ఒకూర్లో ఒక రైతు వుండేటోడు. వాడు పేదోడైనా చానా మంచోడు. నిజాయితీపరుడు. నిరంతరం దేవున్ని భక్తితో కొలిచేటోడు. వున్న నాలుగెకరాలని కష్టపడి పండించి, వచ్చిన డబ్బుల్లో తనకు కావాల్సినంత వుంచుకోని మిగిలినదంతా దానధర్మాలు చేసేటోడు.
ఊరికొచ్చిన సాధువులను, పేదలను ప్రతిరోజూ తన చిన్న పాడుబడిన ఇంటికి అన్నానికి పిలుచుకోనొచ్చేటోడు. పంచభక్షపరమాన్నాలు పెట్టకపోయినా పప్పుచారులతో కడుపు నిండా ప్రేమతో పెట్టి అందరినీ ఆనందపరిచేటోడు.
రైతు భార్య గూడా చానా మంచిది. ఏ మాత్రం విసుక్కోకుండా సంబరంగా అందరికీ సేవ చేసేది. వాళ్ళ భక్తి చూసి ఆ పరమశివుడు పరవశించిపోయి ఒకసారి వాళ్ళు గుడికి వచ్చినప్పుడు అడక్కుండానే ప్రత్యక్షమయినాడు.
"మీ భక్తి, పేదల పట్ల ప్రేమ మూమూలువి కావు. మీలాంటోళ్ళు వుండడం వల్లనే లోకంలో ఇంకా ధర్మం ఒక్క కాలి మీదన్నా నిలబడతా వుంది. అందుకే మీకు మూడు టెంకాయలు ఇస్తా వున్నా... అవి మామూలు అట్లాంటిట్లాంటి అల్లాటప్పా టెంకాయలు కాదు. కోరుకున్న కోరికలు కండ్లు మూసి తెరిచేలోగా నెరవేర్చే మహిమగల టెంకాయలు. మీరు బాగా ఆలోచించుకోని ఏవైనా కోరుకోని టెంకాయ కొట్టండి. మీ కోరిక రెప్పపాటులో నెరవేరుతుంది. ఇట్లాగే హాయిగా పదిమందికి సేవ చేస్తా, ధర్మాన్ని కాపాడతా, కలకాలం చిలకా గోరింకల్లెక్క కిలకిలకిల నవ్వుకుంటా సంబరంగా బతకండి" అంటా దీవించినాడు.
శివుడు వెళ్ళిపోయినాక వాళ్ళు ఇంటికి వచ్చి తలస్నానం చేసి, భక్తితో దేవున్ని పూజించి, "సామీ.... ఎంత ధనమొచ్చినా పేదల మీద ప్రేమగానీ, నీ మీద భక్తిగానీ చీమంత గూడా తగ్గకుండా, పొగరు తలకెక్కకుండా చూడు సామీ" అంటా ఒక టెంకాయ కొట్టినారు.
"సామీ... నిరంతరం దానధర్మాలు చేస్తా భక్తులను, పేదలను ఆదుకోవడం కోసం ఈ జన్మకు తరగనంత సంపద ఇవ్వు సామీ" అంటా రెండవ టెంకాయ కొట్టినారు.
"సామీ... నీ భక్తులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ చిన్న పాడుబన్న ఇండ్లు సరిపోవడం లేదు. కాబట్టి నిరంతరం వందలమందికి అన్నదానం చేసేలా ఒక మంచి ఇండ్లు ఇవ్వు సామీ" అంటా మూడవదాన్ని పగలగొట్టినారు.
శివుడు వరమిచ్చినట్లే ఆ మరుక్షణమే వాళ్ళకు పెద్ద ఇల్లు, కావలసినంత సంపద సమకూరినాయి.
ఆ ఇంటి పక్కనే ఒక పెద్ద మేడ వుంది. వాళ్ళకు పదితరాలు పని చేయకుండా కిందామీదా పడి దున్నపోతుల్లా తిని తిరిగినా తరగనంత సంపదుంది. కానీ... అంత డబ్బున్నా వాళ్ళకు డబ్బు మీద ఆశ చావలేదు. యాడ పైసా దొరుకుతుందన్నా అందరికన్నా ముందే గద్దల్లా వాలిపోతారు. పక్కనోడు సంబరంగా వుంటే కుళ్ళుకోని చస్తారు.
వాళ్ళు రాత్రికి రాత్రి తమ పక్కనే వున్న పాడుబన్న ఇల్లు కళ్ళు తిరిగేలా పెద్దమేడగా మారిపోయేసరికి కండ్లల్లో నిప్పులు పోసుకున్నారు. ఎట్లాగైనా సరే ఆ రహస్యమేదో కనుక్కోవాలని పొద్దున్నే పళ్ళుగూడా తోముకోకుండా పాచినోటితోనే పరుగుపరుగున వాళ్ళింటికి చేరుకున్నారు. రైతు వాళ్ళకు అడిగిన వెంటనే ఏ మాత్రం దాచుకోకుండా అంతా పూసగుచ్చినట్టు వివరించినాడు.
ఆరోజు నుంచీ ఆ ధనవంతులు గూడా దేవునికి దొంగమొక్కులు మొక్కుతా, పూజలు చేస్తా, పేదవాళ్ళకి అన్నం పెట్టసాగినారు.
అట్లా కొంతకాలం గడిచినాక వాళ్ళు గూడా గుడికి పోయి “సామీ! మేం గూడా పదిమందికి సాయం చేస్తా, నిన్నే కొలుస్తా వున్నాం గదా... మాకు కూడా మా పక్కింటి రైతుకు ఇచ్చినట్లే కోరికలు తీర్చే టెంకాయలు ఇవ్వు సామీ" అంటా మొక్కుకున్నారు.
శివుడు అదంతా చూసి చిరునవ్వు నవ్వుకుంటా వాళ్ళ ముందు ప్రత్యక్షమయి మూడు టెంకాయలు ఇచ్చినాడు. వాళ్ళు వాటిని తీసుకోని ఎవరికీ తెలీకుండా పరుగుపరుగున ఇంటికి చేరుకున్నారు.
చేరుకున్నాక ఇద్దరూ ఏమి వరం కోరుకావాల్నా అని ఆలోచించసాగినారు. ఆమె చెప్పేది వానికి నచ్చదు. వాడు చెప్పేది ఆమెకి నచ్చదు.
చివరికి ఆమె "ఇప్పటికే మనకు సంపదలు లెక్కలేనంత వున్నాయి. కాబట్టి మళ్ళా మనకు సంపదలు కోరుకునే బదులు మా అమ్మావాళ్ళకు ఇవ్వమని కోరదామా' అనడిగింది.
ఆ మాటలకు ధనవంతుడు "ఏమీ లేకున్నా మీ పుట్టింటోళ్ళు అయినదానికి కానిదానికి పూరికే ఎగిరెగిరి పడతా వుంటారు. దానికి తోడు సంపదలు గూడా వచ్చినాయనుకో నన్ను అసలు లెక్క గూడా పెట్టరు" అన్నాడు.
ఆ మాటలకు ఆమెకు కోపం ముంచుకొచ్చింది. “ఏం... ఏం తక్కువ చేసినారని ఎప్పుడూ మా అమ్మానాన్నల్ని మాటిమాటికీ ఎత్తిపొడుస్తా ఉంటావు. లచ్చలకు లచ్చలు పెండ్లప్పుడు కట్నం కింద గుంజినావు. పెండ్లయినాక చెరువు కింద పదెకరాలూ నొక్కేసినావు. ఏం ఇంక సాలవా... ఐనా నీలాంటోళ్ళకి ఎన్ని మర్యాదలు చేసినా చేయలేదనే నోళ్ళు నొక్కుకుంటా వుంటారు" అంది మెటికలు విరుస్తా.
"అబ్బో.... భలే చేసినారులే మర్యాదలు... బోడి మర్యాదలు" అన్నాడు మొగుడు ఎకసెక్కంగా.
“అవ్... మావి బోడి మర్యాదలయితే.... మీవి బొచ్చు మర్యాదలు" అంది ఆమె మరింత కోపంతో చిందులు తొక్కుతా.
ఆ మాటలకు అతను మరింతగా రెచ్చిపోతా "మాది బొచ్చులో మరియాదంటావా... ఎంత ధైర్యమే నీకు. మీది బొచ్చు మర్యాద... మీ అమ్మది బొచ్చు మర్యాద... మీ నాన్నది బొచ్చు మర్యాద... అసలు మీ వంశం వంశానిదే బొచ్చు మర్యాద" అన్నాడు కప్పెగిరి పోయేటట్లు అరుస్తా.
ఆమె కోపంగా “అట్లాగా... అయితే... ఆ బొచ్చే వస్తాదిపో మనకు” అంటూ చేతిలోని టెంకాయ విసిరికొట్టింది. అంతే.... అది సక్కగా పోయి గోడకి తగిలి టప్పుమని రెండు ముక్కలైంది.
దాన్ని పగలగొట్టేముందు ఏం కోరుకుంటే అది జరుగుతుంది గదా... దాంతో మరుక్షణంలో ఇద్దరికీ ఒంటి మీద కొంచం గూడా స్థలం మిగలకుండా ఎలుగుబంట్లలెక్క నల్లగా బొచ్చు వచ్చేసింది. దాంతో ఇద్దరూ ఒకరిని చూసి మరొకరు అదిరిపడినారు.
"అరెరే... అనవసరంగా గొడవ పడి కోరుకోగూడనిది కోరుకున్నామే... ఈ మొహాలతో వీధుల్లోకి పోతే జనాలు కిందామీదా పడి నవ్వుతారు" అని బాధపడి “సామీ మా ఒంటి మీదున్న బొచ్చంతా పోవాలి" అనుకుంటా రెండో టెంకాయ కొట్టినారు.
అంతే.... ఇద్దరికీ కొత్తగా వచ్చిన బొచ్చేగాక వున్న బొచ్చు కూడా పోయి తళతళలాడే గుండ్లతో, పేడిమూతితో మిగిలినారు. అది చూసి "అరెరే... ఇదేంది ఇట్లా అయింది" అనుకుంటా "సామీ... మొదట మాకు బొచ్చు ఎట్లుండెనో అట్లాగే మళ్ళా రావాలి" అనుకుంటా మూడో టెంకాయ కొట్టినారు. అంతే... తిరిగి ఇద్దరికీ ఎప్పట్లాగే తల మీద జుట్టంతా వచ్చేసింది. అది చూసి పరమశివుడు పడీపడీ నవ్వుకున్నాడు.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి