అనుమానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అనుమానం పెనుభూతం అని ఓసామెత! శివ తెల్లగా తెల్లారి 8గంటలు దాటినా నిద్రలేవలేదు.పనిహడావిడిలో తల్లి కూడా పెద్దగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్ళి "చిన్నా!లే నాయనా!బడిటైం అవుతోంది "అని అమ్మ వాడి నుదుటిపై  చెయ్యి వేసింది.వేడికి చురుక్కుమంది.పాలిపోయి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి."జ్వరం వచ్చింది!10గంటలకి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను.ఎలాగో నోరు శుభ్రంచేసికో!పాలు తాగుదువుగానీ" "ఉహు!నాకేమీ తాగాలని లేదు"అంటున్నా కొడుకు మొహం కడిగించి పాలు తాగించింది."అమ్మా!నాన్న రాలేదా?" రాత్రి నాన్న ఇంట్లో లేడన్న విషయం వాడికి గుర్తు కొచ్చింది. "నాన్న పోలీస్ అని తెలుసు. అందుకే  నాకు  భయంగా ఉంది అమ్మా!రాత్రి  టి.వి.లో చూశాను "అక్కడ ఎక్కడో టెర్రరిస్టుముఠా ఉందిట! రోడ్ యాక్సిడెంట్స్!ఇలా రకరకాల వార్తలు! నాన్న అక్కడ చిక్కుకుపోతే?పండగ రేపే కదా? నాన్న లేకుంటే నాకు అస్సలు బాగుండదు"."నాయనా!మనిషి  అన్నాక తిప్పలు తప్పవు. ప్రధాన మంత్రికి  ఇంకెంత టెన్షన్ ఉంటుందో తెలుసా?పద పద డాక్టర్ దగ్గరకు వెళ్దాం" అని మాటమార్చింది.
"సీజన్ మారింది కదమ్మా! పగలంతా ఎండ సాయం త్రం వర్షం! దోమ లు! ఈటాబ్లెట్ రెండు పూటలా ఆహారం తిన్నాక వేయండి " అని డాక్టర్ చెప్పటంతో తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది.కానీ శివా గుండె లో రాయి పడింది. "అమ్మా!కోవిడ్ వచ్చిందా? కొంచెం ముక్కుకూడా కారుతోంది. నాదగ్గరకు రాకు అమ్మా!" వాడి గొంతులో భయం నీరసం!"పిచ్చి తండ్రీ! పరీక్షలు అని  తెగ చదివావు.టి.వి.చూస్తూ పడుకున్నావు.మనసులోని భయం మనల్ని  ఇంకా భయపెడ్తుంది.దైవం మీద భారం వేయాలి. పనిలేని బుర్ర దెయ్యాల కొంప!మంచి ఆలోచనలు రావాలంటే మంచి పుస్తకం చదవాలి. ధ్రువుడు కేవలం  ఐదేళ్ళ పసివాడు.తండ్రి ఒడిలో కూచోబోతున్న వాడిని సవతితల్లి వాదిస్తుంది. పాపం!ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్తే" నాయనా! ఆశ్రీహరి పాదాలనాశ్రయించు"అంటే అడవిలో తపస్సు చేశాడు. అందుకే  ధ్రువ నక్షత్రం గా నేటికీ మనకు దారిచూపుతున్నాడు.ధైర్యం గా ఉండాలి. డ్రాయింగ్ వేసుకో!బొమ్మలు బాగా గీస్తావుకదా?"అని తల్లి వాడికి నచ్చజెప్పి తనుకూడా  పనిని పక్కకు నెట్టి వచ్చి కూచుంది.ఓగంట గడిచేప్పటికి శివ మొహం తేటగా కనిపించింది. భయం ఆందోళన తగ్గటంకోసమే మన పెద్దలు గుడి పూజ భజనలు మొదలైనవి పెట్టారు. ఇప్పుడు కేవలం ఇంటికే పరిమితం కావటంతో అశాంతి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి పిల్లలకి.ఆసాయంత్రం అమ్మ తో గుడిదగ్గర బతుకమ్మ ఆటచూస్తూ "అబ్బ!మాఅమ్మ కూడా  ఎంత బాగా పాడి ఆడుతోందో!" అని సంబరపడ్డాడు శివ. వాడి మనసు దూదిపింజలా ఉంది. నాన్న దేవాలయం డ్యూటీ లో ఉన్నాడు అని  తెలుసుకుని  ఆనందంగా ప్రశాంతంగా  నిద్రలోకి ఒరిగాడు🌷
కామెంట్‌లు