ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (16); - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


  ఒకరోజు గోరా గారి దగ్గరకు వెళ్లి  విషయం అంతా చెప్పిన తరువాత  నాన్నగారు అంతా నాకు చెప్పారు  నీవు చేయవలసినది ఒకటే  సమాజం ఏదో అనుకుంటుంది. ఇతరులు ఏదో అంటారు వారి మాటలను పెడచెవిని పెట్టు. వారందరి మాటలను విని  మానసిక క్షోభను పెంచుకోకూడదు  అలా చేయడం వల్ల మీ కుటుంబంలో చీలికలు రావడానికి అవకాశం ఉంటుంది నీవు చేస్తున్నది నిజానికి మహత్తరమైన  మానసిక క్లేశంతో  కూడుకున్నది. ఎంతో సమర్థనీయంగా  జీవితంలో ప్రణాళికను నిర్ణయించకపోతే చాలా బాధలు పడడానికి అవకాశం ఉంది. ఏ పరిస్థితుల్లోనూ నీ కాబోయే భార్య గత జీవితాన్ని గురించిన ఒక్క మాట కూడా  నీ నోటి నుంచి రాకూడదు. అలా పొరపాటుగా వచ్చిన ఒక్కమాట చాలు ఆవిడ జీవితాన్ని నాశనం చేయడానికి  అని నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. తర్వాత బొమ్మా రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి  మా గ్రామ వాసి ప్రజాశక్తి సంపాదకులుగా బొమ్మా రెడ్డి పేరుతో ప్రసిద్ధులు  నన్ను కలిసి  ఎంతో ప్రోత్సహించారు  నీకే కాదురా మన గ్రామానికి  మంచి పేరు వస్తుంది నీవల్ల  మన గ్రామం చాలా ఆదర్శాలకు పుట్టిల్లు అవుతుంది అని ఎన్నో విధాలుగా నాకు నచ్చ చెప్పారు  అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న  వెల్లంకి విశ్వేశ్వరరావు గారు  ప్రత్యేకంగా నన్ను కలిసి  నీకు కావలసిన సదుపాయాలన్నీ నేను  వారితో చేయిస్తాను వారి పొలం ఇల్లు అన్నీ నీకు ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు  నాకు నిజంగా కోపం వచ్చి  వారి ఆస్తి కోసం నేను ఈ పని చేయడం లేదు నాకు ఇష్టమై  మా నాన్న ప్రోత్సాహంతో చేస్తున్నాను  అని చెప్పిన తర్వాత ఆయన ఎంతో ఆనందించి నీకు జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా ఉండాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని ఆశీర్వదించి వెళ్లారు. తర్వాత గోరా గారిని కలిసి మీరు చెప్పినట్లుగానే చేస్తాను నా అనుమానాలను తీర్చి నాకు ధైర్యాన్ని కలిగించిన మీరే  నా వివాహానికి సారధ్యం వహించాలి  అని చెప్పితే ముహూర్తం ఎప్పుడు అని అడిగారు మీకు ఎప్పుడు తీరితే అప్పుడే సరైన ముహూర్తం ఫలానా క్షణం అని చెప్పండి  ఆ క్షణానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పాను  నీకు ఆదివారం సెలవు కదా ఆ రోజున పెట్టుకుందాం  అనేసరికి అలాగే నిర్ణయం  తీసుకొని  నాన్నకు చెబితే అన్ని ఏర్పాట్లు నాన్నే చేశారు. ఇలాంటి సందర్భాల్లో  బంధువులు కూడా తక్కువగా వస్తారని ఇంట్లోనే ఏర్పాటు చేసి  మూడు కుర్చీలు వేసి సిద్ధంగా ఉన్నారు. గోరా గారు వచ్చేసరికి  ముహూర్తం నాలుగు గంటలకు పెట్టుకున్నాం కారణం ఏడు గంటలకు విజయవాడలో నేను నటించవలసిన చైర్మన్ నాటకం  వేదిక పైన ప్రదర్శించాలి కనుక  ఆ ముహూర్తం.


కామెంట్‌లు