బరువెక్కిన హృదయం;-కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,8555010108.
మనిషికి ఆకాశమే ఆదర్శం
అనునిత్యం....
జీవన వినీల గగనంలో
తెల్లని మబ్బు పరదాలే కాదు
అప్పుడప్పుడూ....
దట్టమైన మేఘాలావృతమై
నింగి హృదయమెంతో భారమై
ఆపసోపాలు పడుతుంది
ఒక్కోసారి ఉక్కపోతతో
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
మరోసారి వీదురు గాలులతో
అతలాకుతలం చేస్తోంది

మేఘం కన్నీటినో..పన్నీటినో..                                                       
తనివి తీరా వర్షించినపుడు
తేలికపడ్డ మనస్సుతో
సప్తవర్ణాల సింగిడి శోభాయమానమై
ఆకాశం ఆనందంగా చిందులేస్తుంది
నేడు కష్టాల చీకటి దిగమింగితేనే
ఉషారుగా ఉషోదయ వెలుగుతో 
రేపటి నింగి నూతనంగా కళకళ లాడేది!

గతం వెంటాడే మనసుకు
భవిష్యత్ ఉనికి ప్రశ్నార్థకం!
నిర్లిప్తత నిరాశా నిస్పృహల
అనేకానేక ఆలోచనా అలలతో
బరువెక్కిన హృదయం ...
ధ్యాన యోగాలో ఏకాంతంగా కళ్లు మూస్తే
చిత్తమంతా చింతలు లేని నిశ్చలత!



కామెంట్‌లు