జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ;--- డాక్టర్ బెజ్జంకి . జగన్నాథాచార్యులు.మాచర్ల పల్నాడు జిల్లా 9848562726

 ( రావూరి భరద్వాజ   9వ వర్థంతి సందర్భంగా)
            అత్యున్నత “జ్ఞానపీఠ్ పురస్కారము అందుకున్న సాహితీ కృషీవలుడు సమాజ దార్శనికుడు సాహితీ ధృవతార “రావూరి భరద్వాజ” రెండు తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ సాహితీ ప్రియులను విషాదములో ముంచి
18-10-2013 లో  దివినున్న తన ప్రియసతి కాంతమ్మ ఒడిని సేదతీరుటకు ఏగినారు నేటికి తొమ్మిదేళ్ల క్రితం..వారి గురించి తెలుసుకుందాం
         రెండు తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ అని ఎందుకు అన్నానంటే శ్రీ రావూరి వారు పుట్టింది కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపములోని మోగులూరు ఈ గ్రామం నాడు హైదరాబాద్ సంస్ధానములో ఉంది. పెరిగింది చదివింది గుంటూరు జిల్లా “తాడికొండ”గ్రామంలో. జీవనసమరంలో  ఆటుపోట్లు ఎదుర్కొంటూఉన్నత శిఖరాలను అధిరోహించిన ఘనుడు డాక్టర్ రావూరిభరద్వాజ.అనుట అక్షరసత్యం.ఉద్యోగ జీవితంలో ప్రవేశించి,ఉద్యోగ విరమణ చేసింది స్ధిరనివాసం ఏర్పరచుకున్నది హైదరాబాద్ గడ్డ పైననే కనునే రెండు రాష్ట్రాల ముద్దుబిడ్డ అన్నాను.వారి జీవన రేఖలు పరిశీలిద్దాం.
             హైదరాబాద్ సంస్ధానములో ని మోగులూరు గ్రామములో రావూరి కోటయ్య మల్లికాంబ పుణ్య దంపతులకు 25-07-1927 న జన్మించారు.విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులస్తులు కావటం వలన జీవనోపాది కొరకు
గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం వలసవచ్చారు.భరద్వాజ గారి బాల్యము విద్యాభ్యాసం తాడికొండ లోనే 
సాగింది.విశ్వబ్రాహ్మణులు నిత్తజీవితంలో ప్రజోపయోగ  పనిముట్లు వస్తుసామగ్రి తయారు చేసి అందించటం  వీరి
జీవనోపాది కావటం వలన ప్రజలతో మమేకమై సోదరభావంతో సమసమాజ భావజాలాన్ని కలిగి ఉంటారు.
తమ మేధాశక్తి శారీరక శ్రమ శక్తిని వినియోగించి కొత్తకొత్త పనిముట్లు పరికరాలు తయారు చేయటానికే ప్రముఖ 
ప్రాధాన్యత ఇస్తూవుంటారు.చదువు సంధ్యల పట్ల శ్రద్ధ చూపరు.డబ్బుకు కటకటలాడే పరిస్థితి. కనుక చదువు సామాన్యులకు అందుబాటులో ఉండేదికాదు.
         ఈ నేపథ్యంలో రావూరిభరద్వాజ  ప్రాధమికోన్నత విద్య వరకే చదువుకో గలిగినారు ఉన్నత విద్య  చదువు కో లేక పోయినారు.జీవన పోరాటం లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ప్రతి పోరాటం లో జీవిత సత్యాలను నేర్చుకున్నారు.”మట్టి పొరల్లో అణగిణ మర్రి విత్తనం వాన చినుకు తగలగానే భూమి పొరలను చీల్చుకుంటూ మొలకెత్తి వటవృక్షమై నిలిచినట్లు”భరద్వాజ తనదైన గమనంలో సాహిత్య జగత్తులో వటవృక్షమె ఎదిగినారు.
           పాఠశాల విద్య సాగకపోయినా సమాజాన్ని చదివిన భావుకుడు భరద్వాజ.జీవన పోరాటంలో ఎదురయ్యే సమస్యలను ,మానవ భావోద్వేగాలను కధాంశాలుగా తీసుకొని రచనలు చేశారు.మధ్యతరగతి పేద ప్రజల భాషపై
గట్టి పట్టు గల భరద్వాజ నిజమైన పల్లె వాతావరణం తన రచనలలో ప్రతిబింబించ జేశారు.అటు సామాజిక అంశాలనే కాకుండా చిన్నారి బాలల మనో వికాసానికి దోహదపడే కధులు ,విజ్ఞాన విషయాలు అలతి అలతి పదాలతో చిరుహృదయాలలో చెరగని ముద్ర వేసేలా రచనలు చేశారు. సైన్సుకు సంబంధించిన అంశాలలను కధలలో చెప్పారు. 
          ఈ రచనా వ్యాసంగం ఎలా దినదినాభివృద్ధి చెందినదో చూద్దాం.
1944లో రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. ఆ రచనలను తొలుత తన బాల్య మిత్రుడు కొల్లూరి వేంకటేశ్వర్లు
గారు.వారు విని అందులోని తప్పులు చూపించేవారు.అలా తనతప్పులను సవరించుకుంటూ తనదైన శైలిని చాటుకుంటూ ముందుకు సాగినారు.
               1946 లో పత్రికా రంగంలో ప్రవేశించారు.ఆరోజుల్లో వెలువడే “జమీన్ “అనే రైతు వార పత్రికలో ను,తర్వాత 1948 లో “దీనబంధు”వారపత్రిక సంపాదకునిగా నిలదొక్కుకుంటు సాహిత్య జగత్తులో తన ఉన్నతిని
పెంపొందించుకుంటూ ఎన్నో ఎనెన్నో రచనలు చేశారు  నవలలు ,కధానికలు, కధాసంకలనాలు ప్రచురించారు.పిల్లల కధలు,విజ్ఞాన సాహిత్యం మొదలైన వైవిధ్య భరితమైన రచనలు చేశారు. సాహిత్యరంగంలో  తన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ పాఠకుల మన్ననలు పొందుతూ  ప్రగతి పధంలో పయనించారు.
1959 లో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో ఫ్రూఫ్ రీడర్ కళాకారుడిగా ఉద్యోగంలో ప్రవేశించారు .తన చాకచక్యంగా తన మేధస్సుకు పదును పెట్టుకుంటూ ఎదిగి ప్రసంగ ప్రయోక్తగా 1987 లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలో స్ధిరపడ్డారు.
   వీరిరచనలు మచ్చుకు కొన్ని చెప్పుకుందాం.
1పాకుడు రాళ్ళు. 2,కాదంబరి, 3 నాకు దేవుని చూడాలని వుంది,4 జీవన సమరం ,5 ఏది నాది కాదు.6 అంతరంగిణి 7,ఒకింత వేకువ కోసం 8,పాడ్యమి 9 ఐతరేయం 10 ధన్యవాదాలు 11,శ్రీరస్తు 12, సౌందరనందనం.13
నాలోని నీవు  ఇలా మరెన్నో రచనలు 
అపరాధ పరిశోధనలు:- 1విషనాగు .2,దుష్ట చతుష్టయం.3సత్యాన్ని దాచటం సాధ్యం కాదు 4 ఎత్తు  మొదలైనవి
సాహిత్య వ్యాసాలు:-1,ఇనుప తెర వెనుక.2,కంచికి వెళ్ళిన కధ.3,నేనెందుకు రాస్తున్నాను.4,శూన్యం నుండి సృష్టి.5,మొగ్గతొడిగిన ఎర్ర గులాబీ.6,మహతి మొదలైనవి.
విజ్ఞాన సాహిత్యం:-1,అచ్చు ముచ్చట్లు.2,అద్దం కధ.3 అవని అవకాశం.4,గడియారం.5,గ్రహాలు.6,చెత్త నుండి విత్తం.7 నిప్పు కధ.8,నీరు.9,బొగ్గు కధ.10,మనిషి.11 వ్యర్ధంనుండి అర్ధం 12స్టాంపులు..మొదలైనవి.
స్మృతి సాహిత్యం:-1,అంతరంగిణి.2,అయినా ఒక ఏకాంతం.3,ఐతరేయం.4,ఒకింత ఏకాంతం 5,నాలోని నీవు.
         “అవసరం అవకాశాన్ని వెతుకుతుంది,అవకాశం దొరికితే తనలో నిబిడీకృతమైన శక్తి అగ్ని శిఖలై ఆకాశంలోకి 
ఎగబాకుతుంది”అనుట అక్షర సత్యం చేసుకున్న వారు భరద్వాజ గారు అనుట నగ్న సత్యం అతిశయోక్తి ఇసుమంతయూ లేదు.
        అందుకు నిదర్శనం ఆయన లోని ప్రతిభ ను వెతుక్కుంటూ  ఆయనను వరించిన అవార్డులు పురస్కారాలే 
నిదర్శనం.ఆయనలోని భావుకత, సామాజిక స్పృహ,రచనలలోని వైవిధ్యం,పాఠకులను చదివింప జెసే రచనా నైపుణ్యం,రచనలలోని వస్తు వైవిధ్యం, గురుతర ఖ్తాతిని తెచ్చి పెట్టినవి. పాఠశాల విద్య,కళాశాల విద్యలు చదవక పోయినా  ఆయనకు డాక్టరేట్ పట్టాలు వచ్చి ఆయన ఉన్నతిని చాటినాయి. ఆయన సమాజాన్ని చదివారు.అదిచాలు పేరుగాంచటానికి.
అవార్డులు పురస్కారాలు:-
1.1968 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి గోపచంద్ అవార్డు2.ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అవార్డు
3.కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం4.సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం5.,రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు
6.తెలుగు కళాసమితి కే.వి రావు,జ్యోతిరావు అవార్డు 7.తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం.8 లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు.9.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కళారత్న అవార్డు 10. కేంద్ర సాహిత్య అకాడమీ వంగూరి ఫౌండేషన్  గోపీచంద్ సాహిత్య పురస్కారం. మొదలైనవే కాక అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ పురసకారం వరించింది. ఇంకనూ మరెన్నో వెతుక్కుంటూ ఆయనను వరించాయి.
         గౌరవ డాక్టరేట్ లు:-  1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం,1987 లో జవహర్ లాల్ నెహ్రూ సాంస్కృతిక విశ్వవిద్యాలయం,1991లో నాగార్జున విశ్వవిద్యాలయం వారి ప్రతిభకు పట్టంగట్టి డాక్టరేట్ లు ప్రధానం చేశారు.
     చివరిగా  రావూరి 1944 లో తొలిసారి రాసిన రచనలు శ్రద్ధగావిని ప్రోత్సహించిన మిత్రుని మరువకుండా 1965 లో రాసిన “పాకుడు రాళ్ళు “నవలను కొల్లూరి  వేంకటేశ్వర్లుకు అంకితమివ్వటం అయనలోని మానవీయ కోణమును చూపుచున్నది.
         ఇంతటి మహనీయుడు నిండైన పొడవాటి గడ్డంతో తెల్లని లాల్చీ ధరించి తెల్లని పంపకట్టుతో మెరిసిపోతూ ఉంటారు నిరాడంబరులు, నిగర్వి  సాధుపుంగవులుగా  సామాన్య జీవితం గడుపుతూ ఉంటారు.అందరితో కలగలుపుగా మాట్లాడుతూవుంటారు.వారిలో అన్నీ ఉదాత్త భఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే లక్షణం గలవారు.
             15వ యేటనే రచనా వ్యాసంగం మొదలుపెట్టిన  భరద్వాజ 1948మే నెల 28 వ తేదీన “కాంతమ్మ”ను వివాహమాడి సంసారజీవితమును “మూడుపువ్వులు ఆరు కాయలుగా”అన్యోన్యంగా కొనసాగించారు. వీరి 
కి నలుగురు కుమారులు ఒక కుమార్తె తో జీవనయానం సాగుతున్న తరుణంలో  1986 ఆగస్టు 1వ తేదీన  కాంతమ్మ గారు కన్ను మూశారు. ఆమె వియోగ బాధ స్మృతి సాహిత్యం లో ప్రతిబింబించింది.  “వాక్యం రసాత్మకం
కావ్యం”అన్న అలంకారికుల వాక్యాను సారం స్మృతి రచనను స్మృతి కావాలని పేరుగాంచనవి.
      లబద్ధ ప్రతిష్టులైన రావూరి భరద్వాజ రచనలు కన్నడం, మళయాళం, ఇంగ్లీష్, హిందీ తమిళ సాహిత్యాలలోకి అనువదింపబడినవి.  ఎందరో విద్యార్ధులు పరిశోధనలు చేసి పిహెచ్. డి పట్టాలు పొందారు.
వారి సువర్ణ హస్తాలతో నేను రాసిన “తెలుగు ధీర “నీతి శతకం ఆవిష్కరించుకునే భాగ్యం దక్కింది. వారు 12013 లో వారి ఇంటికి వెళ్ళి సరసన కూర్చుండి ఛాయాచిత్రం తీయించుకున్నాను. జీవితంలో మరువలేని తీపిగుర్తులు 
మిగిల్చుకున్నాను.
            తెలుగు రచనా ప్రక్రియలలో రచనలు చేయుచూ నిండూ నూరేళ్ళ సంపూర్ణ జీవితమును పూర్తిచేసి  జీవిత చరమ దశలో అత్యున్నత “జ్ఞానపీఠ”పూరస్కారం అందుకొని ఆ ఆనందాన్ని చవిచూసి ఆ ఆనందాను భూతులు జీవిత భాగస్వామి కాంతమ్మకు చెప్పుకొని మురియటానికా అన్నట్లుగా 18-10.2013 తేదీన దివికేగినారు. 
        తెలుగు సాహిత్య చరిత్రలో జ్ఞానపీఠ పురస్కారము వరించిన మూడవ వ్యక్తి కావటం విశేషం. వారి రచనలలోని  విశేషాలు వారి కా అత్యున్నత పురస్కారం దక్కటాని కారణాలు తెలుసుకోవాలంటే వారి రచనలు చదవాల్సిందే. ఇట విస్తరణభీతిచే వివరింప లేకుంటిమి.
          ఉభయ తెలుగు రాష్ట్ర సాహితీ ప్రియులకు వారు లేని లోటు కానవస్తూనేవుంటుంది. వారి ఆత్మశాంతికి నా అక్షరాంజలులు అర్పిస్తున్నాను.జోహార్ రావూరిభరద్వాజ జోహార్  జోహార్.
కామెంట్‌లు