సత్ఫలితం వరకూ సహనం తప్పదు;-- యామిజాల జగదీశ్
 అదొక అడవి. అడవి మధ్యలో ఓ సరస్సు. ఆ సరస్సులో ఓ బాతుకుటుంబం ఉంది. 
అడవంతా బాతు కుటుంబం స్వేచ్ఛగా తిరుగుతుండేది.
ఓమారు తల్లి బాతుగుడ్లు పెట్టి పొదిగింది.
కొన్ని పిల్లలు పుట్టాయి. అనంతరం అవి పెరుగుతున్న కొద్దీ రంగు రంగుల రెక్కలతో అందంగానూ చురుగ్గానూ కనిపించాయి.
కానీ వాటిలో ఒకటి మాత్రం పీలగా భిన్నంగా అహస్యంగా ఉంది. కంట్లో ప్రాణం అన్నట్టుగా ఉంది. దాని గొంతుకూడా మిగిలినవాటిలా కాకుండా భిన్నంగా కాస్తంత పొడవున ఉంది. తమతోనే పుట్టినప్పటికీ దానిని చూస్తేనే మిగిలినవన్నీ ఈసడించుకునేవి. హేళన చేసేవి. అంతెందుకు తల్లికికూడా గిట్టలేదు. దానిని ఒంటరిగా విడిచిపెట్టి మిగిలిన పిల్లలతో ఈదుతుండేది.
దాంతో ఈ బక్కపల్చటి బాతుకి మానసిక వ్యధ మొదలైంది. తనెందుకు ఇలా పుట్టానా అని బాధ పడుతుండేది. నన్నెందుకు దేవుడు ఇంత అసహ్యంగా పుట్టించాడా అని కుమిలిపోసాగింది. గుడ్డు దశలోనే తాను పోయుండాల్సిందని అనుకుంది.
రోజులు గడిచాయి.
మిగిలిన బాతులు మరింత అందంగా కన్పిస్తున్నాయి. ఇదేమే సన్నగా పొడవుగా ఎదుగుతోంది. ఆకర్షణీయమైన రంగూ కాదు.
తలమీదేమో పుల్లల్లా ఒకటి రెండు వెంట్రుకలు. వాటిని తలచుకుంటుంటే మరింత అవస్థ. 
రోజూ వేదన. రోదన.
కొన్నిసార్లు తోడబుట్టిన వాటికీ తల్లికీ దగ్గరవడానికి ప్రయత్నించేది.కాని అవి అన్నీ కలిసి తరిమిగొట్టేవి.
ఇంకొంత కాలం గడిచింది.
ఆసహ్యంగా ఉన్న ఈ బాతుపిల్ల వెంట్రుకలు ప్రకాశమానమై  తెల్లగా కనిపించాయి. తలమీది ఎదిగిన రోమాలు అందంగా మారాయి. రెక్కలూ బలంగా ఉండి వొత్తుగా మారాయి.
మిగిలిన బాతులకు దాన్ని చూస్తున్న కొద్దీ ఇది మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత ఆందంగా కన్పిస్తోంది.
తల్లి బాతుకీ మిగిలిన సోదర బాతులకూ ఆశ్చర్యమేసింది. దానిని సమీపించడానికి సిగ్గుపడేవి.
ఇంతకూ జరిగిందేమిటంటే ఒక హంస పొరపాటున అసలైన బాతు గూటిలో గుడ్డు పెట్టిపోయింది.
అది తెలీక తల్లిబాతు అది కూడా తన గుడ్డే అనుకుని పొదిగింది. అదే చాలాకాలం అసహ్యమై కన్పించిన పిల్ల. 
ఓరోజు అసహ్యంగా కన్పించిన హంస ఇప్పుడు అందంగా మారింది. రెక్కలు కొట్టుకుంది. చాచింది. పైకి లేపింది. ఇంతకాలమూ తనను చూసి అసహ్యించుకున్న వాటికి కన్పించనంత దూరంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. హంస గురించి ఒకటీ రెండు ముచ్చట్లు చూద్దాం.
హంస ఓ అందమైన పక్షి.  అనటిడే  కుటుంబంలో సిగ్నస్ తెగకు చెందిన పక్షులనే హంసలంటారు. ఇవి చూడటానికి  బాతులలాగే ఉంటాయి. హంస జాతిలో కొన్ని ఉత్తర ధృవంలోనూ, మరికొన్ని ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ, ఇంకొన్ని దక్షిణ అమెరికాలోను ఉన్నాయి.  ఆసియా ఖండంలో వీటి ఉనికి దాదాపుగా లేకుండాపోయాయి. హంసల్లో తెల్లవి, నల్లవి అంటూ ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడి నుండో తరలి వచ్చాయని చెప్పుకునేవారు. చదువుల తల్లి సరస్వతీ దేవి వాహనం హంస. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉంది. 
అందుకే అంటారు...నిజం మొదట్లో చేదుగానే అన్పించినా అది బహిర్గతమైనప్పుడు దానికున్న విలువ సామాన్యమైనది కాదు. స్థాయి పెరుగుతుంది. నిజాన్ని ఈసడించుకున్న వారు తలదించుకుంటారు సిగ్గుతో.
ప్రతి పనికీ ఒక్కో కారణముంటుంది. కనుక మంచి ఫలితం కలిసొచ్చే వరకూ సహనం తప్పదు. అందుకు ఓ కాలాన్ని నిర్దేశింస్తాడు భగవంతుడు. అప్పటివరకూ నిదానమే ప్రధానం అన్నట్టుగా ఓపిక పట్టాలి. మన ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలి.




కామెంట్‌లు