సమయస్ఫూర్తి;-డి.కె.చదువులబాబు.

 ఒక అడవిలో ఒక లేడి ఉండేది. అది సమయస్ఫూర్తితో తననుతాను కాపాడుకుంటూ ఉండేది. ఆ అడవిలోని పులిబారినుండి ఉపాయంతో రెండుసార్లు తప్పించుకుంది.చాలాకాలం తర్వాత తిరిగి పులి కంట పడింది. లేడి మాటలు వినకూడదని గట్టిగా నిర్ణయించుకున్న పులి వెంటపడింది.లేడి పరుగందుకుని అడవిని దాటి వెళ్లిపోయింది. 
'లేడి ఎక్కడికెడుతుంది? తిరిగి అడవిలోకి వస్తుంది.అప్పుడు దాని సంగతి చూడవచ్చు 'అనుకుంటూ పులి ఆగిపోయింది. 
అలా పరుగెడుతూ వెళ్లిన లేడి వేరొక అడవిలోకి ప్రవేశించింది. ఆ అడవిలో చెట్టు క్రింద సేదతీరుతున్న లేడిని రెండు తోడేళ్లు చూసి,'మంచి ఆహారం దొరికింది' అనుకుంటూ దగ్గరకొచ్చాయి.
 పరుగెత్తి పరుగెత్తి అలసిపోయిఉన్న లేడికి పరుగందుకునే శక్తిలేదు. వెంటనే ఒక్కక్షణం ఆలోచించి"ఆగండి"అంటూ గట్టిగా అరిచింది. ధైర్యంతో కూడిన ఆ అరుపుకు అవి ఆగాయి.
 "ఈ అడవిరాజు నాకు మిత్రుడు. నేను చూడటానికి వస్తున్నట్లు రాజుకు కబురంపాను.చెట్లమీదున్న పక్షులు చూస్తున్నాయి.మీరు నాకు ఆపద తలపెడితే ఆవిషయం రాజుకు పక్షులద్వారా తెలుస్తుంది. రాజు చేతిలో మీకు చావుతప్పదు"అంది ధైర్యంగా!
ఆమాటలకు భయపడి తోడేళ్లు వెళ్లిపోయాయి. 
చెట్టుచాటునుండి నవ్వు వినిపించడంతో లేడి ఉలిక్కిపడి అటువైపు చూసింది. అక్కడ సింహం ఉంది.
సింహం లేడిదగ్గరకు వచ్చి "నీమాటలు విన్నాను.నువ్వు నాకు మిత్రుడివా?అలా చెప్పుకోవడానికి నీకు ఎంతధైర్యం?"అంది.
లేడి నమస్కరించి "మహారాజా!క్షమించండి. నేను మీమంచితనం, పరాక్రమం గురించి విని ఇక్కడ ఉందామని పక్క అడవినుండి వచ్చాను.మీపట్ల జంతువులకు ఉన్న భయభక్తులను చూడాలనిపించి తోడేళ్లతో అలా చెప్పాను. మీమీదున్న గౌరవంతో వెంటనే తోడేళ్లు నాకు ఆపద తలపెట్టకుండా వెళ్లిపోయాయి.మీగొప్పదనం చాటడానికి ఈసంఘటన చాలు. ఆ అడవిలో మృగరాజు దుర్మార్గుడు. తెలివితేటలులేని వాడు.అక్కడ జంతువులకు రాజుపట్ల భయమేతప్ప భక్తిలేదు. అందుకే మీపరిపా లనలో మీగొప్పదనాన్ని చాటుతూ ఉండిపో దామని వచ్చాను. తప్పయితే క్షమించండి"అంది.
లేడి వినయవిధేయతలకు, పొగడ్తలకు సింహం ఉక్కిరిబిక్కిరయింది. మురిసిపోయింది.
"నువ్వు నా మిత్రుడివని చెప్పు. ఏజంతువూ నీకు ఆపద తలపెట్టదు. ఇక్కడ స్వేచ్చగా ఉండు." అని చెప్పి, లేడి ప్రశంసలను తల్చుకుంటూ గర్వంగా తలపైకెత్తుకుని వెళ్లిపోయింది.
లేడితన సమయస్ఫూర్తికి మురిసిపోయింది.

కామెంట్‌లు