*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0244)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*రుద్ర సంహిత లో, యుద్ధ ఖండము ప్రారంభము.*
తారకాసురుని కుమారులు - తారకాక్షుడు, విద్యున్మాలి, కమాలాక్షుడు - తపస్సు - బ్రహ్మ వరాలు - విశ్వకర్మ మూడు పట్టణములను నిర్మించడం - వాటి వర్ణన.
*తండ్రీ! విరించీ! దేవదేవుడు అయిన పరమేశ్వరుడు, నుదిటి పైన చల్లని కాంతులు వెదజల్లే చంద్రుని, కంఠంలో గరళాన్ని ధరించిన సర్వమంగళకరుడు. ఎల్లప్పుడూ మాయతో విహరిస్తూ ఉంటారు. అటువంటి పరమేశ్వరుని గృహస్థాశ్రమ, గణేశుని, కుమారస్వామి ల కథలను, నా మీద అనుగ్రహంతో వివరించారు. కానీ, లోకాలను సంరక్షించి, పోషించి, తనలోనే లయం చేసుకునే ఈశానుని, మోక్ష దాయకమైన కథలు ఎన్నిసార్లు విన్నా, తనివి తీరదు. రుద్ర దేవుడు లీలగా దైత్యులను వధించిన కథలు ఇప్పుడు నాకు చెప్ప వలసినది. దైవ ద్రోహులైన ముగ్గురు రాక్షసులను, ఒకే బాణంతో, ఒకేసారి ఎలా అంతం చేసారు. నా మీద కరుణతో వివరించండి. శంకరుని చరిత్ర, చరిత అందరికీ ఎంతో సంతోషాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది, కదా! తండ్రి.*
*నారదా! దేవర్షీ! ఇంతకు ముందు, వ్యాస భగవానుడు సనత్కుమారుని ఇదే ప్రశ్న అడిగినప్పుడు, సనత్కుమారుడు , శంకరుడు ,త్రిపురములను ఒకే బాణంతో భస్మము చేసిన కథను చెప్పారు. ఆ కథ, ఇప్పుడు నీకు చెపుతాను, విను.*
*తారకాసురునికి, తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురూ సమానమైన బలసంపత్తి కలిగిన వారు. ఇంద్రియాలను అదుపులో వుంచుకున్న వారు. ధృఢచిత్తులు, సత్య వాదులు, సంయమనము కలవారు. ఎల్లప్పుడూ, దైవ దూషణ చేస్తూ, దేవ కార్యములకు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. వీరు ముగ్గురూ, ఒకనాడు దివ్యమైన వరాలు సంపాదించాలి అనుకుని, కొండ గుహ లోకి వెళ్ళి, కొన్ని వేల సంవత్సరాల పాటు, దేవతలకు, రాక్షసులకు కూడా గురుతుల్యుడు అయిన బ్రహ్మ గూర్చి, అనితర సాధ్యమైన తపస్సు చేసారు. వీరి తపస్సు కు మెచ్చిన బ్రహ్మ, వారి ముందుకు వచ్చి, "నాయనలారా! మీరు దేవ ద్రోహులు అయినా, మీ దృఢమైన సంకల్పానికి, అచంచలమైన కార్య దీక్షకు మెచ్చి, మీకు వరములు ఇవ్వడానికి వచ్చాను. నేను అందరియందు, సమన్యాయం పాటిస్తాను. కనుక, మీకేమి కావాలి. అడగండి. మీ కోరికలు తీరుస్తాను" అని చెప్పారు, బ్రహ్మ.*
*"బ్రహ్మ దేవా! మేము ముగ్గరమూ చేసిన తపస్సుకు మెచ్చి, మీరు వరాలు ఇవ్వదలచుకుంటే, మాకు అమరత్వం ప్రసాదించండి. మేము ఎవ్వరి చేత సంహరింప పడకూడదు. మమ్మల్ని శాశ్వతులుగా చేయండి, తాత గారు. వృద్ధాప్యం, రోగాలు, మృత్యువు మా దరిదాపులలోకి రాకూడదు. మేము అందరినీ చంపగలగాలి. పుట్టిన కొద్ది కాలం లోనే చనిపోయేటప్పుడు, మాకు కలిగిన ఈ భోగములు అన్నీ వ్యర్థాలు అవుతాయి కదా!" అని "అజరామరత్వాన్ని" కోరుకున్నారు. అప్పుడు, బ్రహ్మ, శంకరుని తలచుకుని, "ఓ దేవ ద్రోహులారా! మీ కోరిక, అసంగతమైనది. అజరామరత్వము ఎవరికీ సాధ్యము కాదు. ఈ భూమి మీద పుట్టిన ఎంతటి మహిమాన్వితునికి అయినా, మరణము తధ్యము. పుట్టిన ప్రతి జీవికీ మరణము తప్పదు. యమపాశం నుండి ఎవ్వరూ తప్పించుకో లేరు. కనుక, ఇది తప్ప వేరే ఏదైనా కోరుకోండి అనుగ్రహిస్తాను. మీ ఆలోచనను వాడి, మృత్యవు సుళువుగా మీ దగ్గరకు రాకుండా ఉండే మార్గాలను కోరుకోండి" అని చెప్పారు, బ్రహ్మ.*
*అప్పుడు, లిప్తకాలం అలోచనలో ఉన్న త్రిపురాసురిని ముగ్గురు కుమారులు, తమకు, "బంగారు, వెండి, లోహము లతో నిర్మింపబడ్డ, అబేధ్యములై, సకల సంపదలకు అనవాలములై, శతృదుర్భేద్యములై, దేవతలు కూడా కన్నెత్తి  తేరిపారా చూడలేని, మూడు పురములను నిర్మించి ఇవ్వండి. ఈ పట్టణాలు గాలిలో తిరగుతూ ఉండాలి. కానీ, ఎప్పుడూ భూమి మీద స్థిరంగా ఉండకూడదు. అటువంటి, పురములలో మేము, ఈ భూమి మొత్తాన్ని, తిరుగుతూ చూస్తూ, మా సంతోషానికి ఇతరులను సంహరిస్తూ ఉంటాము. ఈ మూడు పట్టణాలు, మద్యాహ్నం అభిజిత్ ముహూర్తానికి, చంద్రుడు పుష్యమీ నక్షత్రముతో ఉన్నపుడు, ఒకే కాలమున, ఒక వరుసలో కలిసి ఉండాలి. ఒక వెయ్యి సంవత్సరాల తరువాత ఈ మూడు పురములు పరస్పరము కలవాలి. అప్పుడు, కృత్తివాసుడు, భగవంతుడు అయిన శంకరుడు వైరభావరహితుడై, సర్వదేవమయుడై, అందరికీ దైవము కావాలి. సకల సామగ్రినీ తీసుకుని, అసంభవమగు రథము మీద, సాటిలేని బాణముతో మా పురములను కూల్చాలి. శంకరుడు మాకు ఎల్లప్పుడూ వందనీయుడు, పూజనీయుడు. మేము ఆ భగవానుని పూజ మానము. కనుక, మేము చేసే పూజలు అందుకోవాలి కనుక, శంభుడు మమ్మల్ని చంపలేరు. అందువలన, ఇటువంటి దుర్లభమైన వరము అడుగుతున్నాము. మమ్మల్ని అనుగ్రహించండి, తాత గారు!" అని ప్రార్ధించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు