చెట్లు కొన్ని విషయాలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445

  'ఇంటికొక చెట్టు----చెట్లు పెంచండి కరవు నివారించండి' మొదలైన అనేక నినాదాలను మన ప్రభుత్వాలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి అయినా ప్రపంచ వ్యాప్తంగా చెట్లు కొట్టడం,అడవులు నరికి వేరే విధంగా ఉపయోగించడం ఆగటం లేదు.
        జగదీష్ చంద్రబోసు శాస్త్రజ్ఞుడు అనేక ప్రయోగాల ద్వారా అనేక సంధర్భాల్లో చెట్లు స్పందిస్తాయని తన ప్రయోగాలతో నిరూపించాడు. చెట్ల ఉపయోగాలు వ్రాస్తే ఓ పెద్ద వ్యాసమే అవుతుంది.ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే జీవి ఏది అంటే టక్కున 150 సం॥ పైచిలుకు బతికే సముద్రపు తాబేలును గురించి చెబుతారు. నిజానికి చెట్టు కూడా జీవే కదా! పశ్చిమ అమెరికాలో కొన్ని రకాల పైన్ చెట్లు 4000 సం॥ నాటివి అని శాస్త్రజ్ఞులు నిరూపించారు.మనదేశం ఉత్తర ప్రదెశ్లోని ఛమోలి జిల్లాలోని ఒక రకమైన వృక్షం ( shaitoot tree)   సుమారు 1200సం॥ నాటిది.
       అనంతపురం జిల్లాలో 5.2ఎకరాల స్థలం ఆక్రమించిన తిమ్మమ్మ మర్రి మాను అనే చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.1988 లో దీనిని కని పెట్టారు. 4000 చ॥మీటర్ల విస్తీర్ణంలో పెంచిన చెట్లు సుమారు ముగ్గురు మనుషులకు సరిపోయే ప్రాణ వాయువు ఇస్తాయట.
      నొప్పులకు వాడే ఆస్పిరిన్ మరియు అనేక మందులు చెట్లనుండి లభిస్తాయి.1980 లో డేవిడ్ రోడ్స్ అనే శాస్త్రవేత్త చెట్లు కొన్ని కనబడని,వినబడని సంకేతాలను పక్క చెట్లకు పంపుతాయని కనుక్కున్నాడు.ఉదాహరణకు ఒక చెట్టుకు చీడ పడితే 'టాన్నిన్' అనే రసాయన పదార్థం ఆకులు స్రవిస్తాయి! చీడ పట్టక పోయినా పక్క చెట్లు ఈ రసాయనాన్ని ఎక్కువ మోతాదులో స్రవిస్తాయి.అంటే దీని ఆకులు పురుగులు జీర్ణించుకోలేవు! ఇంకా పురుగులకూ,ఫంగస్ జబ్బులకూ వివిధ రకాల రసాయనాలను తమంటతామే చెట్లు తయారు చేసుకుంటున్నట్లు  శాస్త్రజ్ఞులు కనుగొన్పారు.
      చెట్ల వేళ్ళు భూమిలో పాకుతూ భూమిలో లభించే ఖనిజాలు,నీళ్ళకోసం పోటీ పడుతుంటాయి. భూమిలో ఉండే ఒక రకమైన శిలీంద్రం(బూజు) మైకోరైజా ఫంగై  ఈ పోటీని వింతగా తగ్గిస్తాయని డేవిడ్ పెర్రీ అనేవృక్ష శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. అదిగాక చెట్ల వేళ్ళమీద ఈ ఫంగై బతుకుతూ  తగిన మోతాదులో అన్ని రకాల చెట్లకు లవణాలు,నీళ్ళు అందేట్టు చూస్తాయి.
      ఎడారులు లేక చెట్లు పెరగడానికి అనువుకాని చోట్ల కూడా పెరిగే చెట్లను అనేక పరిశోధనశాలల్లో రూపొందిస్తున్నారు.ఇజ్రాయల్, రష్యా లలో ఈ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయి.
 హైదరాబాదు గోల్కొండ వద్ద ఉన్న 'ఏనుగ మర్రి మాను' (adansonia digitata) చెట్టు తొర్ర అతి పెద్దది! ఇందులో ఒకేసారి 27మంది నిలబడి రికార్డు స్థాపించారు.హిమాలయాల్లో పెరిగే రుబర్బే( rheum nobile) చెట్టు పువ్వు ఇంచుమించు ఒక మీటరు పొడవు పెరుగుతుంది.ఈ చెట్లు హిమాలయాల్లో 14000 అడుగుల ఎత్తులో పెరుగుతాయి! హిమాలయాల్లోనే 3లేక 4వేల అడుగుల ఎత్తులో పెరిగే 'అకోంటిమ్' అతి విషపు చెట్టు! ఈ చెట్టు విషం ఊపిరి తిత్తుల మీద పని చేస్తుంది! దీని బెరడు,వేళ్ళు అనేక ఆయుర్వేద మందుల్లో వాడుతున్నారు.
       కలకత్తా బొటానికల్ గార్డెన్స్ గల నీటి లిల్లీ చెట్టు ఆకులు అతి పెద్దవి,ఆరేళ్ళ అబ్బాయి హాయిగా ఈ చెట్టు ఆకు మీద కూర్చో వచ్చు.
       ఇన్ని విశేషాలు ఉన్న చెట్లను మనం కాపాడు కొందాం!
                 """"""""""""""" """"""""""

కామెంట్‌లు