నక్కవెక్కిరింతలు;-డి.కె.చదువులబాబు

 ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. ఆసింహం తన కుమారుడి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరపాలని నిర్ణయించింది. జంతువులు,పక్షులు వాటి ప్రతిభను తన కుమారుడి పుట్టినరోజు ప్రదర్శించి సందడి చేయాలని ఆజ్ఞాపించింది. 
ఆ అడవిలో కందకం అనే నక్క ఉండేది. అది వెళ్తూఉంటే ఒకచోట ఒకనెమలి పురి విప్పి నాట్యంచేస్తూ కనిపించింది.
 "అబ్బో!నీలాంటి అందమైన పింఛాలతోక ఎవరికీ లేదని,నీలాగనాట్యం ఎవరికీరాదని విర్రవీగకు. నేను తల్చుకుంటే నీకంటే గొప్పగా నాట్యం చేయగలను"అంటూకేకలేసి వెళ్ళిపోయింది. ఒక కోయిల చెట్టుమీద కూర్చుని వినసొంపుగా రాగాలు తీస్తూ నక్కకు కనిపించింది.
నక్క తలపైకెత్తి"ఏయ్! కోకిలా! ఈఅడవిలో నీలాగా ఎవరూ మధురంగా పాట పాడలేరని తలఎగరేయకు. నేను తల్చుకుంటే నీకంటే వందరెట్లు వినసొంపుగా పాడగలను. కూసింది చాలు. ఇక నోరుముయ్యి" అంటూ దబాయించి వెళ్ళింది.
నక్కకు దారిలో ఒకలేడి తన అందమైన కళ్ళను తిప్పుతూ గెంతులేస్తూకనిపించింది. 
"ఓలేడీ... అందమైన కళ్ళున్నాయని, అందంగా చిందులేయగలనని మిడిసిపడకు. నేను నీకంటే అందంగా చిందులేయగలను.ఇకచాలించు"అని అరిచి వెళ్లింది.
నక్కకు దారిలో ఒక కోతి చెట్లమీద దుముకుతూ కొమ్మలు పట్టుకుని వేలాడుతూ రకరకాలవిన్యాసాలు చేస్తూ కనిపించింది."ఏయ్!కోతీ... నీలాగా ఈవిన్యాసాలు ఈఅడవిలో ఎవరికీ చేతకావనే అహంకారంతో ఎగిరెగిరి పడకు.  నాముందు నీకోతి విన్యాసాలెంత?ఎగిరింది చాలు. కుదురుగా కూర్చో!" అని దండించి వెళ్లిపోయింది నక్క.
దారిలో దానికి ఒక చిలుక ముద్దుముద్దుగా చెట్టుతో మాట్లాడుతూ కనిపించింది. నీఅంతముద్దుగా మాట్లాడటం ఎవరికీ రాదని గర్వపడకు. నేను తల్చుకుంటే నీ కంటే బాగా మాట్లాడగలను. ఇక నోర్ముయ్!" అని అరిచి వెళ్లిపోయింది. 
నక్కకు దారిలో ఒకగుర్రం నాట్యంచేస్తూ కనిపించింది.గుర్రాన్ని కూడాఅరిచి వెళ్లింది.అలాగే ఉడతను, కుందేలును, సీతాకోకచిలుకను నిందించింది.
రెండు రోజుల తర్వాత మృగరాజు కుమారుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభ మయ్యాయి.ఆవేడుకల్లో నెమలి, కోకిల, లేడి,కోతి,చిలుక,గుర్రం మొదలగు జంతువులు, పక్షులు వాటి విద్యలను ప్రదర్శించాయి.చక్కటి ప్రతిభను చాటి బహుమతులందుకున్నాయి.
సింహం నక్కను పిలిచి "నీకు ఎందులో ప్రతిభ ఉందో ప్రదర్శించి, అందరికీ వినోదాన్ని కలిగించు" అంది.
 ఏ ప్రతిభాలేని నక్క పిచ్చిచూపులు చూస్తూ "మహారాజా!ఈరోజు నాఆరోగ్యం సరిగాలేదు. అందుకే ఏవిద్యలనూ ప్రదర్శించలేకున్నాను"అంది.
సింహం నవ్వి "నువ్వు ఏరోజయినా ఏపనినైనా నేర్చుకుని, నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేశావా ?నీ గడిచిపోయిన జీవితకాలమంతా ఇతరులను విమర్శించడానికి, నీగురించి లేనిగొప్పలు చెప్పుకుంటూ తిరగడానికి సమయం కేటాయించావు.ఏపనైనా నేర్చుకుని ఆపనిలో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నించలేదు.నీలాగా పనికిరాని పనులకు సమయాన్ని వృధా చేసేవారు దేనికీ పనికిరారు"అంది సింహం.
జంతువులు,పక్షులు వాటి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సాధన చేస్తుంటే తాను విమర్శిస్తూ తిరగడం సింహానికి తెలిసిందని నక్కకు అర్థమయింది. 'జరిగిపోయిన కాలమంతా ఇతరులను అసూయతో విమర్శిస్తూ, హేళనచేస్తూ, కాలంవృధాచేస్తూ తిరిగాను. ఆసమయాన్ని మన అభివృద్దికోసం ఉపయోగించుకుంటే ఉన్నతస్థాయికి చేరగలము.'అనుకుంది నక్క.
కామెంట్‌లు