కష్టార్జితం ; - సి.హెచ్.ప్రతాప్; సెల్; 95508 51075
 రాఘవపురంలో విజయుడు అనే వస్త్రాల వ్యాపారి వుండేవాడు. అతడు దూర దేశాలనుండి  వస్త్రాలను కొని వాటిపై ఎక్కువ లాభాలు వేసుకొని అమ్ముతుండేవాడు. నాణ్యత ఎక్కువ, ధరలు తక్కువగా ఉండడంతో ఆతని వస్త్రాలకు భలే గిరాకీ వుండేది. వ్యాపారం ఎంతగా వర్ధిల్లుతున్నా , అధిక లాభాలకు ఆశపడకుండా, వ్యాపారంలో మోసాలకు పాల్పడకుండా ఉండటం వలన అతనికి నిజాయితీ గల వ్యాపారి అన్న మంచి పేరు వచ్చింది. ఒకనాడు విజయుడు తన వాహనంపై దూరదేశం బయలుదేరాడు. అక్కడ బట్టలను ఖరీదు చేసేందుకు తన వద్ద వెయ్యి వరహాలు వున్నాయి. మార్గం మధ్యలో ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో విశ్రాంతి కోసం వాహనం ఆపి, తాను దిగి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఇంతలో ముగ్గురు దొంగలు విజయుడు మీద పడి అతనిని బాగాకొట్టి అతని వద్ద ఉన్న వరహాలు  దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు విజయుడు సృహ తప్పి పడిపోయాడు.  అతడిని అక్కడే వుంచితే రాజభటులు ఎవరైనా చూస్తారన్న భయంతో వారు విజయుడిని అక్కడ కొంత దూరంలో వున్న తమ నివాసానికి తీసుకుపోయి నోరు కట్టేసి పడేసారు. అక్కడికి వచ్చి చాలా కాలం అయినందున ఇక ఆ డబ్బుతోఅక్కడి నుండి మకాం మార్చేయాలని నిర్ణయించుకున్నారు. దొంగిలించిన సొమ్మును ముగ్గురు సమానంగా పంచుకుందాం అనుకొన్నారు. భోజనం చేసి పంచుకొందాం అనుకొని మూడోవాడు ఊర్లోకి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు.ఇద్దరు దొంగలు మూడో వాడుంటే మనకు వాటా తగ్గుతుంది. వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది, అని అతనిని చంపడానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళినవాడు ఇద్దర్నీ చంపితే మొత్తం నాకే కదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కుని మూడోవాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది విజయుడు మాత్రమే. మెలకువ వచ్చాక అక్కడ పడి వున్న ముగ్గురు దొంగలు చూస్తే విజయుడికి అసలు సంగతి అర్ధమయ్యింది. కట్లు ఎలాగోలాగ విడిపించుకొని తన డబ్బు సంచీ తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి అక్కడ న్యాయాధికారికి జరిగిన సంగతి చెప్పాడు విజయుడు. తర్వాత తన ప్రయాణం యధావిధిగా కొనసాగించాడు. ఏమైతేనేం అతనికి తన కష్టార్జితము దక్కింది. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికీ పోదని అతనికిఅర్ధమయ్యింది.




కామెంట్‌లు