ఎర్ర రంగు చేప పిల్ల ... సంయుక్త అక్షరాలు లేని బాలల కథ-డా.ఎం.హరికిషన్ -9441032212-కర్నూల్
 ఒక వూరిలో మిన్ను అని ఒక చిన్న పిల్లోడు వుండేవాడు. ఒకసారి వాని పుట్టినరోజుకు బహుమతిగా వాళ్ళతాత ''నీకు నచ్చినది ఏదయినా కొనుక్కో'' అంటూ చేతిలో ఐదువందల రూపాయలు పెట్టాడు. మిన్ను ఆ డబ్బులను అనవసరంగా వాడుకోకుండా దాచి పెట్టుకున్నాడు.
      ఒకసారి ఆ పిల్లోడు బజారులో పోతా వుంటే ఒకచోట ఒకడు, పెద్ద బకెట్టులో, రకరకాల రంగురంగుల చేపలు చిన్నచిన్నవి అమ్ముతా కనబడ్డాడు. వాటి అమాయకమైన కళ్ళలోంచి నీళ్ళు కారిపోతా వున్నాయి. అవి బెదిరిపోతూ అటూ యిటూ తిరుగుతా గిలగిలా కొట్టుకుంటా వున్నాయి.
       మిన్నుకు వాటిని చూడగానే చానా జాలి వేసింది. తన దగ్గరున్న ఐదువందలు వానికిచ్చి ఆ చిన్ని చేపలను కొనుక్కున్నాడు. ఇంటికి పోయి ఒక పెద్ద గాజుతొట్టెలో వాటిని వేశాడు. కావలసినంత ఆహారం అందించాడు. ఆ చిన్ని చేపలు అది చూసి చానా సంబరపడ్డాయి.
      మిన్ను రోజూ బడికి పోయేముందు, బడి నుండి వచ్చాక వాటిని బాగా పలకరించే వాడు. వాన్ని చూడగానే అవన్నీ సంబరంగా దగ్గరకొచ్చి కిలకిలా నవ్వేవి. ఎగిరేవి. దుంకేవి. గంతులేసేవి. అలా కొద్దిరోజులు గడిచాయి. నెమ్మదిగా కొద్దిరోజులకు ఆ చేపపిల్లల్లో చురుకుదనం తగ్గిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక మూల దిగులుగా కూచునేవి. మిన్ను కనబడినపుడు, పలకరించినపుడు దగ్గరికి వచ్చేవి. కానీ అంతకు ముందులా వాటిలో చురుకుదనం లేదు. నవ్వుతున్నాయి కానీ నవ్వులో జీవం లేదు. ఎగురుతున్నాయి గానీ కళ్ళల్లో మిలమిలలు లేవు. ఎప్పుడూ ఏవో పోగొట్టుకున్న వాటిలా వుండేవి.
       మిన్ను ఒకరోజు చేప పిల్లలతో ''మీరు ఇక్కడ హాయిగా వున్నారా... నిజం చెప్పండి లేకపోతే నా మీద ఒట్టే'' అన్నాడు.
        చేపపిల్లలు ఒకదాని మొగం మరొకటి చూసుకున్నాయి. మిన్ను బాధపడతాడేమో అని ఏవీ నోరు తెరవలేదు. చివరకు ఒక ఎర్రరంగు చేపపిల్ల దగ్గరకు వచ్చి ''మిన్నూ... పిట్టలకు గాలిలో ఝుమ్మని అటూ యిటూ ఎగరాలని వుంటుంది. జింకపిల్లకు అడవంతా చెంగుచెంగున ఎగిరి గంతులు వేయాలని వుంటుంది. అలాగే మాకు నదుల్లో, చెరువుల్లో సర్రున అటూయిటూ సరదాగా ఈదాలని వుంటుంది. మా చేపలనంతా ఈ చిన్న గాజుపెట్టెలో బంధించి హాయిగా వున్నారా అని అడిగితే ఎలా. నీవు మా అందరినీ కాపాడావు. కడుపు నిండా అన్నం పెట్టావు. అందుకే నిన్ను బాధపెట్టడం బాగుండదని మా బాధ కడుపులోనే దాచుకున్నాం'' అంది. ఆ మాటలకు మిన్ను కళ్ళలోంచి జలజలజల నీళ్ళు కారాయి.
      అయ్యయ్యో... ముందే చెప్పొచ్చు గదా... ఆ నదుల్లో, చెరువుల్లో చానామంది వలలు వేసి, గాలాలు వేసి చేపలు పట్టి అమ్ముతా వుంటారు. అక్కడ వదులుతే మీకేమన్నా అవుతాదేమో అని ఈ గాజుపెట్టెలో పెట్టాను గానీ మీరు హాయిగా ఎగురుతా... దుంకుతా వుంటే నాకంతకన్నా సంబరం ఏముంటుంది. ఇక్కడికి కొంచం దూరంలో ఒక పెద్దనది వుంది. అక్కడ ఎవరూ చేపలు పట్టరు. మీ అందరినీ అక్కడ వదులుతాలే. హాయిగా వుండండి'' అంటూ వాటిని ఒక బిందెలో వేసుకొని నది దగ్గరికి తీసుకొని పోయి వదిలేసి వచ్చాడు.
      అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకసారి వానలు బాగా వచ్చాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు అన్నీ వుప్పొంగాయి. కందనవోలుకు దగ్గరలోనే సుంకేశుల ఆనకట్ట వుంది. అక్కడనుంచి కిందకు నీళ్ళు వదులుతా వుంటే చూడ్డానికి చానా మనోహరంగా వుంటుంది. దాంతో అనేక మంది అక్కడికి పోతుంటారు. సుంకేశుల ఆనకట్ట నిండడంతో ఒక్కొక్క గేటు ఎత్తుతున్నారు. మిన్ను కొంతమంది బడిపిల్లలతో కలిసి చూడ్డానికి పోయాడు. అక్కడ ఆనకట్టకు కొంచం దూరంలో చానామంది పిల్లలు ఈత కొడుతా వున్నారు.
      మిన్ను బడిపిల్లలతో కలసి సరదాగా నదిలోకి దిగాడు. మిన్నుకు ఈత రాదు. దాంతో లోపలికి పోకుండా  ఒడ్డుకు దగ్గరలో నడుము లోతు నీళ్ళలో ఆడుకోసాగాడు. అలా ఆడుకుంటా... ఆడుకుంటా... నవ్వుతా తుళ్ళుతా... కొంచెం లోపలికి పోయాడు. అక్కడ ఒక చిన్న గుంత వుంది. నీళ్ళలో అది కనబడదుగదా... దాంతో మిన్ను కాలుజారి దభీమని లోపల పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోతా గిలగిలా కొట్టుకోసాగాడు. అందరూ చిన్నపిల్లలే కావడంతో ఎవరూ లోపలికి పోకుండా భయంతో గట్టిగా అరవసాగారు.
       అంతలో అక్కడికి ఎర్రరంగు చేపపిల్ల వచ్చింది. మిన్నును చూసింది. వెంటనే 'కాపాడండి... కాపాడండి.. మా మిన్నును కాపాడండి' అంటూ గట్టిగా చుట్టుపక్కల చేపలన్నింటినీ పిలిచింది. నిమిషాల్లో వందల చేపలు అక్కడికి గుంపులు గుంపులుగా చేరుకున్నాయి. అన్నీ కలసి మునిగిపోతా వున్న మిన్నును ఒక్కసారిగా పైకెత్తాయి. అలా నీళ్ళలో మోసుకుంటా వచ్చి ఒడ్డున వదిలాయి.
       ఎర్రరంగు చేపపిల్ల చిరునవ్వుతో మిన్ను ముందుకు వచ్చి ''మిన్నూ... ఎలా వున్నావు. బాగున్నావా. మొన్న బాగా వానలు వచ్చాయి గదా. ఆ వరద నీళ్ళలో కొట్టుకొని ఇక్కడికి వచ్చి చేరా. కానీ అది మన మంచికే జరిగింది, నిన్ను కాపాడుకోగలిగా.
       నీళ్ళంటే పిల్లలకైనా, పెద్దలకైనా చానా సరదా. కానీ ఈత రాకుండా ఎవరూ నీళ్ళలో దిగకూడదు. ఎంతమంది చనిపోతావుంటారో తెలుసా ఇక్కడ. వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతా వుంటాయి. మనకు తెలియని కొత్తచోట పెద్దవాళ్ళ తోడు లేకుండా అస్సలు అడుగు పెట్టగూడదు. ఎక్కడ లోతుంటాదో, ఎక్కడ బురద వుంటాదో మనకు తెలీదు గదా. నీవు ఇంటికి పోయి మీ నాన్నకు చెప్పి తొందరగా ఈత ఎలా కొట్టాలో తెలుసుకో. అంతవరకూ ఇలా నీళ్ళ దగ్గరికి ఇంకెప్పుడూ రాకు. ఏం సరేనా'' అంది.
      మిన్ను అలాగేనంటూ ఆ ఎర్రరంగు చేపపిల్లను ముద్దు పెట్టుకున్నాడు.
***********

కామెంట్‌లు