సమీరరాజ్యం పొలిమేరలో నెమళ్ళదిన్నె గ్రామం ఉంది. అక్కడ నిత్యానందుడనే గురువు గురుకులం నడుపుతుండేవాడు. ఆయన పేద విద్యార్థులకు విద్య నేర్పేవాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చినది తీసుకుని కోరిన విద్యలు నేర్పేవాడు. చాలా నిరాడంబ రంగా జీవించేవాడు.
ఒకసారి ఆయన భార్య సీతమ్మకు జబ్బు చేసింది.తనకు తెలిసిన వైద్యం చేశాడు. నిత్యానందుడు.మార్పురాలేదు.
జయేంద్రుడనే వైద్యుడిని పిలిపించాడు. ఆయన సీతమ్మను పరీక్షించి"అయ్యా!ఈమెకు ఖంఠి అనే జబ్బు వచ్చింది. ఈ జబ్బుకు కనీసం సంవత్సర కాలం విలువైన మందులు వాడాలి. మందులకు చాలా ఖర్చవుతుంది"అని మందుల ఖర్చు గురించి వివరించాడు జయేంద్రుడు.
"అయ్యా!నాదగ్గర అంత ధనం లేదు. నా వద్దనున్న ధనం రెండుమాసాలు మందులు వాడటానికి మాత్రమే సరిపోతుంది" అన్నాడు నిత్యానందుడు .
"అయ్యా!ఈ జబ్బుకు ఖరీదయిన వాటితో మందులు తయారు చేయాలి.ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. మీ దగ్గరున్న ధనం ఇవ్వండి. రెండుమాసాలకు సరిపడేలా మందులు తయారుచేసి పంపిస్తాను. ఈరెండు మాసాల్లో మిగిలిన పది మాసాలకు అవసరమైన ధనం సమకూర్చు కోండి"అన్నాడు జయేంద్రుడు. నిత్యానందుడు తన వద్దనున్న ధనం ఇచ్చి మందులు తయారు చేసి పంపమన్నాడు. జయేంద్రుడు వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న శిష్యులు "గురువర్యా!అంతధనం రెండు మాసాల్లో ఎలా సమకూర్చు కోగలరు?మీకు ధనం సమకూరే వనరులు లేవు కదా!"అన్నారు.
ఆయన విద్యాభ్యాసం పూర్తయిన ఐదుగురు శిష్యులను దగ్గరకు పిలుచుకుని "మీకు విద్యాభ్యాసం పూర్తయింది. ఈరోజో రేపో వెళ్లబోతున్నారుకదా!జయేంద్రులవారు చెప్పింది విన్నారు కదా! వైద్యం ఖర్చులకు పదిమాసాలకూ సరిపడే ధనం మీరు నాకు గురుదక్షిణగా తెచ్చిఇవ్వండి. మీరు ఎలా సంపాదిస్తారో మీఇష్టం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ధనం సంపాదించినా అభ్యంతరం లేదు. మీ శక్తి కొలదీ తెచ్చి ఇవ్వండి"అని కోరాడు నిత్యానందుడు.
శిష్యులు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
రెండు మాసాల తర్వాత గురువు చెప్పిన సమయానికి గురుకులానికి వచ్చారు. ఆ సమయానికి జయేంద్రుడు అక్కడే ఉన్నాడు.నిత్యానందుడు వారినుద్దేశించి
" మీరు ఇచ్చే ధనం ఎలా సంపాదించారో చెప్పి ఇవ్వండి"అన్నాడు.
"గురువర్యా!తక్కువ కాలంలో ఎక్కువ ధనం సంపాదించడానికి అడ్డదారులేసరైన మార్గమనిపించింది.నాతెలివితేటలుఉపయోగించిమోసం చేసికొంతధనంసంపాదించాను" అన్నాడు పవనుడు.
"గురువర్యా!నేను రాజాస్థానంలో నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజుగారిచ్చిన ధనం తెచ్చాను" అన్నాడు సమీరుడు.
"గురువర్యా!నామిత్రులను, బంధువులను అడిగి కొంత ధనం తెచ్చాను"అన్నాడు దమనుడు.
"గురువర్యా!నేను ఒక జమీందారు వద్ద ఆర్థికవిషయాలు చూసే పనిలోచేరి రెండు నెలలుగా నమ్మకంగా పనిచేస్తున్నాను. రెండు నెలల జీతమేకాక మరో రెండు నెలలజీతం అవసరమని ముందుగానే అడిగి నా యజమానివద్ద తీసుకుని వచ్చాను" అన్నాడు విక్రముడు.
"గురువర్యా!మీరు నేర్పిన వైద్యవిద్య ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందించి కొంత ధనం సంపాదించి తెచ్చాను"అన్నాడు విజయుడు.
నిత్యానందుడు పవనుడు,దమనుడి వైపు కోపంగా చూసి "దొంగతనం,మోసంచేయడం తప్పని, సంపాదించే వయస్సు వచ్చాక తల్లిదండ్రులమీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించాలని, ఎవరి దగ్గరా చేయిచాచి ఉచితంగా అడుక్కోరాదని నేను చాలాసార్లు బోధించాను. నామాటలు పెడచెవిన బెట్టి కష్టపడకుండా ధనం సంపాదించాలని మీరు తప్పుడు మార్గాలు ఎన్నుకున్నారు"అన్నాడు.
అప్పుడు జయేంద్రుడు తన మారువేషం తీసేశాడు.ఆయన తమ రాజ్యం మంత్రి అని గుర్తించి శిష్యులు ఆశ్చర్యపోయారు. మంత్రి వారితో రాజాస్థానంలో పదవులకు నమ్మకమైన, ప్రతిభావంతులయిన యువకులుకావాలి.ఆపదవులకు అర్హతలుగల సన్మార్గంలో నడిచే వారిని ఎన్నిక చేయడానికి నేను నిత్యానందుల వారితో కలిసి ఆడిన నాటకం ఇది అనడంతో శిష్యుల ముఖాలు చిన్నబోయాయి. మీలో విక్రముడు, విజయుడు,సమీరుడు సరైన మార్గంలో నడిచారు. తక్కువ కాలంలోనే యజమాని నమ్మకాన్ని సంపాదించిన విక్రముడిని కోశాధికారిగా, విజయుడిని ఆస్థాన వైద్యుడిగాను, ఆస్థాన కవులలో ఒకరిగా సమీరుడిని ఎన్నిక చేసుకున్నాను. మీ నడవడిక కూడా మంచిగా ఉండిఉంటే మీకు సరిపడే పనిలో నియమించే వారము"అన్నాడు మంత్రి.
గురువు చెప్పిన మంచి మాటలను పెడచెవిన పెట్టి తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవడం వల్లనే తాము రాజు కొలువులో ఉద్యోగాలను కోల్పోయామని చింతిస్తూ,భవిష్యత్తులో సన్మార్గంలో జీవించాలని అనుకుంటూ ఇద్దరూ తాము తెచ్చిన ధనం ఎవరిది వారికి అప్పగించడానికి పవనుడు,దమనుడు
ఇంటి దారిపట్టారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి