సత్యమే జయము;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, గొప్ప రచయితలు చెప్పినా మంచి చేయమని అంటారు తప్ప చెడును చేయమని ఏ ఒక్కరు ప్రోత్సహించరు. మతాలు కూడా అంతే  ఏ మతము మరో మతాన్ని  అడ్డుకోమని కానీ హింసించమని కానీ చెప్పదు. శాంతము లేక సౌఖ్యము లేదు అంటూ  త్యాగరాజ స్వామి కీర్తన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే  వారు రాసిన దానికి ఎంతో కాలం ముందు  వేమన ఈ సూచన చేశాడు  మనిషి ప్రశాంత చిత్తుడై ఉండి  ఏ కార్యాన్ని సక్రమంగా చేయాలో ఆలోచించి  దానిని పద్ధతి ప్రకారం నిర్వహించినట్లయితే  ఆ పనిలో నీవు విజయాన్ని సాధించగలవు. ప్రణాళిక  లేకుండా ఆ కార్యక్రమాన్ని అడ్డదిడ్డంగా చేయడానికి ప్రయత్నం చేస్తే  దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది  కనుక ప్రశాంతత మనకు ఉండాలి. వేదంలో చెప్పిన సత్యం వద  (సత్యమునే పలుకుము) దాని వలన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసునా  జరిగినది జరిగినట్టుగా తెలియజేయడం, ఉన్న దానిని అతిశయోక్తులు లేకుండా  ఉన్నట్లుగా చెప్పడం,  మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది  అదే సత్యం వధ  (అంటే సత్యాన్ని చంపు అని) ఎవరైతే  నిర్వచిస్తూ  అబద్ధాల పుట్టగా మారిపోతారో, ఒక అబద్ధం చెప్పిన తర్వాత దానిని పూరించుకోవడానికి మరొకటి మరొకటి అలా అబద్ధాలు చెప్పుకుంటూనే పోవాలి. అలాంటి సందర్భాలలో ఆ మనిషికి మనశ్శాంతి ఎలా కుదురుతుంది. ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాన్ని ఎలా ఆడాలి అని ఆలోచిస్తాడు తప్ప ఈ అబద్ధాలు ఆడే దాన్ని ఎలా సమర్ధించుకోవాలి అన్న ఆలోచన తప్ప  మరొకటి లేకుండా మనసుని చీకాకు పరుస్తూ ఉంటుంది  కనుక అలా చేయవద్దు.
ఎప్పుడైతే పంతాలకు పట్టింపులకు  కట్టుబడి జీవితాన్ని కొనసాగిస్తావో  అప్పుడు తప్పకుండా కష్టాల పాలుకావాల్సిందే  తన సర్వస్వాన్ని పోగొట్టుకున్న ధర్మరాజు  చివరకు భార్యతో సహా జరిగినది ఏమిటి అడవుల పాలు కావడం అష్ట కష్టాలు పడడం  అయితే ధర్మరాజు నీతిని నియమాన్ని తప్పడు గనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని  ప్రతి చోట విజయాన్ని  సాధించాడు  సత్యం ఆయన వ్రతం  కనుక ఎలాంటి మానసిక క్లేశమునకు  లోను కాకుండా ప్రశాంత చిత్తముతో  కష్టాలన్నిటినీ ఎదుర్కొని  జీవితంలో  సాధారణంగా వచ్చేవే అన్న దృష్టిలో  వాటిని అధిగమించి  జీవితంలో విజయాన్ని సాధించడం ఆయన వంతు అయ్యింది  కనుక  తప్పకుండా సత్యానికి విజయం సంభవిస్తుంది  అని వేమన ఉవాచ ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.

"శాంతమున సకల కార్యము సంతోషంబునను బొందు సత్యము జయమౌ 
పంతము చెల్లును ధర్మజుడెంతేసి ప్రయాసముల జయించెను వేమ..."


కామెంట్‌లు