పెద్ద మనసు ... చిన్నారులు సొంతంగా చదువుకునేలా సరళమైన పదాలతో రాసిన కథ.... డా.ఎం.హరికిషన్ కర్నూల్-9441032212.

 ఒక అడవిలో పెద్ద వేపచెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి. వాటిలో ఒక కాకి వుండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. దూరదూరంగా వుండేవి.
వానాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా చెక్కు చెదరకుండా బాగా గట్టిగా కట్టుకోసాగాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు. రేపు, ఎల్లుండి అనుకుంటూ రోజులు దాటేయసాగింది. వానాకాలం రానే వచ్చింది.
పెద్ద గాలి వాన వచ్చింది. వేపచెట్టు ఆ గాలికి తట్టుకోలేక పూనకం వచ్చినట్టు అటూ ఇటూ ఊగిపోసాగింది. పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్లలోనికి పోయి తలుపులు వేసుకొని గొళ్లెం పెట్టేసుకున్నాయి.
కాకిది పుల్లల ఇల్లు కదా.. ఆ గాలికి చెల్లాచెదరై పోయి కింద పడిపోయింది. దానికి రెండు చిన్న పిల్లలు వున్నాయి. వాటి మీద వాన పడకుండా రెక్కలు కప్పింది. కానీ వాన పెద్దదవుతూ వచ్చింది. పిల్లలు నెమ్మదిగా తడిసిపోతూ వున్నాయి. చలికి వణికిపోసాగాయి. ఇలాగే వుంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని భయపడి చిలుక ఇంటికి పోయి ‘చిలుకా.. చిలుకా.. కొంచెం తలుపు తీయవా. నేనూ నా పిల్లలు గాలివానకు చచ్చిపోయేట్టు వున్నాం’ అని వేడుకొంది.
కానీ ఆ చిలుక లోపల నుంచే ‘మాకే ఈ ఇల్లు సరిపోవడం లేదు. ఇంక నీకు చోటెక్కడ పో... పోయి వేరే వాళ్లని అడుగు’ అంది.
కాకి పక్కనే వున్న పావురం ఇంటికి పోయి ‘పావురమా.. పావురమా.. ఈ ఒక్కరోజు నీ ఇంటిలో కొంచెం చోటియ్యవా.. నా పిల్లలు ఏమైపోతారోనని భయంగా ఉంది’ అంది ఏడుపుగొంతుతో.
దానికి ఆ పావురం ‘పోపో.. అనవసరంగా అందరితో గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్క పూట కాదు కదా.. ఒక్క నిమిషం కలిసి వున్నా తప్పే’ అంది తలుపు తీయకుండా.
కాకికి ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే సమాధానాలు ఎదురు కాసాగాయి. ఒక్క పక్షి కూడా తలుపు తీయలేదు. దాంతో ఏం చేయాలో తోచక కళ్లనీళ్లు పెట్టుకుంది.
అంతలో ఒక గూటి తలుపు తెరచుకుంది. అందులోంచి ఒక చిన్న పిట్ట బైటకు వచ్చింది. కాకి అంతకు ముందు అనేక సమయాల్లో అనవసరంగా దానితో గొడవ పడింది. చిన్నది గదా ఏం చేయలేదులే అనుకుంటూ దాని ఇంటిలో దొంగతనాలు కూడా చేసింది. ఆ పిట్టను చూడగానే కాకి అవమానంతో తలవంచుకొంది.
పిట్ట చాలా మంచిది. అది చెల్లాచెదరైన కాకి గూడు చూసింది. వానకు వణికిపోతున్న కాకి పిల్లలను చూసింది. అయ్యో పాపం అనుకొని ‘కాకీ.. కాకీ.. అలా వానలో ఎక్కువసేపు వుంటే పిల్లలకు ఏమన్నా అవుతుంది. తొందరగా రా.. ఈ రోజు నా గూటిలో వెచ్చగా పడుకొందువుగాని’ అంది.
ఆ మాటలకు కాకి సిగ్గుతో మరింత ముడుచుకొని పోయింది. అది చూసి పిట్ట నవ్వి ‘ఆపదలో వున్నప్పుడు ఎదుటివాడు మనవాడా, పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలి అంటారు పెద్దలు. నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు.. దా.. తొందరగా.. సాటి పక్షికి సాయం చేయలేని బతుకూ ఒక బతుకేనా’ అంది.
కాకి వెంటనే తన పిల్లలను తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్లింది. ఇల్లు చిన్నదైనా చాలా గట్టిగా, బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెచ్చుకున్న గింజలు తెచ్చి, కాకికి, పిల్లలకు కడుపు నిండా పెట్టింది. అది చూసి కాకి కళ్లనీళ్లు పెట్టుకొని ‘సోదరీ.. నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధపెట్టాను. కానీ దాన్ని నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంది.
పిట్ట కిచకిచా నవ్వి ‘అంత మాటలు వద్దు.. తప్పు చేయని వాళ్లు ఎవరుంటారు చెప్పు ఈ లోకంలో. కానీ ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్లు అవుతారు. పదిమందితో కలిసి బతకడంలో వున్న ఆనందం ఒంటరిగా వుంటే ఎప్పటికీ రాదు. అది తెలుసుకో చాలు’ అంది.
ఆ తరువాత నుంచీ కాకి చాలా మారిపోయింది. కనపడిన వాటినల్లా పలకరించసాగింది. మాటలు కలపసాగింది. పనుల్లో సాయం చేయసాగింది.
********
కామెంట్‌లు