుతున్నది. అయినప్పటికీ సమాజంలో మార్పు లేదు. వరకట్నం దురాచారానికి అతివలు ఆహుతి అవుతున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. సత్యం నిజమగు మాట. స్వప్నము నిద్ర ,కల అని మనం ఎరిగి ఉన్నాం. స్వప్నంలో కూడా సత్యమును నిజమగు మాటనే చెప్పి యువకుల్లో చెలరేగే భావావేశాన్ని అందంగా అలవోకగా చెప్పారు. సుకుమారమైన లేలేత పూచిన పువ్వులైన అమ్మాయిల ద్వారా కర్తవ్యము తెలియ చేసిన తీరు అద్భుతంగా ఉంది. పువ్వులు కూడా నవ్వగలవని కొంటెగా హేళన చేయగలవని మనం కవిత ద్వారా తెలుసుకున్నాము. మల్లారెడ్డి వరకట్నం వ్యతిరేకించే వారని అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకున్న వారని కవిత ద్వారా సందేశం అందజేస్తున్నారు. సమాజం హితం కోరి కవితా వ్యవసాయం చేస్తూ రచనలు సాగిస్తున్నారు. వరకట్నం దురాచారం వల్ల ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు. స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించిన వారి కలానికి సలాం చెప్తున్నాను. మల్లారెడ్డి ఇంకా మరిన్ని మంచి రచనలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
=====================
నరేంద్ర సందినేని
ఇంటి నం: 8-2-238/1,
వాసుదేవ కాలనీ,
కట్టా రాంపూరు,
కరీంనగర్.
గులాబీల మల్లారెడ్డి "సత్యము స్వప్నము" కవితపై విశ్లేషణ; నరేంద్ర సందినేని .;ఫోన్ నం: 7093030259.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి