రేఖలు......లేఖలు;-- యామిజాల జగదీశ్
 ఏ భాషా సాహాత్యంలోనైనా ఉత్తరాలకు ఓ ప్రత్యేక స్థానముంటుంది. ఎలాంటి ఉత్తరమైనా కావచ్చు. నాకైతే నవలలకంటే ఉత్తరాలతో కూడిన పుస్తకాలు చదవటమంటే మహా సరదా. సంబరమూ. సాహితీమూర్తుల ఉత్తరాలైతే వేరేగా చెప్పక్కర్లేదు. 
జీవన రేఖలు - సాహితీ లేఖలు అనే శీర్షికతో ఇరవై రెండేళ్ళ క్రితం వెలువడిన నూట అరవై ఏడు పేజీల పుస్తకాన్ని చదివాను. శ్రీ మధునాపంతుల ట్రస్ట్ (రాజమహేంద్రి) వారు ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అరవై రూపాయలు. మహాకవి కీర్తిశేషులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి ఉద్ధండ కవిపండితులు, సాహితీవేత్తలు వ్రాసిన లేఖలివి.  ఈ పుస్తకానికి సంపాదకులు సన్నిధానం నరసింహ శర్మ, డా. అరిపిరాల నారాయణ రావు, మధునాపంతుల వేంకట చలపతి, మధునామూర్తి.
ఇందులో ప్రచురించిన లేఖల సంఖ్య తక్కువే...ప్రచురించిన లేఖలలోని అంశాలు మాత్రం ఎక్కువన్న అరిపిరాల నారాయణరావు, సన్నిధానం నరసింహశర్మ గార్ల మాట నిజం. 
నలబై మంది ప్రముఖుల ఉత్తరాలతోపాటు వారి ఫోటోలు (ఫోటోలు దొరకని వారివి రేఖాచిత్రాలు), వారి వారి దస్తూరీలతో పాఠకలోకానికి అందించిన ఈ 167 పేజీల పుస్తకం ఓ ఆణిముత్యమే. 
నలబై మంది ప్రముఖులలో నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆరుగురున్నారు. వారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర.  మరో పదకొండు మంది గురించి విన్నాను. 
ఉత్తరాలనేవి ఇద్దరి మధ్య అనేకన్నా రెండు మనసుల మధ్య జరిగే మాటలు. అవి వ్యక్తిగతమైనవే అయినా ప్రముఖుల మధ్యవైతే అవి అందరికీ ఆసక్తికరమైనవే. 
వేలూరి శివరామశాస్త్రి (సురవరం)
మీ ఉత్తరమూ పుస్తకమూ నిన్ననే అందినవి. అందగానే చదివి ముగించాను. మీ ఉత్తరంలో మీరు చూపిన అనురాగానికి వశుడనై నా యీ క్రింది సందేహాలను ఉల్లేఖిస్తున్నాను. నా సందేహాలు నివృత్తికేగాని మిమ్ములను ఖండించడానికి ఎంత మాత్రమూ కాదని యీ పీఠిక మాత్రం అను పదం మీకు గుర్తులో ఉండాలని కోరుతున్నాను....(18-8-44)
తల్లావఝుల శివశంకరశాస్త్రి (తెనాలి)
అమరావతి సమావేశపు కార్యక్రమములో మీ వ్యాసమూ, పద్య ఘట్టమూ చేర్చినాము. 12 తారీఖున అచ్చుకు వెళ్ళుతుంది. తీర్థులను కలుసుకోండి. ఇక్కడ కల్యాణీ ప్రెస్సువారు మన మిత్రులు – యోగ్యులెవరైనా భాగస్వామిగా కలిస్తే తీసుకునే ఉద్దేశ్యములో ఉన్నారు. మీకు భాగముకావలెనా? ఎంత పెట్టగలరు? వెంటనే పైసా వస్తుందా? ఆలస్యముంటుందా? బాగా ఆలోచించి వ్రాయండి. (ఏప్రిల్ 8, 1947)
దుర్భాక రాజశేఖర శతావధాని (ప్రొద్దుటూరు)
మధురాతి మధురమై – హృదయము విప్పి వచించి నట్లుండు మీ లేఖ చేరి నాకనంత సంతోషము గూర్చినది. మీ శైలి నేను గొనియాడుదు. మీ యాంధ్ర రచయితలు నిజముగ జూడవలతు. చారిత్రక గ్రంథములు వ్రాయు మీ వంటి మహనీయులు నాకు బూజ్యులు. మీరు కృతకృత్యులు. (31-12-45)
విశ్వనాథ సత్యనారాయణ (బెజవాడ)
అయ్యా, మీ ఫారాలు వచ్చినవి. నా పీఠిక నేను సోమవారం నాడు రిజిస్టరు చేసి పంపుతాను. రేపు వ్రాస్తాను.
చిత్తగించవలెను. (6-2-54)
మల్లంపల్లి సోమశేఖర శర్మ (వాల్తేరు)
నమస్కారములు. ఉభయకుశలోపరి. మీ ఉత్తరము వచ్చి చాల దినములయినది. దానికి వెనువెంటనే జవాబివ్వవలెననుకొనుచునే ఆ విషయము మరచి పోయినాను. మీరు ఉత్తరము వ్రాసిన విషయమే జ్ఞాపకము లేకపోయినది. ఈ దినము పుస్తకములు సర్దుకొనుచుండగా మీ యుత్తరము కనబడినది. ఇంతకాలము జవాబు వ్రాయునందుకు చాల విచారపడినాను. ఈ యాలస్యమునకు నన్ను మన్నించుడని కోరుట నేనిపుడు చేయగలిగిన పని. (13-1-60)
రాయప్రోలు సుబ్బారావు (తిరుపతి)
విజయదశమి అభినందనములు. మీ పుస్తకము ఉత్తరము అందినవి. ఆంధ్ర పురాణం ఇదివఱకే చదివాను. తప్పిపోయిన లేగకు తల్లిగోవు కనిపించినట్లయింది. అకాడమీవారి బహుమానం కోసం ప్రయత్నించాను. ఇంకొక ప్రసిద్ధుని కూడా బలాత్కరించి కలుపుకున్నాను. కానీ ఫలించలేదు. (3-10-57).
సురవరం ప్రతాపరెడ్డి (11 వనపర్తి బిల్డింగ్స్, హైదరాబాదు జిల్లా)
మళ్ళా మనకు జాబులు లేక చాల కాలమయ్యెను. నేను హైద్రాబాదుకు వచ్చ ఇంచుమించు రెండు నెలలయ్యెను. ఇక్కడి Tri Weekly దిన ద్వయపత్రిక (తెనుగు) స్థాపించుటకై లక్ష రూపాయల లిమిటెడ్ కంపెనీ స్థాపిస్తున్నారు. 20,000 రూ. వాటాలను డైరక్టర్లు తీసుకున్నారు. కంపెనీ రిజిస్టరుకు దాఖలైనది. 4 – 5 దినాలలో ఆ పని పూర్తియగును. తర్వాత నెల దినాలలో 40 వేల వరకు వసూలు చేయుదురు. బహుశా పత్రిక అక్టోబరు మొదటి లేక బాపూజీ పుణ్యదినము నుండి వెలువడగలదు. ఇది నా కథ. (23-5-51).
పుట్టపర్తి నారాయణాచార్యులు (త్రివేండ్రం)
తమరు దయతో వ్రాసిన లేఖ యందినది. నేను వ్రాసిన నాల్గు ముక్కలకు పరితోషపడుట తమ సహృదయత. అంటే ఇంతకును – జననాంతర సౌహృదములు సంభవించినపుడా యనుభూతి యట్లే యుండును. మానవ తర్కమున కర్థముగాని రహస్యములలో నిదియు నొక్కటి. (1-7-55)
ఇ. హనుమచ్ఛాస్త్రి (వరంగల్)
నేను పుస్తకాలు చదువుకుంటూ ఈ వేప చెట్ల నీడల్లో కాలక్షేపం చేస్తున్నాను, ఈ మిల్ కాలనీ ఊరికి దూరంగా కాకతీయుల కోటకు దగ్గరగా ఉంటుంది. కేవలం మిల్లు ఉద్యోగుల కోసం కట్టారు. విశాలమైన వీధులు కారుకూతలు లారీ ఘోషలు వినపడవు. వీధుల నిండా వేపచెట్లు. నిండా పూలు పరిమళిస్తూ ఉంటాయి. చెవులారా కోకిల కూజితాలు వినపడుతూ ఉంటాయి.. (16-1-79)
బెజవాడ గోపాల రెడ్డి (నెల్లూరు)
నా తొలి గ్రంథము కాలవాహిని. లీలావతి గారి వద్ద తీసికొని చదవండి. తర్వాత మీకు ప్రతినొకదానిని పంపగలను. హైదరాబాదు నుండి పంపాలి.
వచన కవితలో కూడా కవితావాసన చూపవచ్చునని మీరు ఆనాడు అన్నారు. మీ లేఖ నాకు ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. కృతజ్ఞుడను. (28-4-81)
దాశరథి (మైలాపూరు, మద్రాసు)
మీరు ఎంతో ప్రేమతో పంపిన ఉపద (శ్రీ ఖండము, ఆంధ్రపురాణము) అందనది. కృతజ్ఞతలు. పద్యం తెలుగువారి వారసత్వం. దాన్ని చంపాలనే కొందరి విఫల ప్రయత్నానికి నవ్వుకుంటున్నాను. హృద్యమైన పద్యరచనా ప్రక్రియను ఆధునిక యుగంలో సజీవంగా ఉంచిన గౌరవం మీకే దక్కుతుంది. (24-9-75)
సంజీవదేవ్ (తుమ్మపూడి)
మీ బాల్యస్మృతులు, సాహితీ స్మృతులు, సాహితీ శిల్పుల గురించిన స్మృతులు, ఇంకా ఎన్నిటికో సంబంధించిన స్మృతులు, అన్ని కలిసి అదొక మృదువైన, మధురమైన స్మృతి సరిత్సాగరం అయి ప్రత్యక్షమైంది. (3-6-87)
సి. నారాయణ రెడ్డి (హైదరాబాదు)
మీ ఉత్తరం అందినది. చాలా సంతోషం. నిరుటి నుండి మీ ఆంధ్రపురాణం ఎం.ఏ.కు పాఠం చెప్పే సదవకాశం కలిగింది. చదివిన కొద్దీ చవులూరిస్తున్న ప్రౌఢ రచన మీది. విద్యార్థులు గూడా మీ రచనా పాటవానికి ముగ్ధులౌతున్నారు. (20-8-64)
కొత్త సత్యనారాయణ చౌదరి (అమృతలూరు)
తమకు అపరిచితుడనగు నేను, నాకు పరిచితులగు మీకు – ఇది వ్రాయుటలో ప్రధాన కోణం నిన్న మొన్న – మీ ఆంధ్ర రచయితలు సాంగోపాంగముగ చదివి ఆనందము పట్టలేకపోవుటయే. (17-2-51)
 ---------
ఈ పుస్తకంలోని ఉత్తరాలన్నీ విలువైనవి. చదివి తెలుసుకోవలసినవి. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 1957 సెప్టెంబర్ 28న మధునాపంతులవారికి రాసిన ఉత్తరం ఆశ్చర్యకరమైనది. ఆయన ప్రముఖ కవి దాశరథిగారి లెటర్ ప్యాడ్ కాగితంపై రాయడం. ఊహకందని అంశం. మధునాపంతులవారి ఉత్తరాలుకూడా రెండు చోట్ల కనిపించాయి. గడియారంవారికి 1946లో, కుందుర్తి వారికి  1979లో రాసిన ఉత్తరాలవి. తల్లావఝుల శివశంకరశాస్త్రిగారి దస్తూరికూడా వేసి ఉంటే నిండుగా ఉండేది. మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మద్రాసులో కొంత కాలం నివసించారన్న విషయం ఆయన రాసిన లేఖల ద్వారా తెలిసింది. 
శ్రీ మధునాపంతుల ట్రస్టు నుంచి ఇరవై రెండేళ్ళ క్రితం వెలువడిన ప్రథమ పుష్పమీ గ్రంథం. ఆద్యంతమూ చదివి ఆస్వాదించాను.










కామెంట్‌లు