పరస్పర నిందారోపణలు వీడాలి;-- యామిజాల జగదీశ్
 ఒకరి కోసం వదులుకోవడం, తప్పుకోవడం కొన్ని సందర్భాలలో మంచికే కావచ్చు. కొన్నిసార్లు సరికాకపోవచ్చు.
నిన్న నచ్చింది ఈరోజు నచ్చకపోవచ్చు.
ఇవాళ నచ్చనిది రేపు నచ్చొచ్చు. 
ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. 
నచ్చింది ఎందుకు నచ్చలేదో అనే విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే నిజం తెలిసొస్తుంది.
అనగనగా ఒక గూటిలో రెండు పక్షులు ఉండేవి. అవి రెండింటి మధ్య బంధం అన్నదమ్ములలాంటిది. 
అవి ఉంటున్న గూటిలో ఓరోజు అనుకోకుండా రంధ్రం ఏర్పడింది. అన్న పక్షి సరిచేస్తాడని తమ్ముడు, తమ్ముడు పక్షి సరి చేస్తాడని అన్న తమ తమ పనులలో ఉండిపోయారు. కానీ ఇద్దరూ పట్టించు కోకపోవడంతో చిన్న రంధ్రం కాస్తా పెద్దదయింది. 
"ఇప్పుడైనా అన్న సరి చేయకపోతాడా. ఇటువంటి రంధ్రమున్న గూటిలో ఎలా ఉంటాం అనుకుంది" తమ్ముడు పక్షి.
అన్నయ్య పక్షీ అలాగే అనుకుంది.
కానీ రెండూ పట్టించుకోకపోవడంతో ఆ రంధ్రం ఇంకా పెద్దదయిపోయింది.
చలికాలం వచ్చింది. 
హోరు గాలులు వీస్తున్నాయి. 
చలి ఎక్కువవడంతో ఆ రెండు పక్షులు గజగజా వణికాయి. ఒకదానినొకటి హత్తుకున్నాయి. "అయ్యో చలి" అంటూ బాధపడ్డాయి.
అప్పుడు అన్నయ్య పక్షి "తమ్ముడు ఈ చలిని తట్టుకోలేడు. ఈ గూటిని నేనే బాగు చేస్తాను" అనుకున్నాది.
అలాగే తమ్ముడు పక్షీ అనుకుంది. 
ఆ రెండూ అనుకున్నాయే తప్ప చేతల్లో చూపలేదు. దాంతో ఆ రంధ్రం ఎవరూ బాగు చేయలేని విధంగా తయారైంది. గాలి బలంగా వీసింది. మంచువర్షం. ఆ గూడుకాస్తా చెదరిపోయింది. రెండు పక్షులూ నేల మీద పడిపోయాయి. "నువ్వా నేనా" అనే వారి మనస్తత్వం వారికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
ఇది ఒక చైనా నీతి కథ. ఇలా నిర్లక్ష్య ధోరణిలో ఉండే అన్నదమ్ములను మనం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం.
జవాబులు తెలిసే కొన్ని సార్లు ప్రశ్నలు అడుగుతాం. దానికి కారణమేమిటి? 
నీకూ తెలుసు. నాకూ తెలుసు...పో ...అంటుంటాం. 
అణకువ, చురుకుదనం ఓ మనిషి పురోగతికి దోహదపడతాయి. అణకువతో మంచి ఫలితాన్ని సాధించవచ్చంటాడు తత్వవేత్త రూసో.
"ఎప్పుడూ దేవుడూ దేవుడూ అంటూ గుడి చుట్టూ తిరిగేవారికీ, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అనే వారికీ దేవుడి అనుగ్రహముంటుందా" అని మాష్టారు అడిగారు. 
"దేవుడు కరుణించడు" అని విద్యార్థి జవాబిచ్చాడు.
అటువంటప్పుడు దేవుడు ఎవరిని కరుణిస్తాడో విడమరిచి చెప్పమని అడిగారు మాష్టారు.
అప్పుడు ఆ విద్యార్థి "కృషితోనూ ప్రోత్సాహంతోనూ ఓ పనిని చేపట్టి కష్టించే వ్యక్తికి దేవుడు తప్పక కరుణ చూపుతాడు. సోమరిపోతుకి కష్టించడం అనేది అంతగా గిట్టదు. అందువల్ల అతనికి మర్యాదా లభించదు. అన్నమూ దొరకదు..." అని చెప్పాడు.
తన నుంచి ఏదో ఒకటి దోచుకుందని ఓ నక్క మీద ఫిర్యాదు చేసింది ఓ తోడేలు. కానీ ఆ ఆరోపణను నక్క తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి తీర్పు ఇవ్వవలసిన బాధ్యతను ఓ కోతికి అప్పగించాయి నక్కా, తోడేలూ.
రెండింటి మాటలనూ విన్న కోతి "మీ ఇద్దరి వాదనా పస లేనిది. నిజం లేనిది. ఒకరిమీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మీకలవాటే. ఈ దుర్గుణాన్ని మానుకుని సవ్యంగా హుందాగా ఉండండి" అని మందలించింది. 
ఈ విధంగా కొందరు ఎప్పుడూ ఎవరిమీదో ఒకరిమీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతారు. అటువంటివారిని సరిదిద్దడం అసాధ్యం. ఇతరులపై లేనిపోని ఆరోపణలు చేసేవారు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే అవతలి మనిషి ఇతనిపై ఆరోపణ చేయడం మొదలుపెడితే ఇద్దరికీ సంతోషమెక్కడ ఉంటుంది. ఇతరులపై లేనిపోని ఆరోపణలు చేయక తన పనిమీద దృష్టి పెట్టి అంకితభావంతో కృషి చేస్తే మానసిక ప్రశాం తతకూ లోటుండదు. శ్రమకు తగిన ఫలితంతో సంతోషంగానూ జీవించొచ్చు.
జీవితంలో మనల్ని ద్వేషించేందుకు పలువురు ఉండొచ్చు. కానీ ప్రేమించేందుకు ఒకే ఒక్కరున్నా చాలు. ఎంతటి కష్టాన్న యినా సులభంగా అధిగమించవచ్చు. 

కామెంట్‌లు