మధుర ఫలాల మహా వృక్షం
సౌందర్య జీవనశైలి సంస్కారం
వ్యక్తిత్వ వికాస పరిణామం
సామాజిక చైతన్య స్వేచ్చా వారధి
విశ్వ మానవ సేద తీర్చే విశాల హృదయం!
సంస్కారం జీవన పయనంలో
ముందుకు నడిపే రస్తా
మలుపు తిప్పే చౌరస్తా
నీలిరంగు నింగికి నిచ్చెనేసి
లక్ష్య శిఖరం చేరుస్తుంది!
సంస్కారం నిరంతర చైతన్య జీవవాహిని
అంగట్లో అమ్మే సరుకు కాదు
పుట్టుకతో రాదు నేర్చుకుంటే వచ్చేది
ఉద్రేకం ఉన్మాదాల మరకలు నివారించి
ప్రగతి రథ సారధికి హారతి పడుతుంది!
నీ హృదయాంతరంగం నుంచి
రాలి పడిన నెత్తుటి చుక్క
అమ్మ నుదుటి సింధూరమై
మాతృ స్పర్శకు పులకిస్తే
సంస్కార స్వరూపం సాక్షాత్కారించినట్టే!
అందరినీ ఆత్మీయంగా ఆదరించినపుడు
అనురాగ జల్లులు వర్షించినపుడు
సంస్కార బీజాలు మొలకెత్తినట్టే!
నలుగురిలో నమస్కార సంస్కారం చిగురిస్తే
సమాజంలో సభ్యత విరులు వికసించినట్టే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి