దసరా పండుగ అంటే,ఆనాటి మా బడిపిల్లలకు గిలకలపండుగ. ఎప్పుడెప్పుడు ఈ గిలకలపండుగ వస్తుందా అని ఎదురుచూసేవాళ్ళం.
నిజానికి గిలకల పండుగ అంటే పూర్వకాలంలో,రాజకుమారులు,మంత్రులు మొదలగు వారికుమారులు, గురుకులాలలో చదువుకొనేవారు.చదువులతోపాటుగా,అస్త్రవిద్య కూడా గురుకులాలలోని గురువులదగ్గర నేర్చుకొన్నతర్వాత,దసరా పండగ రోజులలో,రాజులు తమరాజ్యంలోని యువకులకు దసరాపండుగ రోజున అస్త్రవిద్యాపోటీలుపేట్టి,వారికి బహుమానాలిచ్చి,తమసైన్యంలో కొలువులిచ్చేవారట .ఆసందర్భంగా ,తమ తమ పిల్లల అస్త్రవిద్యలో ప్రావీణ్యత ఎంతగా సంపాదించారో తెలుసుకోడానికి, బహిరంగ స్థలాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి,అలా తమ పిల్లలకు అస్త్రవిద్యను నేర్పిన గురువులకు దండిగా కానుకలిచ్చిపంపించేవారట.బహుశా,అప్పటినుండీ, ఆనవాయితీగా ఈ గిలకలపండుగ వచ్చివుండవచ్చు.
పండుగకు నెలరోజులముందునుంచే మా సూర్రావు మాష్టారూ వాళ్ళూ, దసరా పాటలు నేర్పించటం మొదలుపెట్టేవారు.
ఏదయా మీదయ మామీద లేదా?అంటూ ఇంచు మించుగాఅన్ని వృత్తులవారిపైనా దసరాపాటలునేర్పించేవారు.
వాటిలో ముఖ్యమైనది,సులువుగా,అన్నితరగతులవాళ్ళూ నేర్చుకోడానాకి వీలుగా,వీనులకు విందుగావుండే గిలకపాట,
ఏదయా మీదయ మామీద లేదా!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!
దసరాకు వస్తిమని విసవిసలు బడక!
చేతిలో లేదనక ఇవ్వలేమనక !
అప్పులిచ్చేవారు
అసలు లేరనక
ఇప్పుడే లేదనక ఇవ్వలేమనక!
రేపురా మాపురా మళ్ళి రమ్మనక!
శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
పావలా బేడైతె పట్టేది లేదు!
అర్థరూపాయైతె అంటేది లేదు!
ముప్పావలైతేను ముట్టేది లేదు!
రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!
హెచ్చు రూకలుయైతె పుచ్చుకొంటాము!
జయీభవ విజయీభవ దిగ్విజయీభవ!
అయ్యవారికి చాలు ఐదు వరహాలు!
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవ దిగ్విజయీభవ!!
మరి దసరాపాటలు నేర్వగానేసరా!గిలకలపండుగంటే గిలకలు కావాలికదా!మాసూర్రావుమాష్టారు "రంగురంగులగిలక
రత్నాలగిలక
అర్జునిచేతిలో అమరినగిలక
శివుడు ఇచ్చిన గిలక
శక్తిగల గిలక
అంటూ పాటకూడా నేర్పించారు.మరి అలాంటి
రంగురంగులగిలకలు మాకు కావాలికదా! మాష్టారేమో "ఇంటిదగ్గర మీ పెద్దవాళ్ళతోచెప్పి చేయించుకోండి లేదా,పిఠాపురంలోనూ,కాకినాడలోనూ,రాజమండ్రీలోనూ బజారులో దొరుకుతాయి తెప్పించుకోండి.ఏమో,ఎలా తెచ్చుకొంటారో నాకుతెలియదు.గిలకలు తెచ్చుకోనివాళ్ళకు పిలకలు ఊడగొడతానని వార్నింగులు ఇచ్చేవారు. ".
అంతే,మానాన్నను "నాన్నా!ఊరెప్పుడెళతావు?మాకు గిలకలు కొనితెవాలి."అంటూ ఇంట్లోవున్న బడికివెళ్ళేపిల్లలందరం బృందగానం మొదలుపెట్టేవారము.
"అలాగేనమ్మా! నేను కాకినాడవెళ్ళినప్పుడు తెస్తాను.మొత్తంగా అందరికీ ఎన్నిగిలకలు కావాలో ఒక చీటీమీదరాయండమ్మా!మరచిపోకుండావుంటాను."అనేవారు.
"నాన్నా!మరచిపోకూడదుమరి "అంటూ అప్పుడే హెచ్చరికలు చేసేవారం.
నాన్న సంగతి బాగాతెలిసిన మా అమ్మ,"మీనాన్న మరచిపోకుండాగిలకలు తేవడం,మీరు గిలకలు పట్టుకు ఊరేగడం జరిగేపని కాదుకానీ, అని నాన్నతో అని,అప్పన్ననో, మరిడయ్యనో వెదురుబొంగులు కొట్టుకొచ్చిపడేయమనండి. సోమలింగమో,సోమసుందరమో వాటినిచీల్చి,గిలకలు చేసిస్తారు."అంటూ నాన్నకు చెప్పేది.
నాన్న,"ఒరేయ్ బాబూ!ఆ వెదురుబొంగులేవో తెచ్చిపడేయండిరా!పిల్లలు గిలకలు చేసుకొంటారుట"అనిపురమాయించేవారు.
పాలికాపులు వెదుర్లుకొట్టుకొచ్చి,సోమసుందరం దగ్గరపడేస్తే, వాటిని బద్దలుగాకొన్నిటినీ,మరికొన్ని సన్నటి పుల్లలుగాచీరి,బద్దలకు కొలిమిలో కాల్చిన యినపచువ్వతో, మధ్యలో ముచ్చటగా మూడుకన్నాలు పెట్టిచ్చేవాడు.
ఇక వాటిని బాణంలావంచి,పురుకొసతోకట్టి,బద్దకున్న మూడుకన్నాలలో,మూడు వెదురుపుల్లలు దూర్చి, ఆపుల్లలను చివరిభాగంలో,ఆరుభాగాలుగా చీల్చి, విడదీసి,పురుకొసతో మిఠాయిపొట్లంలా గుడ్రంగా వచ్చేలా కట్టే పని, మా అన్నయ్యది.అంతటితో గిలకవ్వదుకదా!
తరువాత మా రవణగారికొట్లోంచి, రంగురంగుల అందమైన లక్కకాగితాలు తెప్పించి ,వాటిని కత్తిరించి ,ధనస్సులావంచిన ఆ వెదురుబద్దకు,వంగదీసికట్టిన ఆ పురుకొసతాడులు ,అసలుకనబడకుండా, కత్తింరించిన రంగుకాగితాలు అందంగా అంటించాలి. అలా అంటించాలంటే,మైదాపిండికావాలిగదా!,అదేమిటో మైలుతుత్తం వేసి ఉడికించిన ఆమైదాపిండిని 'లయపిండి' అనేవారం ఆరోజుల్లోమేము.ఆ లయపిండి తయారుచేసేపని మా పిన్నిది.మా పిన్నిది భారీచెయ్యి.మా ఇంట్లోవాళ్ళగిలకలకేకాకుండా,ఊళ్ళోవాళ్ళగాలకలన్నింటికీ రంగుకాగితాలంటించేంత లయపిండి వుడికించిపడేసేది.
సరే!ఇంక కత్తిరించిన రంగుకాగితాల్ని అందగా అటించాలికదా! మాకందరికీ మాగిలకకు మేమే స్వయంగా మాచేతులతో, రంగుకాయతాలంటించుకోవాలనేది మా కోరిక.కానీ మా అన్నయ్యదగ్గర అలా మా పప్పులు ఉడికేవికాదు.వాడుఏదైనా పని మొదలుపెడితే,అదిపూర్తిగా వాడిచేతులమీదే జరాగలనేవాడు.అన్నయ్యకు కోపమొస్తే,గిలకబద్దలకైతే రంగుకాగితాలంటించగలముకానీ, గిలకలోదూర్చిన ఆపుల్లలకు చివర్న మిఠాయిపొట్లాలులా తయారుచేయాలంటే,వాటికి మేముకాగితాలంటించలేముకనుక,వాడు శ్రధ్ధగా అంటింస్తుంటే, చుట్టూకూర్చొని చూసేవారం మా పిల్లకాయలందరం.
సరే! అందమైన రంగురంగుల గిలక రత్నాలగిలకలు తయారయ్యేకా, అవి ఎలా పని చేస్తున్నాయో చూడాలికదా!అలా చూడడానికి,భూతులసిమొక్కలు మొదలైన పచ్చిరొట్ట తెప్పించి, గిలకల్లోని మిఠాయిపొట్లాలలా వున్న ఆబుట్టల్లోకి, ఆ రొట్టనుకూరి,"జయాది జయభవా!దిగ్విజయీభవా"అంటూ గిలకలను బాణంలా లాగివదిలితే,ఆరొట్టంతా ఇల్లూవాకిలీ పడితే, అమ్మచేత చివాట్లు తను తిని,మాచేత తినిపించేవాడు అన్నయ్య. బుక్కాగుండఅంటూ,ముగ్గుపిండిని కూడా ఇల్లంతా చల్లేవాళ్ళంకూడా! , మాఅన్నయ్య కట్టిన గిలకలు నిజంగానే అర్జునుడి విల్లులాగే అందంగా వుండేవి.
ఇంక మా రత్నాలగిలకలు తయారైపోయేయని,వాటిని మాస్నేహితులకు చూపిస్తూ, మురిసిపోయేవారం.అప్పటికి ఇంకా గిలకలు చేయించుకోనివాళ్ళదగ్గర గొప్పలుపోయేవారంకూడా.
కొంతమంది ఒకే మిఠాయిపొట్లంలావుండే చిన్న గిలకలుకొనుక్కునేవారు.మా గిలకలముందర ఒంటికన్నురాక్షసిలావుండే ఆగిలక అందంలో ఓడిపోయేది.
అలాగే ఎంతైనా కొన్నగిలకలు కొన్నట్లేవుండేవికానీ, మా అన్నయ్యకట్టిన గిలకల అందంముందు అవి చిన్నపోయేవి.
అందరూ గిలకలు కొనుకొన్నా,కొనుక్కోకపోయినా,పండగ దగ్గరకొచ్చేసి,బడులకు సెలవలు ఇవ్వకుండా,గిలకల ఊరేగింపు మొదలు పెట్టాలికదా!ఎందుకంటే,పైఊరినుంచి వచ్చి ఇక్కడవుండి ఉద్యోగంచేసే మాష్టర్లు సెలవలకు వాళ్ళవాళ్ళఊర్లు వెళ్ళిపోవాలిగదామరి!అందుకని సెలవలు ఇచ్చేముందుగానే,గిలకలు పట్టుకొని ఊరేగింపుకు పాటలుపాడుతూ ఊరిమీదకు బయలుదేరేవాళ్ళం.
ఏదయా మీదయ మామీదలేదా ఇంతసేపుంచుటా ఇదిమీకు తగునా
అంటూ పాడుతూ ఇళ్ళవాళ్ళను పాటలతో నిలదీసేవారం.
అలా కరణంగారింటిదగ్గరా, మునసబుగారింటిదగ్గరా,వర్తకులిళ్ళదగ్గరా గిలకలు పాటలు పాడుతూ,ఉరూవాడా సందడి చేసేవారం
ఆపాటలలో కొన్నిపాటలు మీరూ అవలోకించండి.
--
వసుధలో శ్రీకృష్ణ వనమాలివినుమా
వసుదేవనందనా
వాదునీకేలా
కొలనునో ములిగితిమి
స్నానమాడంగా
వడ్డునుంచిన చీరల్లు
వడిగ మూటనుగట్టి
చెట్టునెక్కితివోయి చిలిపి కృష్ణయ్య
మాచీరలివ్వరా మదనగోపాలా
మీచీరలెవరెరుగు మిమ్మునెవరెరుగు
నీరజాలోచనా నీవెకాదటరా
చేతులెత్తుకరండి చెలులు మీరంతా
చెతులెత్తుకవస్తె సిగ్గు కాదటరా
మీచిన్నమరదిని మీకుసిగ్గేలా
బ్రోచేటి వాడను మీకు వెరపేలా
కాచేటి వాడనూ
కదలి ఇటురండి
మోక్షమున్నిచ్చేటి
మోహనుడనేను
----
తల్లితండ్రులతోడి
దైవాలతోడి
సతులతో హితులతో సౌఖ్యములుగలిగి
సుతులతో హితులతో శోభానాల్ గలిగి
గంధమాల్యంబరా గ్రాకుములు గలిగి
బంధుజాలంబులో ప్రఖ్యాతి గలిగి
తనయులకు తనయులకు తనయుల్లు గలిగి
మనమలకు మనమలకు మనముల్లు గలిగి
వన్నెవాశియు గలిగి వర్ధిల్లరయ్యా ||జయా||
సన్నుతాచారములు చదివించరయ్యా
పుట్టంబు లొక తూము
బెల్లంబు మణుగు
పట్టుమని మాకిచ్చి
పంపించరయ్యా ||జయా||
---
రాజాధిరాజువు రాజ మార్తాండ సభలందు మిమ్ములను రాజుల్లు మెచ్చ|
రాజ సద్భంధువుడవు
రాజ్యాననీవు
| రాచకార్యములందు| ప్రాజ్ఞుడవు నీవు|
రాచ నియ్యోగులలో రశికుడవు నీవు వజ్రాల హారాలు వందల్లొగలిగి వరహాల హారాలు వేలల్లొగలిగి
ముద్దైన ముత్యాల హారాలుగలిగి
ఇంపైన కెంపుల
హారాలు గలిగి
పచ్చల హారాలు
హెచ్చుగా గలిగి
పగడాలహారాలు
మెండుగా గలిగి
మేలుగా శ్రీ హరి మెచ్చేనుమిమ్ము || జయాభిజైభవ!దిగ్విజైభవ!! ||
ఘల్లు ఘల్లున నీ చేతిఘంటమ్ము నటింప|
ఝులంల్లుఝుల్లున వైరి| గుండెలు అదర|
లీలగా బహు నేర్పున| లెఖ్ఖలు గణింప|
బహు తెఅంగుల నిన్ను ప్రభు వెచ్చరింప|
స్నానసంధ్యాహోమ| జపాదులందు
మానవుల్ నీ సాటి| మహిమలో లేరు|
వసుధలో …………. వంశాబ్ధి చెంద్రుడవు నీవు
అసహాయశూరుడవు అమిత గుణపాత్ర|
భళి! భళీ! భాగ్య దేవేంద్ర || జయాది జైభవ!దిగ్విజైభవ!! ||
పావలాబేడైతే పట్టేదిలేదు|
అర్ధరూపాయైతే అంటేదిలేదు|
ముప్పావలాలయితే ముట్టేదిలేదు|
రూపాయ అయితేను చెల్లుబడి కాదు|
రెండు రూపాయలైతె రొక్కంబు మాకు|| జయాభిజైభవ!దిగ్విజైభవ!!||
జయాభిజైభవ!దిగ్విజైభవ!!
అలా గిలకపాటలుపాడుతూ,వీధులలోని ఇంటింటా ఆగుతూ,వారుపంచే పప్పుబెల్లాలూ!అటుకులూ,బెల్లం,కొబ్బరికోరూలూ ఆరగిస్తూ,వారుపంచే పలకలూ,కనికలూ,జాగ్రత్తచేసుకొంటూ,అలా మమ్మాదరించి, బహుమతులిచ్చినవారిపై,గిలకలలో దట్టించి బుక్కారంగులు చల్లుతూ,పంచనివారిపై, పచ్చిరొట్ట ఆకులూ,చిత్తుకాగితం ముక్కలూ చల్లుతూ,
రేపురా మాపురా మళ్ళిరమ్మనకా
అంటూ అంటూ వాళ్ళచెవులు గింగిర్లెత్తిపోయేంత గట్టిగా పాడుతూ,
చిలకల్లా కిలకిలా నవ్వుతూ, ,
ఆడపిల్లలూ ,మొగపిల్లలూ అన్నవ్యత్యాసాలెరుగక,
మాపంతుళ్ళకెన్ని పంచలచాపులూ,విచ్చు రూపాయలూ వచ్చేయో మేమేమాత్రం పట్టించుకోక,
మళ్ళీరమ్మన్నవాళ్ళింటికి మళ్ళీ మళ్ళీ వెళుతూ,వారంపదిరోజు ఊరేగింపులు జరిపేవారం.
మొత్తానికి పాటలతో బతిమాలి, బామాడి వారిదగ్గరనుంచి మొత్తానికి కానుకలు స్వీకరించేవారం.
అలా సందడీ సందడిగావచ్చిన మాగిలకలపండుగ,వచ్చినట్లే వచ్చి,'మళ్ళీఏడాది కలుసుకొందాం'అంటూ, వెళుతూ వేళుతూ,మాబడిపిల్లల సందడి,బహుపసందంటూ సందడిని మూటగట్టుకొని వెళ్ళిపోయేది.
మారంగురంగుల రత్నాలగిలకలు మా మా గదులలలో గోడలమీదకెక్కెేవి.మళ్ళీ వచ్చే తమ గిలకల పండగకోసం ఎదురుచూస్తుండేవి అవి.
గుర్తుకొస్తున్నాయి- గిలకలపండుగ;- సత్యవాణి కుంటముక్కుల--8639660566
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి