మనకీర్తి శిఖరాలు .;-ఆళ్ల వెంకటరామారావు . ;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఆళ్ల వెంకటరామారావు . ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు. ఔషధ రంగంలో కృషి చేశాడు. దాదాపు 30 పేటెంట్లు సాధించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకుడిగా సేవలందించాడు. దాదాపు యాభై రకాల ఔషధాల పరిశోధన, తయారీలో భాగస్వామ్యం వహించాడు. శాస్త్రసాంకేతిక రంగాల్లో అందించిన సేవలకు గాను ఇతనికి 1991లో పద్మశ్రీ , 2016లో పద్మభూషణ్‌ పురస్కారం వరించింది.
ఇతడు గుంటూరు పట్టణంలో సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతులకు 1935, ఏప్రిల్ 2న జన్మించాడు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బీఎస్సీ చదివి అనంతరం అప్పటి బొంబాయిలోని యూనివర్సిటీ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో ఔషధాలపై పరిశోధన చేశాడు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. నోబెల్‌ బహుమతి గ్రహీత ఈజే కోలీ వద్ద శాస్త్రవేత్తగా రెండేళ్లు పనిచేశాడు. అనంతరం భారతదేశానికి తిరిగొచ్చి పలు పరిశోధనలు చేశాడు. క్యాన్సర్‌, హెచ్‌ఐవీ వ్యాధులకు ఎన్నో మందులు కనుగొన్నాడు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా నిత్యం పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు.
ఇతడు తొలుత ఏసీ కళాశాల ప్రయోగశాలలో పనిచేశాడు. బాపట్ల వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ఏడాది పాటు సాంకేతిక
 నిపుణుడిగా పనిచేశారు. ఆ తరువాత పూనే లోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో 15 ఏళ్లు ఉప సంచాలకుడిగా సేవలందించాడుహైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి పదేళ్ల పాటు సంచాలకుడిగా ఉన్నాడు. పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో ఏవీఆర్‌ఏ లేబొరేటరీ, ఆర్‌డీ సంస్థలను నెలకొల్పి పలు ఔషధాలను తయారు చేస్తూ పరిశోధనలు చేస్తున్నాడు.
ఇతనికి భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
ఇతడికి పలు పురస్కారాలు లభించాయి. వాటిలో కె.జి.నాయక్ బంగారుపతకం, ఏసియాటిక్ సొసైటీ పురస్కారం, ఓం ప్రకాశ్ బాసిన్ అవార్డు, కెమికల్ రీసర్చ్ సొసైటీ బంగారుపతకం, డా.యల్లాప్రగడ సుబ్బారావు అవార్డు, రాన్‌బాక్సీ అవార్డు, పి.సి.రే పురస్కారం, వై.నాయుడమ్మ అవార్డు మొదలైనవి ముఖ్యమైనవి.
2016లో ఇతని సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

కామెంట్‌లు