*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 068*
 కందం:
*లోకమున సర్వజనులకు*
*నాకాలుడు ప్రాణహారియై యుండగ శో*
*భాకృత కార్యముల వడిం*
*బ్రాకటముగ జేయకుండరాదు కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద పుట్టిన వారి అందరి ప్రాణాలు సమయం ప్రకారం తీసుకు వెళ్ళడానికి ఎప్పుడూ తయారుగా ఉంటాడు. అందువల్ల, మనం చేయవలసిన మంచి పనులను ఆలస్యం చేయకుండా త్వర త్వరగా చేయాలి. రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అని ఊరుకోకూడదు........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"కల్ కరేసో ఆజ్, ఆజ్ కరేసో అబ్ కర్" అని సంతులు చెప్పిన మాట. రేపు చెయ్యాలి అనుకునే పనిని ఈ రోజు చెయ్యి. ఈ రోజు చెయ్యాల్సిన పనిని ఇప్పుడే చేయి, అని అర్థం. ఎందువలన అంటే, ఏ బొందిలో ఊపిరి ఎప్పుడు ఆగి పోతుందో, మనకు ఎవరికీ తెలియదు. అందువల్ల, చేయాలనుకున్న మంచి పనులను "రేపు" అని ఆపకండి. ఇవాళ ఎవరికైనా డబ్బు సహాయం, మాట సహాయం, శ్రమదాన సహాయం చేయాలి అనుకుంటే, ఆ పని ఆలోచన వచ్చిన వెంటనే చేసేయండి. మరుసటి రోజు ఉదయం మన జీవితంలో ఉంటుందా? మనకు తెలియదు. అందుకే, ఉదయం నిద్ర లేస్తూనే, "పరమేశ్వరా! నారయణా! ఈ రోజు నీ దయ వల్ల సూర్యనారాయణ మూర్తిని చూడగలిగాను" అని నమస్కరించుకోమన్నారు. ఇదే నిజం కాబట్టి, "రేపు" అనే పదాన్ని "ఇవాళ" గా, "ఇవాళ" అనే పదాన్ని "ఇప్పుడు" గా మార్చుకునే సద్బుద్ధిని మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు