సుప్రభాత కవిత ;-బృంద
తూరుపును వెలిగించే
దీపం ఉదయిస్తున్న వేళ...

నింగిలో నారింజరంగు
నిండి నిలిచింది....

కొండలూ బండలూ
బంగారు రంగు అద్దుకున్నాయి

బింబం పైకొస్తూ వస్తూ
పసుపు వన్నెలు తెచ్చింది.

పాలమబ్బులు జలతారంచు
పరికిణీలు కట్టుకుని
అటూ ఇటూ పరుగు తీస్తున్న
చిన్నపిల్లల  లాగా  
మెరిసిపోతున్నాయి

పుడమి పై కిరణం
సోకినంత మేరా
పుత్తడి వెలుగులు నిండాయి.

తీగలన్నీ పువ్వులతో
నవ్వితే
గాలులేమో గంధాలు
రువ్వాయి.

గువ్వలు కిచకిచ మంటే
ఆకులు గుసగుస మన్నాయి.

జలజలా జారే జలపాతం
కలకలమంటూ  కులాసాగా
సాగిపోతోంది.

అణువణువున అందం
విరిసి అలరిస్తే
ముచ్చట పడే మనసులు
మురిసిపోతాయి

మనసు మయూరమైతే
జగము మధురంగా మారదా?

వేవేల వర్ణాల  కనువిందు చేసే
ఉషోదయపు  సౌందర్యానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు