మునిగి పోయెను రైతన్న ముసిరి కరువు ;-కిలపర్తి దాలినాయుడు
సీసము-1
జఠరాగ్నిచల్లార్చ జాలినవాడని
బొగుడుచుందురుగానివగవు గనరు!
మట్టిని ప్రేమించు మతమతనిదందురు
మట్టిపాలౌచున్న ముట్టుకొనరు!
దేశవెన్నెముకగా తెల్పుచుందురుగాని
చట్టాలతో బాది చంపుచుంద్రు!
తే.గీ
మబ్బుకనరాక మడిలోన దుబ్బు లేక
ఋతువు వర్షింపబూనక మెతుకులేక
మునిగి పోయెను రైతన్న ముసిరి కరువు
క్షుభితభారము పైబడి కుమిలిపోయె!

సీసము-2
అన్నదాతవనుచు మిన్నుకెత్తునుగాని
విన్నపమాలింప విసుగుచుంద్రు!
కర్షకాగ్రణివంచు గళముపలుకుగాని
గుండెలో పిసరంత కూర్మిలేదు!
దినమున ముమ్మారు కొనియాడుదురుగాని
తనయింటకన్నీరు తడుమరెవరు?
రాజువు నీవంచు రచనజేతురుగాని
చిల్లిగవ్వైననూచేర్చరెవరు?

తే.గీ
భవ్యపథమది కనరాక బాధపడుచు
కఠిన శిలలైన కరుగును కష్టములకు
స్థూల జాతీయ వనరుల సూత్రమితడు
శూలమునజిక్కులేడియై సోలెనేడు!
---------------------------------------


కామెంట్‌లు