చిలుకముక్కు బాగున్నదని
ఎరుపురంగు పెదవులకేసి
వన్నెలొలుకుచున్నది చిన్నది
కోకిలకంఠము ఇంపుగానున్నదని
తనగొంతును సవరించుకొని
అలరిస్తున్నది కలకంఠి
ముయూరినాట్యము సొంపుగానున్నదని
చేతులుకాళ్ళు లయబద్ధంగా కదిలించి
ముచ్చటపరుస్తున్నది ముదిత
హంసనడకల హొయలుచూచి
నడకను మార్చుకొని
మురిపిస్తున్నది కోమలాంగి
సుప్రభాత సూర్యునిచూచి
నుదుట సింధూరంపెట్టుకొని
కళకళలాడుతున్నది సుందరి
పండువెన్నెల జాబిలినికని
పౌడరు మోముకద్దుకొని
ప్రకాశిస్తుంది పడతి
సీతాకోకచిలుకుల రంగులుకాంచి
సంబరపడి చిత్తయి
వివిధవర్ణాల వలువలుధరిస్తుంది సుమబాల
కళ్ళనుచూచి దిష్టిపెడుతున్నారని
కనులకు కాటుకపెట్టి
కుతూహలపరుస్తున్నది కలికి
పూల అందాలనుచూచి
పరిమళాలను పీల్చి
పరవశించి తలలోతురుముకున్నది తరుణి
రత్నాలు రమ్యంగాయున్నాయని
కమ్మలలో పొదిగించుకొని
చెవులకు తగిలించుకున్నది సుందరాంగి
బంగారం వెలుగులు చిమ్ముతున్నదని
హారమును చేయించుకొని
మెడలోవేసుకొని మరిపిస్తుంది సింగారి
చేతులకు
గాజులుతొడుక్కొని
గలగలామ్రోగిస్తున్నది సుదతి
కాళ్ళకు
గజ్జెలుపెట్టుకొని
ఘల్లుఘల్లుమనిపిస్తున్నది కాంత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి