ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (15);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నా వివాహానికి ప్రేక్షకులు చాలామంది వచ్చారు. గోరా గారు మా ఇద్దరినీ బయటకు తీసుకొచ్చి  మా ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి  అదే వేదిక  అనుకోమని  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందు బొమ్మా రెడ్డి గారు,  విశ్వేశ్వర రావు గారు తర్వాత ఆకాశవాణి నుంచి వచ్చిన మా గురువుగారు నండూరి సుబ్బారావు గారు వారితో పాటు వచ్చిన మా అధికారి నండూరి విఠల్ గారు  ప్రసంగించిన తర్వాత గోరా గారు మా ఇద్దరికీ రెండు దండలు ఇచ్చి దండలు మార్చుకోమన్నారు.  తాళిబొట్టు కట్టడం లేదు దాని గురించి కూడా ఒకసారి చెప్పుతూ  ఈ సంప్రదాయం ఎక్కడుంది  మూడు ముడులు వేస్తేనే అది వివాహం అవుతుందా వేద కాలం నుంచి  ఎక్కడ ఈ సంప్రదాయం ఉన్నట్లుగా నాకు తెలియదు.
ఆ రోజుల్లో పాణిగ్రహణం  అంటే స్త్రీ పురుషుని చేయి తన చేతిలోకి తీసుకోవడం వివాహం అయినట్లే. తన శరీరంలో సగభాగం ఆమెకు ఇచ్చినట్లు అని వివరించారు.  చివరిగా నాన్న మాట్లాడుతూ  నాకు ఇలాంటి వివాహాలు చేయడం కొత్త కాదు వందల సంఖ్యలో జరిపించాను  కానీ ఈ క్షణానా నా కుమారునికి  చేస్తున్న ఈ మంచి కార్యక్రమం  నాకెంతో తృప్తినిచ్చింది. ఇతరులకు చెప్పి చేయించడం కాకుండా తాను చెప్పిన విషయాన్ని తన కుమారుడు  అనుసరించడం చరిత్రలో మొదటి సారి. భవిష్యత్తు మీ చేతులలో ఉన్నది అని చెప్పగానే అంగీకార సూచికంగా  కరతాళధ్వనులతో  ఆ ప్రాంతం  మారుమ్రోగింది. మా నాన్న మాట్లాడుతూ నా బిడ్డలు నలుగురకు నాహితుడైన  మాలపల్లి, మాదిగ గూడెం  నుంచి నా స్నేహితులను ఈ పరిసర ప్రాంత గ్రామాలలో ఉన్న వారిని అందరిని పిలిచి వైభవంగా పెళ్లి చేశాను. ఈ రోజున వీడి వివాహం మీ అందరి సమక్షంలో  మీ అందరి అంగీకారంతో జరుగుతోంది. ఇక్కడ ధనము అనే దానికి ప్రాధాన్యత లేదు. కట్న కానుకలు పెట్టు పోతలు  ఏమీ లేవు  నా మిత్రులు గోపరాజు రామచంద్ర రావు గారి  ఆశీస్సులు చాలు. నేను ఈరోజు ఏ ఒక్కరికి భోజనం పెట్టడం లేదు కారణం ఆర్థిక లోపం మాత్రం కాదు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న రైతులు  తమ ఇంట్లో వివాహ కార్యాలు జరిగినప్పుడు ఆరుమళ్ల సుబ్బారెడ్డి చేసిన దానికన్నా  మరింత ఎక్కువగా చేయాలని  ఆస్తులను అమ్మి నిరాశ్రయులయితారు. వారి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.

కామెంట్‌లు