సుప్రభాత కవిత ; -బృంద
నిశీధిలో  అవనిలోని
అందాలూ చూసాయి...
ఉషస్సులో అంబరాన
సంబరాలు చూసాయి.

నింగికీ చెందనిదీ
నేలకూ దిగనిదీ....
నీలిమబ్బు అంతరంగం
ఎరిగింది ఒకటే...సముద్రం.

అలసిన మనసుకు
జోలలూ పాడగలవు
విరిసిన ఉత్సాహపు
చైతన్యదీపికలు కాగలవు

ఏ నావ గమ్యం ఏ తీరమో!?
ఏ మనసు తడి ఏ మమతదో!?

ఏ మబ్బు ఎక్కడ కురిసేనో!?
ఏ మనసు ఎందుకు మురిసేనో!?

ఏ అలలు ఏ వేపు నడుపునో!
ఏ నావ ఏ తీరం చేరునో!

అరుణకిరణాలు తాకి 
నింగి కనకవేదిక కాగా
పుత్తడి వెలుగుల తడిసిన
పుడమి ప్రభాతగీతం పాడె!

కెరటాల కదలికల నావ
తలవూచు చందాన సాగిపోయె!

సాగిపోవు  కాలంలో 
మళ్లీ  పొడిచిన మేలిపొద్దుకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు