రాఘవపురంలో రామయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు తనకు తండ్రి నుండి సంక్రమించిన కిరాణా కొట్టును ఎంతో నిజాయితీతో నడుపుతూ మంచి వ్యాపారిగా ఆ ఊళ్ళో పేరు గాంచాడు. ఒక రోజు ఒక సాధువు ఆ ఊరికి వచ్చి రామాలయంలో బస చేసాడు. రోజంతాతన అనుష్టానం చేసుకుంటూ సాయంత్రాలు ప్రజలతో ఆధ్యాత్మిక గోష్టి చేస్తుండేవాడు. ప్రజలు ఆ సాదువు చెప్పే మంచి విషయాలు వినడమే కాకుండా తమకు వచ్చిన సందేశాలను తీర్చుకుంటుండేవారు. .
ఒకనాటి ఆధ్యాత్మిక గోష్టిలో ఆ సాధువు పాప పుణ్యాలు, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించాడు. మనం పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చెస్తే నరకానికి పోతామని, రెండిటినీ అనుభవించాల్సింది మనమేనని, ఈ లోకానికి ఒంటరిగా వచ్చిన మనం ఒంటరిగానే తిరిగి పోవాలని , మనం చేసుకున్న కర్మలను మనమే అనుభవించాలని చెప్పాడు. ఆ ప్రసంగం అయ్యాక రామయ్య సాధువుకు పాదాభివందనం చేసి నే ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసి వుంటాను. వీటికి ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగాడు. అందుకు ఆ సాధువు చిత్తశుద్ధితో, భగవంతుని ప్రార్ధించడం, పుణ్య కర్మలను ఆచరిస్తే చేసిన పాపాలు కొంచమైనా పోతాయని పరిష్కారం సూచించాడు..
ఆ మాటలు రామయ్యపై బాగా పని చేసాయి. నరకలోకానికి భయపడి ఎలాగైనా తన పాపాలు తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నాడు .మర్నాడు నుండి తెల్లవారు జామునే నిద్ర లేవడం, స్నానం చేసి సద్గ్రంధ పఠనం, దేవాలయ దర్శనం, దేవుడికి పూజ, పునస్కారాలు చేయడం ప్రారంభించాడు. అతనిలో వచ్చిన ఈ మంచి మార్పుకు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే రోజు రోజుకూ రామయ్య సాధన తీవ్రతరం చేసాడు. మూడు గంటలకే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, చన్నీళ్ళ స్నానం చేయడం, వారానికి నాలుగు రోజులు కటిక ఉపవాసం, మిగితా రోజులలో రెండు , మూడు ముద్దలు మాత్రమే తినడం చేయసాగాడు. ఈ కఠిన సాధన వలన అతడి ఆరోగ్యం త్వరలోనే క్షీణించిపోయి తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. మంచంపై వున్నా కూడా రామయ్య ఉపవాసాలు మానలేదు. అంతటితో అతడి ఆరోగ్యం మరింత దిగజారసాగింది. కొడుకులకు సరైన నైపుణ్యం , బాధ్యత అలవడని కారణంగా వ్యాపారం అటకెక్కింది.
పరిస్థితి గమనించిన రామయ్య కుటుంబ సభ్యులు లబో దిబో మంటూ పక్క ఊరిలో వున్న ఆ సాధువు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి రామయ్య చేసిన నిర్వాకం చెప్పారు. ఆ మర్నాడే ఆ సాధువు రామయ్య ఇంటికి వచ్చి అతడి పరిస్థితి చూసి జాలిపడ్డాడు. ఆయనను చూడగానే రామయ్య కళ్ళ నుండి కన్నీరు ఉబికింది.
" స్వామీ, మీరు చెప్పినట్లుగానే నేను నా పాపాలు పోగొట్టుకునేందుకు కఠిన సాధన చేసాను. పాపం పోయి పుణ్యం వచ్చిందీ లేదో తెలియదు గాని, నా ఆరోగ్యం దిగజారి మంచాన పడ్డాను" అని ఏడుస్తూ సాధువుతో తన గోడును వెళ్ళబోసుకున్నాడు.
అందుకు ఆ సాధువు ప్రశాంత వదనంతో రామయ్యతో" నాయనా , నేను చెప్పిన విషయాలను తప్పుగా అర్ధం చేసుకొని, శారీరక ధర్మాలకు, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వలనే నీకీ దుస్థితి దాపురించింది. వేదం విధించిన ఆశ్రమాలలో నువ్వు గృహస్థాశ్రమంలో వున్నావు. ఈ ఆస్రమం ఎంతో పవిత్రమైనది మరియు ప్రభావితమైంద్ది. శాస్త్రాలు మనకు విధించిన ధర్మాలను, సత్కర్మలను చిత్తశుద్ధితో ఆచరిస్తే ఇహంలోనే కాక పరంలో కూడా మనకు మంచి జరిగి భగవంతుని కృప లభిస్తుంది. ఈ మనుష్య శరీరంలో కూడా గృహస్థాశ్రమాన్ని ఉద్ధరించే పాఠశాల ఉంది. భోగాలను అనుభవించ టానికీ, విశ్రాంతి పొందటానికీ మాత్రమే కాదు మనుష్య శరీరం. శాస్త్ర విహితమైన యజ్ఞాది కర్మలు చేసి బ్రహ్మ లోకాదులను పొందుటయే ముఖ్యమైన విషయం కాదు. అక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావలసి వస్తుంది. కాబట్టి ప్రాణిమాత్రహిత చింతనతో గృహస్తాశ్రమంలో ఉండాలి. తన శక్తికి తగినట్టు తనువూ, మనస్సు, బుద్ధి, యోగ్యతా, అధికారము మొదలైన వాటి ద్వారా ఇతరులకు సౌఖ్యమును కలిగించాలి. ఇతరుల సుఖ సౌకర్యాల కోసం తన సుఖ, విశ్రాంతుల్ని త్యజించుటయే మనుష్యుని మనుష్యత్వం. అయితే వీటన్నిటినీ కూడా మన శారీరక ధర్మం, స్వధర్మం అనుసారం చేయాలి. స్వధర్మాచరణలో మితం, అపరిమితం రెండూ పనికిరావు. మధ్యస్థంగా వుండాలి,. శరీరాన్ని అతిగా కష్టపెట్టడం కూడా మంచిది కాదు, అలాగే లోలత్వంతో దానిని పోషించనూకూడదు. నువ్వు పాప భయంతో అపరిమిత సాధన చేయడం వలన నీ శరీరం దానినుఇ తట్టుకోలేక చతికిలపడింది. ఇకనైనా మితంగా కాని చిత్తశుద్ధితో, కల్మష రహిత హృదయంతో సాధన చెయ్యి. అప్పుడు నువ్వు తప్పక పాపరహితుడవై భగవంతుని అనుగ్రహం పొందుతావు" అని ఎంతో ప్రేమగా అర్థమయ్యేటట్లు బోధించారు.
ఆ మాటలకు రామయ్యకు జ్ఞానోదయం అయ్యింది. తాను చెసిన తప్పు తెలిసి వచ్చింది. గ్ర్హస్తు ధర్మాలను, కర్తవ్యాలను పాటిస్తునే సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు.
సి హెచ్ ప్రతాప్
గృహస్తు ధర్మం;--:సి.హెచ్.ప్రతాప్;- 95508 51075
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి