*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - చతుర్థ (కుమార) ఖండము-(0240)*
 *మహాశివరాత్రి, శనిత్రయోదశి శుభాకాంక్షలతో...*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
గణపతికి పార్వతీ దేవి వరములు - దేవతల అగ్రపూజ - గణేశునకు సర్వాధ్యక్ష పదవి - గణేశ చతుర్ధి వర్ణన - స్థుతి.
*నారదా! దేవ గణములు, శివ గణముల ద్వారా పూజలు అందుకన్న గణపతిని చూసి, పరమానంద భరితుడు అయిన పరమేశ్వరుడు, గణపతితో ఇలా చెప్పారు*
*నాయనా! కుమారా!  గణపతీ! నీవు భాద్రపద మాసంలో, కృష్ణ పక్షము లో చతుర్థి తిథి నాడు, గిరిజా దేవి మనసు నుండి పుట్టావు. అప్పుడు, రాత్రి మొదటి జాము నడుస్తోంది. కనుక, ఆదినము నుండి ప్రారంభించి నీ ఉత్తమ వ్రతమును, దేవతలు, మునులు, మానవులు, ముల్లోకములలో ఉన్న అందరూ జరుపు కోవాలి. ఈ వ్రతము అన్ని సిద్ధులను ఇచ్చే, అతి శోభస్కరమైనది. ఈ జగత్తు లో ఉన్న వారు అందరూ, సుఖములు పొందడానికి, నీ ఈ వ్రతము తప్పకుండా చేయాలి. మార్గశిర మాసం కృష్ణ పక్షము చతుర్దశి నాడు ఈ వ్రతమును గురించి పురోహితులకు చెప్పి, విధి పూర్వకముగా నిన్ను పూజించాలి. పంచలోహములు, మొదలైన ఏదైనా ధాతువుతో గానీ, మట్టితో గానీ నీ విగ్రహం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, దివ్య గంధములు, చందనము, పుష్పములతో నీపూజ చేయాలి. సాయంత్రం మొదటి జాము గడిచాక, మళ్ళీ స్నానము చేసి, దూర్వార దళములతో, 20సార్లు గానీ, 100 సార్లు గానీ, నీ పూజ చేయాలి. అలా పూజకు వాడే దూర్వారములకు వేరులు ఉండకూడదు. ఇలా, ధూప, దీప నైవేద్యాలతో శోఢసోపచారముల పూజ చేసిన తరువాత, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తరువాత, బాలచంద్రుని పూజించాలి".*
*"ఆ తరువాత, పురోహితులను పూజించాలి. వారికి మృష్టాన్నభోజనము వడ్డించాలి. వారి భోజనము అయిన తరువాత, నీ వ్రతము చేసుకున్న వారు గణనాయకుడవైన నిన్ను తలచుకుని ప్రసాదము గ్రహించాలి. ఈ విధంగా సం. కాలం చేసిన వ్రతము ముగిసే టప్పుడు, వ్రత సమాప్తి కోసం, ఉద్యాపన కార్యక్రమం చేయాలి. నా ఆజ్ఞ ప్రకారం 12మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. వ్రతము చేసుకునే వారు, కలశము మీద నీ ప్రతిమను పెట్టి, వేద విదితముగా పీఠము చేసి, అష్ట దళ కమలము వేసి నీ పూజ చేయాలి. నీ విగ్రహం ఎదుట, ఇద్దరు స్త్రీలను, బాలకులను కూర్చోబెట్టి, వారి పూజ చేయాలి. భోజనము పెట్టాలి. రాత్రి జాగారము చేసి, మరుసటి ఉదయం పూజ చేసి, పునరాగమనము కోరుతూ విసర్జనము చేయాలి. గణేశా! శక్తి కొలది నిత్యము నీ పూజ చేసే వారి అన్న కోరికలు తీరుతాయి. నానా విధములైన శోఢచోపచారములతో నీ పూజ చేసే వారి అన్ని విఘ్నములు తొలగి పోతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని వర్ణముల వారు, స్త్రీలు ఈ పూజను చక్కగా చేసుకోవాలి." అని చెప్పారు శంభుడు.*
*ఆ విధంగా శంకరుని ఆశీస్సులు, వరములు పొందిన గణేశుని, దేవతలు, మునులు, యక్ష, గంధర్వ, కిన్నెరులు, మానవులు అందరూ వారి వారి శక్తి కొలది పూజించారు. నైవేద్యాలతో సేవించుకున్నారు. శివ గణములు కూడా ఆ పూజలలో ఆనమదంగా పాలు పంచుకున్నాయి. ఇది చూచిన ఉమ హృదయం లో ఆనందం తాండవమాడింది. జగత్తు లో శాంతి స్థాపించబడింది. అందరూ, ఈశానుని నుండి శెలవు తీసుకుని, తమ తమ స్థానలకు వెళ్ళారు.*
*శంకరులు ఇంకా ఇలా చెప్పారు. "గణేశుని చరిత్ర పుస్తకం ఎవరి ఇంట ఉంటుందో, వారికి అన్నీ మంగళకరముగా, సకల సంపత్కరముగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు, పుణ్య పర్వములలో గణేశుని స్థుతి చేస్తే సకలాభీష్టములు తీరుతాయి."*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు